2939* వ రోజు ....... ....           13-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదగునా!

స్వచ్చ – సుందరీకరణ పని దినాల వరుస సంఖ్య – 2939*

          నడుస్తున్న చరిత్రను నమోదు చేయడం తప్ప ఇదేమీ సంఖ్యా శాస్త్రం కాదనుకోండి - సోమ మంగళవారాల్ని చాల కాలం క్రితమే సొంతం చేసుకొన్న రెస్క్యూ కుర్రాళ్ల - వాళ్లకి సహకరిస్తున్న ఇంకొందరు వయోధిక కార్యకర్తల - 13-11-23 అనగా దీపావళి పండగ నాటి పనుల్ని వివరిస్తాను.

          ఈ పూట వాళ్ల కార్యరంగం మరొక మారు గంగులవారిపాలెం సమీపంలోని ఉప రహదారిగానూ, పని వేళ 4.25 - 6.12 గానూ తేలింది. NH216 చల్లపల్లి మలుపు దగ్గర మొన్న పెట్టిన పూల మొక్కల దగ్గర నిలబడి ఏదో ప్రణాళిక రచిస్తున్న వాలంటీర్లు కనిపిస్తున్నారా?

          అప్పటికే మంచు – చలీ రహదారి ప్రయాణికులకు అనుభవంలోకి వచ్చాయి. మన స్వచ్చోద్యమ ఆస్థాన ఛాయాచిత్రకుడు శాస్త్రీజీకి గాని – 84 ఏళ్ల మాలెంపాటి డాక్టరుకు గాని వాటి తాకిడి తగలక పోవడాన్ని గమనించాను.

          చిన్నపాటి పారిశుద్ధ్య లోపాల్ని చక్కదిద్దాక గునపాలు తీసుకొని బండ్రేవుకోడు వంతెన - దాకా 16 లాంటానా, గద్ద గోరు పూల మొక్కలు నాటారు. అసలిక్కడ ఏడడుగులకొక మొక్క పెరుగుతూ, పూస్తూ 16 మొక్కలెలా నాటారంటే - మూడో నాలుగో చిన్న మొక్కలు బ్రతకలేదు. మిగిలిన డజను పూల చెట్లూ ఇరికించి నాటినవే!

          కార్యకర్తలకు ఇదొక రహదార్ల సుందరీకరణ - హరితీకరణ మేనియా అన్నమాట! మరొక మహిళా కార్యకర్త వంతెన దగ్గరా, ఆ ప్రక్క ఇంటి వారు కాల్చిన టపాసుల వ్యర్థాల దగ్గరా ఊడుస్తూ కనిపించారు!

          వీళ్లు 6.20 కి పద్మాభిరామం దగ్గరకు చేరుకొని, ఎప్పట్లాగే పిడికిళ్లు బిగించి, సీనియర్ డాక్టరు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ - సుందర నినాదాలు చేసి, ఆ పైన శాస్త్రి గారి కాఫీల మాధుర్యాన్ని చవి చూశారు!

          శ్రమ ప్రాభవ మిక్కడున్నది!

స్వచ్ఛ సంస్కృతి పాదు కొలిపే శ్రమ ప్రాభవ మిక్కడున్నది

అన్ని కాలుష్యాలపై ఆదర్శ సమరం జరుగుచున్నది

హరిత వీధుల పూల సొగసుల వ్యాప్తి నిత్యం సాగుచున్నది

అందుకే ఇది “స్వచ్ఛ సుందర చల్లపల్ల” నిపించు కొన్నది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.11.2023.