2929* వ రోజు ......... ....           02-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

గురువారం నాటి - @2929* వ వీధి పారిద్ధ్యం!

         2-11-23 నాటి శ్రమదానం కూడ వేకువ 4.13 - 6.10 వేళలోనే బెజవాడ మార్గంలోనే జరిగింది. ఈసారి తొలి డజను మంది కార్యకర్తలు ఆగి, పని మొదలుపెట్టింది మండలాభివృద్ధి కార్యాలయం నుండే గాని 27 మంది తుది సమావేశం ముగించినది రెవెన్యూ కార్యాలయం ముంగిట! (28 వ తాత్కాలిక వాలంటీరు ఒక ‘టీ’ దుకాణస్తుడు!)

         ఈ పూట కార్యకర్తల శ్రమ తాకిడితో శుభ్రపడ్డ ప్రదేశాల జాబితా కాస్త పెద్దది! ఎవరెవరి ఉత్సాహం ఏ ఫలితాలిచ్చిందని విడివిడిగా చెప్పలేను గాని – ఇవన్నీ సామూహిక సంకల్పాలూ, ఉమ్మడి ప్రణాళికా బద్ధ చర్యలూ కనుక – టూకీగా నేటి విశేషాలు పరిశీలిద్దాం!

         మనం ఇది వరకే చెప్పుకొన్నట్లు - ఈ స్వచ్ఛ కార్యకర్తలు పనిచోటుకు చేరగానే తాము డాక్టర్లమనో -  పాఠాలు చెప్పే ఉపాధ్యాయులమనో – వయసు మళ్లిన విశ్రాంత ఉద్యోగుల మనో – వృత్తి నిపుణులమనో చప్పున మర్చిపోతారు! గ్రామ సామాజిక కర్తవ్యం నెరవేరుస్తున్న సంతోషంలో మురుగ్గుంటలో దిగటమూ, వీధిని ఊడ్వడమూ, ఊడ్చిన ప్రోగుల్ని ట్రక్కులో నింపడమూ వాళ్లకు రొటీన్ పనులు!

         అందువల్లనే ఇంత పెద్ద గ్రామం వీధులు, శ్మశానాలూ, బహిరంగ ప్రదేశాలూ, ఊరి వెలుపల ఎనిమిదో తొమ్మిదో రహదారులూ ఈ పాతిక – ముప్పై - నలభై మంది శ్రమతోనే ఈ మాత్రం పరిశుభ్రంగా, హరితంగా, అందంగా, పూల పరిమళంగా, నయన మనోహరంగా కనిపించేది!

         ఈ 30 వేలకు పైగా చెట్ల – పూల మొక్కల హరిత వైభవమంతా ఈ కార్యకర్తల కష్టార్జితం! రోడ్ల గుంటల బాగుచేత వాళ్ల చెమట ఫలితం! కర్మకాండల భవనాలూ, ఆవరణలూ, బస్ స్టాపుల శుభ్రతలూ, పెద్ద కార్యాలయాల మనోజ్ఞతలూ వాళ్ల జాగరూకతలకు సాక్ష్యాలు!

         ఈ పూట మాత్రం తక్కువ పని జరిగిందా?

         రెవెన్యూ కార్యాలయ ఆవరణమూ, అంబేత్కరుని విగ్రహ పరిసరమూ, ఉద్యానమూ ఎంతగా శుభ్రపడలేదు?

         NTR పార్కు దగ్గర డ్రైను దగ్గరి పిచ్చి చెట్లూ, గడ్డీ, ఇతర కాలుష్యాలూ తొలగిపోలేదూ?

         వాహన ప్రయాణ సౌకర్యార్ధం 2 రోడ్ల గుంటలు పూడి కనిపించడం లేదూ? బైపాస్ వీధి మట్టి దిబ్బలు తగ్గి, సమమై పొందికగా కనిపిస్తున్నవా లేదా?

         మొత్తం మీద ఆ ½ కిలోమీటరు మార్గమూ, మార్జిన్లూ మెరుగుపడినట్లే కదా?

         నేటి సమీక్షా సభకు ముందు సాఫీగా స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను పసుపులేటి సత్యం నామక కార్యకర్త వినిపించి,

         పేదరికం ప్రయోజనాన్ని అడపా గురవయ్య వివరించి,

         ఈ 11-12 తేదీల నాటి మన తొమ్మిదేళ్ల శ్రమ వేడుకలను గురించి Dr. DRK విశ్లేషించి,

         అందరూ పండగ బట్టలు కొన్నట్లు – ‘మనకోసం మనంట్రస్టు ద్వారా కార్యకర్తలకు క్రొత్త చొక్కాలు, టోపీలూ అంది.... నేటి కార్యక్రమం ముగిసింది!

         మన పొరుగూరు దేవరకోట మూలాలు గల డా. దోనేపూడి శరత్ (అమెరికా) గారి నుండి గతంలో పదే పదే వచ్చినట్లే ఈ రోజు కూడా మళ్ళీ 50 వేల భూరి విరాళం ఈరోజున అందింది . వారికి మన స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.   

         రేపటి మన శ్రమ కార్యక్రమం కూడ పెట్రోలు బంకు వద్ద ఆగి మొదలెడదాం!

         నివాసయోగ్యం

ఊరిజనుల బాగోగులు - దురలవాట్లు, దుస్ధితులూ

పర్యావరణపు నష్టం పగలు రేలు మథనపడే

కార్యకర్తలున్న ఊరె గదా నివాసయోగ్యం!

అద్దానికి స్వచ్ఛ చల్లపల్లి గద ఉదాహరణం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.11.2023.