2947* వ రోజు ...... ....           21-Nov-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

2947* వ నాటి రెస్క్యూ సేవలు.

మంగళవారం వేకువ (21-11-23) దాదాపు 2 గంటలు జరిగిన వీధి పారిశుద్ధ్య/ పునర్నవీకృత చర్యలు ఉభయ గ్రామాల సరిహద్దైన గంగులవారిపాలెం బాటలోనే. స్థానికులు తోడై, పాదచార స్వచ్ఛ కార్యకర్తలతో సహా దీన్లో వేలుపెట్టిన వారు మొత్తం ఒక దశలో 22 మంది.

అంటే ఒకప్పుడిది కొద్దిమంది రెస్క్వూ టీం కావచ్చు గాని – ఇప్పుడు మాత్రం కామన్ ఐపోయిన స్వచ్ఛ కార్యకర్తల కృషే!

ఉద్ధృతంగా వీస్తున్న చలి గాలికి సన్న తుంపర తోడైన శీతల వాతావరణంలో రోడ్డు పడమర వైపు డ్రైన్ నుండి ఘాటు కంపుతో కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడే ఉంటారు గాని, ఇలాంటివి ఈ తొమ్మిదేళ్లలో వాళ్ళు ఎన్ని చూశారో గదా!

గంగులవారిపాలెం వీధిలో కొలిం మేస్త్రి గారింటి పరిసరంలో ఏడాకుల చెట్ల కొమ్మలు తొలగించే పనే ఈ పూటకూడ, అది ఉభయ తారకం - కరెంటు కార్మికులకు పని భారం తగ్గడమూ, పూల వాసన పడని స్థానికులకు కాస్త ఉపశమనమూ.

కాకపోతే, పై నుంచి చినుకులూ, చెట్ల కొమ్మల ఆకుల నుండి కారి ముఖాలకూ, చేతులకూ, బట్టలకూ అంటుకునే పాల జిగటలతో కార్యకర్తలకెంత చిరాకనిపించిందో!

రంపం కోతకు క్రింద డ్రైన్లో పడే కొమ్మల్ని త్రాళ్ళు కట్టి బైటకీడ్చే పని ఎక్కువ మందిది. రెండు బళ్లకు సరిపడే కొమ్మ రెమ్మల్ని ఒకే బండిలో సర్దిన నేర్పూ, తుక్కుల్నీ అందించిన హుషారూ గమనించాను.

ఒక్క పనికి ఒకళ్ళూ ఇద్దరూ కాదు - ముగ్గురు తొందరపడడం చూస్తే ముచ్చటేసింది.

వాన వల్ల వీధిలో కాక పద్మాభిరామంలో 2947* రోజుల బ్యానర్ సాక్షిగా ఒక 62 ఏళ్ల ఔత్సాహిక కార్యకర్త – నాయుడు మోహనుడు ముమ్మారు వినిపించిన ఉద్యమ నినాదాలతో నేటి కృషి పరిసమాప్తి!

రేపటి వేకువ శ్రమదానం గంగులవారిపాలెం రోడ్డు మూల వద్దనే జరుగగలదు!

అనుభవాల దొంతరలే

ఎన్ని శ్రమ దృశ్యాలో! ఎన్నెన్నను బంధాలో!

ఎంతటి అవగాహనలో! ఎన్ని క్రొత్త పాఠములో!

స్వచ్ఛ కార్యకర్తల సహచర్యములో మాకున్నవి!

తొమ్మిదేళ్ల అనుభవాల దొంతరలే మిగిలున్నవి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   21.11.2023.