2944* వ రోజు ...... ....           18-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మనోల్లాస దాయకమైన మరొక శ్రమదానం - @2944*

శనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమిన్నగా 38 మంది హాజరయ్యారు! అందుకొక కారణం వారాంతమైతే ఢిల్లీ నుండి వచ్చి చల్లపల్లి శ్రమదానంలో పాల్గొంటున్న ప్రముఖ రచయితా, పర్యాటకుడూ దాసరి అమరేంద్రను చూడాలనే ఉత్సుకత మరో కారణం.

నాతో సహా కొందరికైతే తొలుత ‘ఇదేమిటీ - 3 రోజుల్నుండీ ఇంత మంది ఒకే చోట చేసేంత పనేముంది’ అనిపించింది గాని – పని జరుగుతున్న 100 గజాల మేరా తిరిగి, చూశాక గాని అసలు సంగతి బోధ పడింది!

- బండ్రేవుకోడు మురుగు కాల్వ, దాన్లో కలిసే ఊరి డ్రైనూ కలుస్తున్న చోట ఒక 63 ఏళ్ల విశ్రాంత BSNL ఉద్యోగి - మనిషి చూస్తే గుప్పెడంత - అతడు అమాంతం రెండు ప్రక్కల మురుగులో దిగి, మొక్కలు పీకి - తుక్కులు లాగి చేసిన పని చూస్తే ముగ్గుర్నలుగురి కష్టం!

- నలుగురు గృహిణులు – వాళ్ళు బొత్తిగా యువతులేం కాదు - అందులో ఒకామెది ప్రమాదంలో నుగ్గైన కాలు – మరొకామెకు నడుం నొప్పీ - ఇద్దరు వియ్యపురాళ్లూ - సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే కొడవళ్లతో గడ్డిని చెక్కి, దంతె - చీపుర్లతో ప్రోగులు చేస్తున్న వైనం

- ఇద్దరు రైతు కార్యకర్తల చురుకుదనమూ, 3 గ్గురు ఆసుపత్రి ఉద్యోగుల ఉత్సాహమూ, కరెంటు తీగలందుకోబోతున్న చెట్ల కొమ్మల తొలగింపులో చూశాను. 84 ఏళ్ళ వైద్య వృద్దుడు మోకుతో చెట్టు కొమ్మను లాగుతున్న వాట్సప్ చిత్రాన్ని మీరూ చూడవచ్చు!

- ఐదారుగురికి ఎక్కడ పని దొరుకుతుందా అని చూశా. ఆ ప్రక్కన తూర్పుగా ఖాళీ స్తలంలో అడ్డదిడ్డంగా పెరిగిన దిక్కుమాలిన పిచ్చి - ముళ్ల చెట్ల మీదకి వాళ్లు దాడి చెయ్యనే చేశారు!

- కార్యకర్తల్లో ఎవరు ఖాళీగా - సోమరులుగా ఉన్నారు గనుక! అలా ఉండాలనుకొంటే ఈ చలిలోకి రాక – ముసుగుతన్ని మంచాలపైన ఉండే వాళ్లు గదా!

- 70 ఏళ్ల నేటి ముఖ్య అతిథి కూడ ఇదే మంచి అదృష్టమనుకొని చీపురుతో రోడ్డు ఊడుస్తూనే ఉండె! ఊడ్చిన కసవూ, ఆకులూ ప్రోగు పడ్డప్పుడది ఆయనకొక నిధిలాగా మురిపెంగా తోచిందట! చెట్టు పాట వింటూ అమరేంద్ర గారొక మంచి మొక్క నాటారు కూడ!

ఇలా చెప్పుకొంటూ పోతే - నేటి ప్రాభాత కర్తవ్య విశేషాలు చాలానే ఉన్నాయి. కూలి డబ్బులకో, ఈ కార్యక్రమం ద్వారా ఇతర లబ్దికో జరిగే శ్రమైతే గదా - ఒక నిర్దిష్ట సామాజిక బాధ్యతగా నిత్యం జరిగేది కాబట్టి - ఇదెప్పుడూ ఉత్సాహంగానే – సంతృప్తిగానే – సృజనాత్మకంగానే ఉంటుంది మరి!

ఒక ట్రస్టు కార్మిక పర్యవేక్షకుడి చేతి వ్రేలికి కత్తిగాటుపడి, కట్టుతోనే పనిచేయడమూ, బరువైన దుంగల్ని మోయడమూ - ఇలా విశేషాలకేం లోటు?

సమీక్షా కాలంలో:

- నందేటి శ్రీనివాసుని గళ వినిర్గళ స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు, ఉద్యమ సందేశాత్మక పాటల ఆలాపనా,

- నల్లూరి శివకుమారి చెక్కు రూపంగా ఇచ్చిన 9000/- విరాళమూ,

- దాసరి అమరేంద్ర గారు స్వచ్చోద్యమాన్ని ప్రశంసించడమూ,

ఇవిగాక రేపటి వేకువ శ్రమదాన కేంద్రం గంగులవారిపాలెం రోడ్డు మూలే అనే నిర్ణయమూ వగైరాలన్న మాట!

సమర్పిస్తాం ప్రణామంబులు!

‘సమాజ బాధ్యత’ అనే పేరిట సదుద్దేశం తోడ మొదలై

హరిత సంపద - పూల తోటల నంతకంతకు విస్తరిస్తూ

శ్రమనెకాక - శ్రమార్జితమ్ములు గ్రామమునకే ధారపోసే

స్వచ్ఛ సుందర కార్యకర్తకె సమర్పిస్తాం ప్రణామంబులు!

- ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త

   18.11.2023.