2927* వ రోజు ......... ....           31-Oct-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

2927* వ కష్టతర శ్రమదానం

          ఈ అక్టోబరు మాసాంతాన - మంగళవారం వేకువ 4.27 కే వీధి పారిశుద్ధ్య కృషికి దిగింది నలుగురు రెస్క్యూ టీమ్ సభ్యులైతే కాస్త వెనుకా ముందుగా బేషరతు మద్దతునిచ్చింది 6 గురు! ఈ ఉదయం కూడ వారి శ్రమ కేంద్రం గంగులవారిపాలెం బాటలోని కొలిమి మేస్త్రి గారి పాల ఉత్పత్తి కేంద్రం దగ్గరి మురుగు కాలువే!

          ఆ 25 - 30 గజాల లోతు డ్రైన్ నుండే – అంతకు ముందు కరెంటు పని వారు కొట్టి వదలిన కొమ్మలు గాని, ఇప్పుడు క్రొత్తగా పిచ్చి మేడి వంటివి నరికినవిగాని బండెడు వ్యర్ధాలు వచ్చినవి.

          ఇంకాస్త ముందుకు వెళితే ఊడ్చిన, డ్రైన్ నుండి లాగిన, ఎత్తిన విపట్టక ఒక చెత్త లోడింగ్ నిపుణుడు నేర్పుగా త్రొక్కి సర్దవలసి వచ్చింది! అసలివాళ్టి లోడింగే చాల రోజులు గుర్తుంటది.

          కాలవలో పడి నాని కంపుగొట్టుతున్న కొమ్మ రెమ్మల్ని బైటకు లాగడం గాని, ట్రాక్టర్లోకి అందించేప్పుడు బట్టల కంటుకొనే మురుగు చుక్కలు గాని – ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు ఇలాంటి పనులు?

          బురద గుంటల్లో కొమ్మలు కాకున్నా రోడ్డు రెండు ప్రక్కలా పడిన ఎండుటాకులైనా అక్కడి గృహస్తులు ఊడిస్తే స్వచ్ఛ కార్యకర్తల పని భారం తగ్గుతుంది.

          నేటి శ్రమదాన విజయ చిహ్నాలుగా పెద్ద ట్రక్కు నిండిన వ్యర్ధాలు, కార్యకర్తల బట్టల బురద మరకలు నిలుస్తాయి!

          6.20 సమయంలో గ్రామ సుందరోద్యమ నినాదాలు వినిపించినది తూములూరి లక్ష్మణుడు! కాఫీల సరదా తీర్చినది ప్రాతూరి శంకర శాస్త్రి మహోదయుడు!

          రేపటి వేకువ మన శ్రమదాన కేంద్రం విజయవాడ రోడ్డులోని HDFC బ్యాంకు దగ్గర!

          అమోఘంగా వారి పూనిక

పరిసరాలను బాగు చేస్తే స్వస్తతుందని వారి విజ్ఞత

హరిత సంపద – ప్రాణవాయువు అవశ్యకమని వారి కోరిక

కోరికలు సాధించు కొందుకు కష్టపడడం ఒక విశిష్టత

అందుకోసం దశాబ్దంగా అమోఘంగా వారి పూనిక!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   31.10.2023.