2945* వ రోజు ...... ....           19-Nov-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

2945* వ నాటి శ్రమదాన విశ్వరూపం!

            అసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్కిరిసినట్లు 53 మంది శ్రమదానం! మహిళలతో సహా భవఘ్ని - శాయినగర నివాసుల ప్రవేశంతో కళకళలాడిన వీధి పారిశుద్ధ్య సంగామ్రం! ఇంతా జేస్తే - స్వయంగా వచ్చి, చూసి, పాల్గొన్న వారిదే గదా ఈ ఆనందం!

            ఊరి ఇతర ప్రాంతాల్లో కూడ ఇలాగే ఎక్కువ మంది వచ్చి, కాలుష్యం మీద యుద్ధంలో పాల్గొంటే? ఎవరి బజారును వాళ్ళిలా శుభ్రంగా - అందంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తే? స్వయంగా పూనుకోకున్నా - తమ వీధికి కార్యకర్తలు వచ్చినప్పుడైనా ఇలా సహకరిస్తే? తాము ఎక్కడో కాదు – “స్వచ్ఛ - సుందర చల్లపల్లి”లో ఉంటున్నామనే స్పృహ ఊరి జనులందరి మనసుల్లో నాటుకుపోతే ...... అప్పుడీ చల్లపల్లి మరీ న్యూజిలాండూ స్విడ్జర్లాండూ కాకున్నా ఒక ఇండోర్ గా మారడమెంతసేపు?

            మనుషుల బుర్రలు చేసే విచిత్రం చూశారా! వేకువ 4.00 కే విజయవాడలో బయల్దేరి, 4.56 కే చల్లపల్లి వీధి పరిశుభ్రతా కృషికి ఒక ప్రముఖ వైద్యుడు 85 కిలోమీటర్లు దాటి వచ్చి పాల్గొనడమూ, 9 ఏళ్లుగా ఈ ఊళ్లో జరుగుతున్న భగీరథ ప్రయత్నాన్ని ఈ గ్రామస్తులు కొందరం నిర్లక్ష్యం చేయడమూ - ఇవన్నీ కేవలం మైండ్ సెట్ల మాయలే కదా!

            ఊరి వాళ్లలో 100 కు పైగా మందికి ఈ వీధులు, డ్రైన్లు, పబ్లిక్ స్థలాలు, రహదార్లు శుభ్రంగా - పచ్చగా సుందరంగా ఉండనిదే ఎందుకు నిద్ర పట్టదో - ఈ సౌందర్యాన్నా స్వాదించే - అనుభవించే కొందరికిది ససేమిరా ఎందుకు పట్టకున్నదో తెలియదు. ఈ వైఖరి చూస్తుంటే -  

            అన్నమైతేనేమిరా – మరి సున్నమైతేనేమిరా... అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే తిందాము రా” అనే ముతక తత్త్వ గీతం గుర్తొస్తున్నది!

ఇక ఇవాళ్టి 2 గంటల వీధి పారిశుద్ధ్య కృషిలో నాకగుపించినవన్నీ చిరస్మరణీయ దృశ్యాలే!

- వేరే ముఖ్యమైన ప్రయాణముండి కాబోలు - ఒకాయన “ఈరోజుకు మానేద్దాంలే” – అనుకొని కూడా ఇక్కడికి రావడమూ – మురుగు కాల్వ దుస్థితి చూసి, మరొక రామానగరం మిత్రుడితో కలిసి మోకాలి లోతు బురద ఊబిలో నుండి తాటి దుంగల్ని – తాజా కొమ్మల్నీ త్రాళ్ళు కట్టి బైటకు గుంజడమూ,

- అదే పనిలో గోపాళం డాక్టర్ తో సహా ఐదారుగురి బట్టలూ, చేతులూ మురుగంటుకోవడమూ,

- నిచ్చెనలెక్కి మర రంపంతో పెద్ద చెట్ల కొమ్మల కోతకు పూనుకొన్న ఒకరి భుజం పట్టేస్తే, మరొకరి నడుం ఇబ్బంది పడడమూ,

- కాస్త వయస్సు మళ్ళిన 4 గురు మహిళలు ఎప్పుడు పని మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకొని, వంచిన నడుములెత్తుతారా అని నేను ఆసక్తిగా చూసినా ప్రయోజనం లేకపోపడమా,

- లోడు చేస్తే 2 ట్రాక్టర్లయ్యే వ్యర్ధాల్ని దూరంగా ఉన్న బండ్రేవు కోడు కాల్వ అంచుల్ని గట్టిపరచడానికి చేర్చి – పేర్చడమూ,

- చాలా మొక్కల్ని ఐదారుగురు ట్రిమ్ చేసేయడమూ,

- శుభ్రంగానే ఉన్నా రోడ్డును మళ్లీ మళ్ళీ ఊడ్వడమూ, ....... వగైరాలన్న మాట!

            మరి – ఇందరి శ్రమదానం చూస్తే, సందడి చూస్తే, ఒక ఆదర్శ సామాజిక బాధ్యతా నిర్వహణ చూస్తే – కార్యకర్తలూ, ముఖ్యంగా DRK, GSN డాక్టర్ల సంతోషం మిన్నుముట్టదా?

            తుది సమావేశంలో అదే జరిగింది – ఇద్దరు ప్రముఖుల మాటల్లో అదే ప్రతిఫలించింది. 40 నిముషాల పాటు ఆ తరంగాలు కదుల్తూనే ఉన్నాయి.

            నేటి స్వచ్ఛ సుందరోద్యమ సంకల్ప నినాదకుడు గోళ్ళ వేంకటరత్నం కాగా – వద్దంటున్నా వినకుండా 5,000/- విరాళమిచ్చినది శివన్నారాయణ!

            బుధవారం నాటి వేకువ శ్రమదానం కూడా ఇదే గంగులవారిపాలెం దారిలోనే ఉండగలదు.  

            సమర్థిస్తాం - స్వాగతిస్తాం!

జరా భారం లెక్క చేయక స్వచ్ఛ కర్మను ప్రోత్సహిస్తూ

ఉషోదయముకు ముందుగానే ఉద్యమంలో పాలు గొంటూ

డెబ్బదెనుబది ఏళ్ళు మీరిన పెద్ద వారల శుభాశీస్సుల

స్వచ్ఛ సుందర ఉద్యమాన్నే సమర్థిస్తాం - స్వాగతిస్తాం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   19.11.2023.