2938* వ రోజు ...........           12-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

                     స్వచ్ఛ సుందరోద్యమ తొమ్మిదేళ్ల సంబరాలు! - @ 2938*

          ఆ  సంబరం ఆదివారం (12-11-23) వేకువ 4.30 నుండి ఉదయం 9.10 దాకమిన్ను ముట్టుతూనే ఉంది. 4.30 కు 65 మంది,5.00 కు బందరు రహదారి దగ్గర 75 మందీ,5.20 కి సభ ప్రారంభమైనప్పుడు 100 మందీ,ముఖ్య అతిథి మాట్లాడే సరికి 170 మందీ, చివరగా గ్రూపు ఫొటో- 8.20 కి 200 మందీ ప్రేక్షక శ్రోతలు.

         చల్లపల్లి జనులకైతే ఒకప్పటి జన విజ్ఞాన వేదిక వారి, ఇప్పటి స్వచ్చ కార్యకర్తల సభల వింతలు తెలుసుగాని, క్రొత్త వాళ్లకు – ఈ వేకువ సభ లేమిటో తెల్లార గట్ల పాదయాత్ర లెందుకో- పాదయాత్ర ముందు భాగాన డప్పులకు ఇద్దరి స్టెప్పు లేమిటో - -అసలిదేమైనా పెళ్లి వేడుకా?  కోటీశ్వరుల ఇంటి శుభకార్యమా-ఏమిటిదంతా అనిపించకమానదు!

          అది సరే!  రికార్డింగు డాన్సుల దగ్గర, డబ్బులిచ్చి తోలుకొచ్చే ఎన్నికల సభల వద్దా ప్రోగైనట్లు 200 మంది వేకువ పూట ఎలా వచ్చినట్లు? ఇంతాజేస్తే- సభకు అధ్యక్షులెవరు - శాలువా సన్మాలేవీ? ఏదో ఊరి వీధులూడ్చే కార్యకర్తల మెచ్చుకోలు కోసం ఒక నక్సలైట్ కవి భాగ్యనగరం నుండి వచ్చుటేమీ – చెట్లు నాటే పాటకు మదర్ థెరిస్సా స్కూలు పిల్లల డాన్సులేమీ - సింగరేణి బొగ్గు కార్మిక కవి జయరాజ్ అనుభవ సారాన్ని వివరిస్తుంటే కొందరి ఆనంద బాష్పాలెందుకూ - ఎక్కడా లేనట్లు పంచాయతీ పారి శుద్ధ్య  కార్మికులకు సత్కారాలేమిటీ..  బైట సాధారణ సభలను పోల్చుకొంటే ఈ తొమ్మిదేళ్ల స్వచ్ఛ సుందరోద్యమ సమావేశం ఏదో తేడా కొట్టడం లేదూ?

       అసలీ స్వచ్ఛ - సుందర చల్లపల్లే ఒక వింత, పెద్ద డాక్టర్లూ, ఉద్యోగులూ, వ్యాపారులూ, వృద్ధులూ, గృహిణీమతల్లులూ వేకువ 4.30 కాక ముందే ఏదొక రోడ్డు ఊడ్చడమో, మురుగుకాల్వను బాగు చేయడమో, శ్మశానాల సుందరీకరణమో చేస్తుండడమే ఒక తేడా, ఇక అలాంటి సజాతీయ పక్షులన్నీ తగుదుమమ్మా అని తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకోవడం అంతకన్నా పెద్దవింత!

          ఐతే ఆ సహజ కవి జయరాజ్ మాటల్లో - ఈ తేడా గాళ్ల సమసమాజ సాధకులు - తెలిసో తెలియకోగాని వాళ్ళే బుద్ధిస్టులూ మార్క్సిస్టులూ, అంబేద్కరిస్టులూ, ఒకనాటి మహత్తర భారత సమాజం ఎప్పటికైనా ఇలాంటి పిచ్చోళ్లతోనే బాగుపడాలట!

          నా దృష్టిలో ఒక ఆదర్శ స్వచ్ఛ - సుందర గ్రామానికి తగిన సమావేశమంటే ఇదీ!

           జీర్ణమైపోతున్న మానవ విలువల పునరుద్ధరణ ప్రయత్న మిలాగే ఉండాలి!  సామాజిక విలువల్ని స్పష్టించే పరిశీలకులకు ఈ సన్నివేశాలు చిరస్మరణీయాలు!  మానవ శ్రమకు ఖరీదు కట్టే ఉపన్యాసాల మధురక్షణాలివే!

          ఈ వింత సభకు తగ్గట్లే ఉన్నది ఇవాలటి  మన శ్రమదానోద్యమ ఆస్థాన గాయకుని గాన వీరావేశం! అతడు డాన్స్ ఒక్కటే చేయలేదు గానీ, శ్రోతల మనసుల్ని మాత్రం నృత్యం చేయించాడు. ఇలాంటి ప్రత్యేక సమావేశంలో  మళ్ళీ ఎన్నటికీ పాల్గొంటానో! మళ్ళీ ఎప్పటికైనా ఇలాంటి సభ ఒకటి మన డాక్టర్ DRK– పద్మావతి ఆధ్వర్యంలోనే జరగగలదు.  

          ఇక నేటి స్వచ్చోద్యమ చందా పూర్వక  ఆదాయ వివరాలు:

          1. మనకోసం మనం ట్రస్టు కార్యవర్గంలో పిన్న వయస్కురాలైన దాసరి స్నేహ గారి లక్ష రూపాయాలూ,

          2. మళ్ళీ మరొకమారు శాస్త్రి మహాశయుని 10,000/- విరాళమూ,       

          3. పాగోలు నివాసి కంఠమనేని రామ బ్రహ్మం గారి 2,000/- విరాళమూ,

          4 . మాలెంపాటి వారి 2000/- వితరణమూ

          ఈ నాటి కార్యక్రమమంతా చూశాక నాకు కలిగిన నమ్మకమేమంటే- ఈఊరి స్వచ్చ- సుందర-శ్రమదానోద్యమానికి మరో 9 ఏళ్లు ఢోకా  లేదని!  అందరికీ నవ వసంతాల స్వచ్చ- సుందర వార్షికోత్సవ శుభాకాంక్షలు -

          వింతగొలిపే సన్నివేశం!

సమాజంలో గొప్ప వెజ్జులు, ప్రబోధాత్మక పనుల ఒజ్జలు

డెబ్బదెనుబది ఏళ్ల పెద్దలు, గడపదాటిన గృహిణులిందరు

ఊరికోసం వచ్చి ఇంతగ శ్రమించే సుమనోజ్ఞ, దృశ్యం

ఎంతచూసిన తనివి తీరని వింతగొలిపే సన్నివేశం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12 .11.2023.