2928* వ రోజు ......... ....           01-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

1 వ నవంబరు వేకువ ఆనందకర సన్నివేశాలు! - @2928*!

            బుధవారం బ్రహ్మ కాలంలో 4.13 - 6.06 వేళల నడుమ జరిగిన దృశ్యాలవి! సదరు దృశ్యకారకులైన విచక్షణా మహిత వీధి పారిశుద్ధ్య కార్మికులు 7+20 మంది ( ఏడుగురు మహిళా కార్మికులన్న మాట!) దృశ్యకల్పనల చోటు బెజవాడ బాటలో HDFC బ్యాంకు నుండి MRO కార్యాలయ పర్యంతం! మరి ఆ దృశ్యాలేమంటే:

            మన కావ్యాల్లోని నవరసాల్లో భీభత్స రసం కూడ ఉన్నట్లుగా, తమ మేలుకన్న ఎదుటి వారి కీడు శాడిస్టులకు నచ్చినట్లుగా, మురుగుకంపుల్నీ, వీధి గుంటల్నీ అంతులేని సహనంతో మనం భరిస్తున్నట్లుగా.... ఇవేమంత సంతోషకర సంఘటనలు కావనుకోండి - అన్యాయమే న్యాయంగా, అక్రమమే సక్రమంగా అనిపిస్తున్నది అలవాటు పడిన వాళ్లకి!

            కాని - కాస్త సామాజిక ఇంగితం ఉన్నవాళ్లకి, పరిశీలన - అవగాహనా శక్తి ఉన్నవాళ్లకి మాత్రం బాగా సంతోషాన్నిచ్చే దృశ్యాలు వేఱుగా ఉంటాయి! ఉదాహరణకి

1. ఎక్కడా లేనట్లు ఈ చల్లపల్లిలో - 27 మంది ఊరి పారిశుద్ధ్యం కోసం తలా గంటన్నర శ్రమిస్తుంటే -

2. వారిలో 7-8 మంది ఒక కార్యాలయం ముందరి ఘాటు కంపుకొట్టే  మురుగు కాల్వలో వ్యర్థాలు తొలగిస్తూ, చెట్లను సుందరీకరిస్తూ గంటన్నర శ్రమిస్తుంటే

3. నిన్న పంచాయతి వారి కౌన్సెలింగుతో శివాలయం దగ్గర వీధిలో ఈ వేళ ఎవ్వరూ చెత్త వేయనందుకు మనలో ఒక ప్రముఖ వైద్యునికి పట్టరాని సంతోషం కలుగుతుంటే -

4. పగలు ఇంటి పనులూ, ఉద్యోగ విధులూ నిర్వహించవలసిన ఆరేడుగురు మహిళలు వీధి ఊడ్పుల బాధ్యతల్లో మునిగుంటే -

5. బ్యాంకు ఆవరణనూ, బైపాస్ వీధి అస్తవ్యస్తతనూ 10 మంది కార్యకర్తలు శుభ్రపరచి, గుంటలుంటే పూడ్చి, అదేదో సొంతింటి పనిలాగా చేసుకుపోతుంటే-

6. ఒకరుస్పీడుగా తిరుగుతున్న వాహనాల్ని కనిపెడుతూ - కార్యకర్తల్ని హెచ్చరిస్తుంటే

7. DRK వైద్యుడు నిర్విరామంగా అందరి అన్ని పనుల్నీ సమన్వయ పరుస్తుంటే

8. అసలిదంతా ఎలా సాధ్యం? 9-10 ఏళ్ల నుండి ఇందరు కార్యకర్తలు గ్రామస్తుల మేలుకై వేల రోజుల - లక్షల పని గంటలు శ్రమించడం?” అని నాబోటి సంశయాత్ములకనిపిస్తుంటే - 

9. సొంత లాభం కోసం కాక ఊరుమ్మడి సౌఖ్యం కోసం పనులు జరుగుతుంటే....

            మరి - ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్న కష్టకాలంలో పరమానందకర ఘట్టాలు కాక మరేమిటి ఇంతటి మధుర క్షణాల ఆస్వాదనకు అలవాటుపడ్డ కార్యకర్తలసలు విరమిస్తారా?

            6.25 సమయంలో 26 మందీ అర్థవలయంగా నిలబడి, సర్పంచిగా స్వచ్ఛ కార్యకర్తగా ద్విపాత్రాభినయం చేస్తున్న కృష్ణకుమారి గార్ననుసరించి, స్వచ్ఛ - సుందరోద్యమానికి జయజయధ్వానాలొనర్చడం మాత్రం సంతోషదాయక సంఘటన కాదూ?

            2-11-23 న మన శ్రమదాన ప్రారంభ స్థలం మండల రెవిన్యూ కార్యాలయంగా నిర్ణయించడమైనది!

            వీళ్ళెట్లా మానగలరు

తమ ఊరి మెరుగుదల చర్యలు ఒక్కనాటికీ ఆపరు

వీధి పారిశుద్ధ్య పనులు వీళ్ళెట్లా మానగలరు

పరస్పరాభి వాదములూ - ప్రగతి శీల నిర్ణయములు

లేని నాటి అసంతృప్తి నెట్లు తట్టుకోగలరు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.11.2023.