2946* వ రోజు ...... ....           20-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

2946* వ నాటి గ్రామ పారిశుద్ధ్యం

సోమ, మంగళవారాలు రెస్క్యూ దళం వాటా కనుక వాళ్లైదుగురు గంగులవారిపాలెం – భవఘ్నినగర్ ల ప్రాంతంలో వేకువ 4.26 కే సంసిద్ధులైపోయారు. ఐదుగురు 11 గా , చివరికి 15 గా మారిపోయారు. పని చిన్నదో – పెద్దదో, బరువుదో – తేలికదో, వ్యసనంగా మారిన ఊరి శుభ్ర – సుందరీకరణని ఈ రెండు రోజులు కూడ కొందరు మానరే!

అక్కడెక్కడో జపాన్ లో కూడా ప్రజలు – ముఖ్యంగా ఉద్యోగులింతేనట! వాళ్ళకేం కష్టమొచ్చినా – ప్రభుత్వం మీద కోపమొచ్చినా – తాము పనిచేసే కంపెనీ మీద అసంతృప్తి ఉన్నా – తుక్కురేగేట్లు ఎక్కువ పని చేసి, కసి తీర్చుకుంటారని విన్నాను! అందుకేనేమో - అతి చిన్న దేశం – ప్రకృతి వైపరీత్యాల భూమి -జి.డి.పి.. లో మన కన్నా ముందున్నది!

ఇంతకీ - ఈ సోమవారం వేకువ 6.10 దాక కార్యకర్తలేం చేశారంటే - వాళ్ల హోదాకు తగ్గట్లుగా ఏం చెయ్యాలో - ఎంత చెయ్యాలో అదే చేశారు! స్థానికులు కొందరికి ఏడాకుల వృక్షాల పూల వాసన పడక ఇబ్బంది పడుతున్నారని తెలిసి, వాళ్ళ అభ్యర్ధన మేరకు సదరు చెట్ల కొమ్మల్ని తొలగించడమే నేటి రెస్క్యూ వారు సాధించినది!

పనిలో పనిగా కరెంటు డిపార్టుమెంటు వాళ్ళ కూడా ఈ చెట్లింకొంచెం పెరిగితే కొట్టేసే పని తప్పినట్లే!

వ్యర్ధాల్ని బట్టి చూస్తే - ట్రక్కుపైకెల్లా నిండినవి గమనిస్తే కార్యకర్తలు తక్కువే గాని పని పరిణామం, నైపుణ్యం, తక్కువేం లేదు!

చివరికి ఈ 15 – 16 మందీ ఒక చోట చేరి, స్వచ్చోద్యమ బ్యానర్ సాక్షిగా – BSNL నరసింహుల వారు మ్రోగిన నినాదాలలకు బదులు చెప్పి, పనిని రేపటికి వాయిదా వేశారు!  

 

సమర్పిస్తాం సత్ప్రణామం!

ఎచటి కేగిన - ఎవ్వరడిగిన జన్మభూమిని పొగడుమంటూ

రాయప్రోలేనాడొ వ్రాసిన కవిత పరిధిని దాటిపోతూ

ఉన్న ఊళ్లో స్వచ్ఛ సంస్కృతి ప్రోది చేయగ ప్రయత్నించే

స్వఛ్ఛ సుందర కార్యకర్తకు సమర్పిస్తాం సత్ప్రణామం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.11.2023.