2936* వ రోజు ......... ....           10-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

ఇది 2936* వ వేకువ శ్రమచరిత్రం!

            శుక్రవారం (10-11-23) వేకువ 4.16 కే షోడశ కార్యకర్తలతో శ్రీకారం జరిగి, 6.35 కు ముగిసిన చరిత్ర! ఐతే, నేనూ – నా మిత్రులు కొందరూ ఐదారడుగుల ఆలస్యంగా వచ్చి, (అమెరికా స్వచ్ఛ మిత్రుడు నాదెళ్ల సురేష్ సహా) కార్యకర్తల సంఖ్య 30 కి చేరి, సందడి బాగానే కుదిరింది!

            కార్యకర్తల్లో సగం మంది 2938* వ నాటి తొమ్మిదేళ్ల శ్రమదానోత్సవ ఉద్వేగంలో కనిపించారు! అసలు చల్లపల్లిలో అనేగాక - ఊరూరా ఈ సామాజిక శ్రమదానం ఎందుకు జరగాలో, నిధులు చాలీచాలని పంచాయతీలకు పౌరులు స్వచ్ఛందంగా ఇలా సహకరిస్తుంటే వచ్చే ఫలితాలేమిటో - తొమ్మిదేళ్ల నిర్విరామ – సుదీర్ఘ శ్రమదాన విశేషాలేమిటో - అటు పని జరుగుతూనే ఇటు చర్చలు కూడ జరిగాయి!

            ఈ గ్రామంలో ఇన్ని లక్షల పని గంటల కృషే జరక్కపోతే - ఊరి పరిస్థితి తెలా ఉండేదో - కొందరు కార్యకర్తల ఆరోగ్యాలేమైపోయేవో అని భయ సందేహాలు ఇద్దరి మాటల్లో తొంగి చూశాయి! ఒక విశ్రాంత వయోధికుడైతే ఏకంగా – “ఇక్కడి శరీర శ్రమా, కార్యకర్తల సుజన సాంగత్యం వల్ల వచ్చే మద్దతూ లేకపోతే ఆరేడేళ్లనాడే చచ్చేవాణ్ణి” అనేశాడు !

            “నిజమే కాబోలు! ఏ ప్రయోజనమూ లేకుండానే ఇందరు విజ్ఞులు సుదీర్ఘకాలం ఈ బ్రహ్మకాల సేవలు చేస్తారా? కొందరు సంశయాత్ముల దృష్టిలో సదరు లాభం - ఎక్కణ్ణుంచో వచ్చి పడే కోట్లాది ధనమో – పదవులో కావచ్చు గాని అంతకు మించిన లాభం ప్రతిరోజూ వాళ్లు పొందే మానసిక సంతృప్తే!

            ఇవాళ చేయడానికి పని తగ్గినట్లుంది. ఆరేడుగురు వంతెన దగ్గర నుండి మురుగు కాల్వ గట్టును శుభ్రపరిచారు. మరో నలుగురు వంతెన ప్రాంతాన్ని సుందరీకరించారు. సుందరీకరణ బృందం రహదారి కూడల్ని ఎంతగానో చదును చేసి, రెండు రోడ్ల గుంటలు పూడ్చి, మెరుగులు దిద్దారు!

            రహదారికి దక్షిణాన మట్టి దిబ్బను త్రవ్వడం, రాళ్లు ఏరడం, సర్దడం వంటి బరువు పనులు చేసిన 10 మంది పనీ బట్టల్ని చూస్తేనే తెలుస్తుంది!

            6.30 కు మొదలైన సమీక్షా సమావేశం అమెరికా - కనెక్టికట్ నుండి స్వచ్ఛ సుందరోద్యమానికి నాదెళ్ల సురేష్ “జై” కొట్టడంతో మొదలయింది!

            రేపటి - ఎల్లుండి కార్యక్రమాల చర్చ జరిగింది. ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీకి షణ్ముఖ శ్రీనివాసుని 1220/- విరాళంతో ముగిసింది! ఎప్పట్లాగే వైద్యదంపతులకు పట్టరాని సంతృప్తి దాయకమయింది!

            రేపటి వేకువ సైతం మన శ్రమదాన కేంద్రం గంగులపాలెం - బందరు ఉపరహదారి కూడలే!

 

ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం...

ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం - ఒనగూర్చిన ఫలితాలెన్నో

సామూహిక శ్రమదానంతో - సమకూడిన మేలదేమిటో... ఒక

 

ఉన్న ఊరి స్వస్తత కోసం కార్యకర్తల తపస్సు లెన్నో

మన సుందర స్వచ్చ ఉద్యమం – ఒన గూర్చిన ఫలితాలెన్నో

ప్రతి వేకువ గ్రామ వీధిలో - పారిశుద్ధ్య ప్రయత్నమెంతో

ఎండల - వానల - మంచు - తుఫానుల నెదిరించిన ఘట్టాలెన్నో

శ్మశానమున - చెత్త కేంద్రమున - సాగించిన సమరములెన్నో...

 

మన సుందర స్వచ్చ ఉద్యమం – ఒన గూర్చిన ఫలితాలెన్నో

సామూహిక శ్రమదానంతో – సమకూడిన మేలదేమిటో

 

స్వచ్చోద్యమ నేపథ్యంలో – జరిగిన మేధోమధనమ్ములు

రెండొ - మూడొ లక్షల గంటల – శ్రమ జీవన సన్నివేశములు

మురుగు కాల్వలు, రహదారులలో - మొగ్గ తొడిగిన హరిత సంపదలు

పొరుగూళ్లకు – రాష్ట్రవ్యాప్తముగ - పోటెత్తిన స్ఫూర్తి మంత్రములు

 

ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం- సాధించిన ఫలితాలెన్నో

 

గ్రామాల్లో చెత్తా చెదారం కనిపించని కాలమెప్పుడో

అడుగడుగున స్వచ్చ – శుభ్రతల – ఆనంద వికాసమెప్పుడో

ప్రతి పౌరుడు ఊరి బాధ్యతలు – పాటించు ముహూర్తమెన్నడో

అందరొక్కడై, ఒక్కడందరై – అడుగిడు శుభ సమయం ఏదో..

 

ఈ సుందర స్వచ్ఛ ఉద్యమం

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.11.2023.