2935* వ రోజు ......... ....           09-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!   

                          29 మంది శ్రమదాతల వీధి సౌందర్య ప్రయత్నం - @2935*

            అది గురువారం(9-11-23) వేకువ 4.20- 6.10 సమయానిది, బండ్రేవు కోడు కాల్వ వంతెన – NH 216 ప్రాంతం లోనిది, వర్షం కురిసి వెలిసిన చీకటిలో కాళ్లు జారకుండ జాగ్రత్తగా చేసిన విజయ వంతమైన శ్రమదానమది!

            అందులో మొదటి భాగం వంతెన నుండి హైవేదాక డజనున్నర మంది కత్తుల సాయంతోను, చేతులతోను సుమారు 40 ఏపుగా పెరిగి, పూలతో కళకళలాడుతున్న చెట్ల చుట్టూ గడ్డి, పిచ్చిమొక్కలూ తొలగించడమే! నలుగురు దంతెల వారు ఆ తడి గడ్డీ- వ్యర్ధాలను లాగి, ప్రోగులు పెట్టే డ్యూటీ నిర్వర్తించారు.

            7 గురు కార్యకర్తలకు బందరు రహదారి ఉత్తరపుటంచున పెద్ద మట్టి మేటను త్రవ్వి, డిప్పలకెత్తిట్రక్కులో నింపి, అడ్డదారి పడమర పల్లంలో నింపడం సరిపోయింది. 12 వ తేదీ ఉదయం మన స్వచ్చోద్యమ అతిథి జయ రాజు గారు ఆ రెండు చోట్ల మొక్కలు నాటాలి మరి!

            నేను సమర్పిస్తున్న శ్రమదాన నివేదికను చదివే ఎవరైనా 7 గురూ అక్కడి పెద్ద బండరాళ్లను కదిలించి, తరలించడం చూస్తే ప్రతి వేకువ కాలంలో జరిగే శ్రమదానం తేలికైనదీ, చప్పనైనదీ కాదనీ, ఎంతబరువు పనికైనా స్వచ్ఛ కార్యకర్తలు సంసిద్దులనీ ఒప్పుకొంటారు!

            ముగ్గురు కార్యకర్తలకు ఆ రెండు రోడ్లు ఊడ్చి, మెరుగుదిద్దడమే సరిపోయింది.

            నాలుగైదు నెలల నాడు గుంపెడు మంది దేశ వ్యాప్త వైద్య ప్రముఖులు. వచ్చి, వర్షంలో తడుస్తూనే, బురదలో జారుతూనే నాటిన సువర్ణ గన్నేరు పూల చెట్లు మంచి వానల్తో దిన దిన ప్రవర్ధములై పూలు పూసిన దృశ్యమొక వంకా, వంతెన దగ్గర గద్దగోరు వంటి చెట్లు విరగబూసి, ప్రయాణికుల చూపుల్ని కట్టి పడేస్తున్న సన్నివేశమింకొక ప్రక్కా !

            కార్యకర్తలెన్ని వందల పని గంటలు శ్రమిస్తే ఈ రహదారి ఆహ్లాదం దక్కిందోగదా!

            నేటి ముమ్మర శ్రమ సమయంలో ఒక అపశ్రుతి- బాగా చురుకైన, ఇందులో ఐదారుగురికి నమ్మిన నేస్తమైన శ్వేత శునకం వేగంగా వెళ్తూ గుద్దిన వాహనం వల్ల హఠాన్మృతి!

            6. 20 వేళ చల్లపల్లి శ్రమదాన సందేశాన్ని నినాదాలుగా ప్రకటించినది  ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడైన కస్తూరి శ్రీనివాసుడు.

            రేపటి వేకువ కూడ తమ బాధ్యతలిక్కడే బండ్రేవు కోడు వంతెన వద్దనే అనేది అందరి సమష్టి నిర్ణయము!    

                 పదే పదే తలవంచి

కోపిష్ణుని శాంతునిగా- గర్విష్టుని వినయునిగా-

బిడియస్తుని రోడ్లు ఊడ్చు వీరునిగా -బాధ్యునిగా

మార్చి వేయ జాలినట్టి మహనీయ స్వచ్చోద్యమ

 తాత్త్వికతకు పదే పదే తలవంచి నమస్కరింతు!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.11.2023.