2933* వ రోజు ......... ....           06-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

హరిత సుందరోద్యమంలో 2933* వ నాడు!

            ఇది మరొక సోమవారం కావున రెస్క్యూ టీం వంతు! 6-11-23 వేకువ 4.23 కే ఆ నలుగురి ముఠా ట్రాక్టర్ లో తమక్కావలసిన పాతిక మొక్కలూ, నక్కులూ, పారలూ, చీడమందులూ, సర్దుకొని చినుకుల మధ్యనే నిన్న పని విరమించిన NH216 రహదారి మీదకి చేరుకొన్నారు.

            వాళ్లకు తోడు మరో ముగ్గురు పెద్దలం కాస్త ఆలస్యంగా చేరుకొన్నాం. పని నిన్నటిదే - రహదారికి దక్షిణంగా ఎర్ర తురాయి మొక్కలకు గోతులు త్రవ్వి, వేప మందు చల్లి, పాదును ముస్తాబు చేసి, నాటినదే!

            కార్యకర్తలు పనిచేస్తున్న గంటన్నరసేపూ వాన వాళ్లతో సరసాలాడుతూనే ఉన్నది. తడిసేందుకు రెస్క్యూ దళానికి అభ్యంతరం లేదు గాని - ఏట వాలు స్థలంలో బరువు మొక్కను పెట్టబోతూ - కార్యకర్త గట్టివాడే గాని - 2 మార్లు జారిపడ్డాడు.

            వానకు తోడు కరెంటు చీమల బెడద మరోటి! ఒడ్డున ఉన్న నాతో సహా ముగ్గుర్ని అవి మాటిమాటికీ పరామర్శించాయి!

            వర్షం పడే ఈ ఒక్కరోజన్నా ఆగొచ్చు గదా! బురదలో జారుతూ, బట్టలు బురద కొట్టుకొంటూ ఇంతగా కష్టించాలా?” అని నాకైతే అనిపించింది గాని – “సంవత్సరం పాటు ఈ మొక్కల్ని కాపాడితే - రంగురంగుల తురాయి చెట్లు విరగ పుప్పిస్తే జాతీయ రహదారి ప్రయాణికులకెంత హాయి గొలుపుతుందో గదాఅనేమో శ్రమదాతలాలోచిస్తారు!

            వైద్యశాల గేటు ముందే మాలెంపాటి వారి నాయకత్వంలో స్వచ్ఛ సుందర నినాదాలు వినిపించి, ప్రాతూరి ప్రాయోజిత కాఫీలు సేవించి, నేటి శ్రమదానం ముగించారు!

            సమాజమే ఆలయమని

అలనాడెవరో చెప్పిరి సమాజమే ఆలయమని

అలమటించు ప్రజలే తన అధి దేవతలని కూడా

సంఘమే శరణ్యమనుచుశాక్యమునే చెప్పెను గద!

అదే స్వచ్ఛ కార్యకర్తలాచరించు శ్రమవేడుక!

- నల్లూరి రామారావు,

   06 .11.2023.