2942* వ రోజు ..........           16-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

2942* వ రోజు కూడ గంగులవారిపాలెం బాటలోనే!

ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే!  సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!

“చాల రోజులుగా ఈ ఒక్క వీధికే కార్యకర్తల సేవలు పరిమితం కావడమేమిటీ? ఊళ్లో మిగిలిన రోడ్ల సంగతేమిటి? కార్యకర్తలకసలు విసుగు పుట్టడంలేదా?”  అనే సందేహాలు ఈ బజార్లో పాదచారులకు వచ్చి ఉండొచ్చు!

నిజమే - ఈ ఊరే గత 9 ఏళ్లుగా ఒక వింత!  3 లక్షల పని గంటల శ్రమదానం మరో వింత! ఊళ్లో కెల్లా గంగుల పాలెం వీధి శుభ్రతా, పచ్చదనాలూ, పూల వైభవాలూ వింతల్లో వింత !  అలాంటి అందమైన రోడ్డుకు ఇంకా ఇంకా మెరుగులు దిద్దాలనుకొనే కార్యకర్తల ప్రయత్నం ఇది!

మరోవైపు నుండి చూస్తే- ఈ కిలోమీటరు దారికేంతక్కువని! కార్యకర్తలకు మాత్రం చేయవలసిన పనులకేంలోటని ! ఇప్పటికీ ఇంత మంచి వీధిలో చంద్రుడిలో మచ్చల్లాగా ప్లాస్టిక్ సంచులూ, సీసాలూ, మూటలూ పడేసేవారులేకనా? ఎప్పటికప్పుడు వానల్తో పెరిగే గడ్డీ, పిచ్చి మొక్కలూ దొరకవనా?

నేటి కొన్ని విశేషాలు :

- దెబ్బతిన్న కాలుతోనే ఒక అన్నపూర్ణ కార్యకర్తల్లో కలిసిపోయి, కూర్చొనే చుట్టూ శుభ్రం చేయడం,

- 8.00 కు ఆస్పత్రి మందుల కొట్టు డ్యూటీ ఉన్న ఒక దోనేపూడి చందు రోజూ వచ్చి చేయగలిగినంత పనిచేసి, గబగబా వెళ్లిపోవడం,

- ఒక హోటల్ మేనేజరమ్మా, ఒక మాజీ వార్డు మెంబరమ్మా శ్రమ దాతల్తో పోటీ పడి పని చేసిన వైనం,

- అర్జెంటు పనిమీద బెజవాడ వెళ్ళున్న వైద్య ప్రముఖులు పావుగంటైనా సరే- వచ్చి, అందర్నీ కలిసి, సంతృప్తితో వెళ్లడం,

- అటు బరువు పనులకీ, ఇటు నగిషీ పనులకీ పనికొచ్చేఒక దుర్గా ప్రసాదుకు వరుసగా రెండ్రోజులూ గద్దగోరు ముళ్లు చేతికి చీరుకొని నెత్తురు కారడం....

            అసలీ పాతికమంది పని విన్యాసాల్నీ, చతుర్లనీ, పని నడుమ కేరింతల్నీ వివరంగా వ్రాయాలంటే స్థల- సమయాభావాలు అడ్డు పడ్తున్నాయి!

6.30 కి పైడిపాముల సర్పంచిగారి నినాదాలతోనూ, పాతికమంది ప్రతి నినాదాలతోనూ తుది సమావేశం ముగిసెను! 

మిగిలిపోయిన మరికొన్ని వీధి నగిషీ పనుల నిమిత్తం రేపటి వేకువ కూడ మనం కలుసుకొనే చోటు గంగులవారిపాలెం వీధి మలుపులోనే!

సాష్టాంగ ప్రణామములు!

అందలమెక్కుట కన్నా అది మోయుట మేలనుకొని

వీధులు చెడగొట్టుకున్న శుభ్రపరచుటే మిన్నని

సామాజిక సామూహిక సంతోషమే చాలనుకొని

సాగుచున్న వీరులకివె సాష్టాంగ ప్రణామములు!

- ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త

   16.11.2023.