1945*వ రోజు....           09-Mar-2020

 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1945* వ నాటి వీధి శుభ్రతలు.

ఇది సోమవారం. చల్లపల్లి శ్రమదాన నియమానుసారంగా గ్రామంలోని ఏదో ఒక వీధిని ఊడ్చి, చక్కదిద్దాలనే స్వయం నిబంధనను పాటిస్తూ వేకువ 4.02 – 6.15 నిముషాల నడుమ- విజయవాడ-బందరు-అవనిగడ్డ దారుల కూడలి కేంద్రంగా సాగిన స్వచ్చ శ్రమదాన యాత్రికులు 30 మంది కర్తవ్య నిర్వహణకు పూనుకొన్నారు.

ఇక్కడ లేకున్నా-సెల్ ఫోను నేత్రంతో గమనిస్తూ శంకర శాస్త్రిగారు వర్ణించిన ఈ నాటి స్వచ్చ కృషిని వాట్సప్ లో చూడండి.

- అశోక్ నగర్ 2 వ వీధిలోని గోపాల కృష్ణయ్య డాక్టరు గారింటి మట్టి ఇసుక-రాతి మిశ్రమాన్ని గ్రామ రక్షక బాధ్యులు ట్రాక్టర్ లో నింపి, నారాయణ రావు నగర్ లో అవసరమైన చోట సర్ది వచ్చారు.

- మిగిలిన వారిలో కొందరు అటు నాగాయలంక దారిలోని పెట్రోలు బంకు నుండి, ప్రధాన కూడలి మీదుగా, రెండవ బంకు, చిన్న కార్ల స్టాండు, ATM సెంటరు, రెండు ఆలయాల, కూరల అంగళ్ల ప్రాంతాలను శుభ్ర పరుస్తూ-ఇద్దరు మహిళలైతే సిమెంటు బెంచీల, తాటాకు పాకల మాటున నక్కిన కశ్మలాలను లాగి ఊడుస్తూ-చివరికి ఈ స్వచ్చ యాత్ర షాబుల్ వీధి వద్ద, కొద్దిమంది సంత బజారు వైపున ఆగింది.

- ముగ్గురు మాత్రం ఈ వ్యర్ధాలను, మట్టి ఇసుకలను డిప్పలతో ట్రాక్టరు లోనికి ఎత్తి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

వైద్య అవసరార్ధం మన స్వచ్చ సైనిక వైద్యులిద్దరు, దుబాయి స్నేహ 5.30 కె నిష్క్రమించగా-6.30 నిముషాలకు జరిగిన సమీక్షా సమావేశంలో – రాయపాటి రాధా కృష్ణ గారు 1000/-, కోడూరు వేంకటేశ్వర రావు గారు 520/-  మనకోసం మనం ట్రస్టు ఖర్చుల నిమిత్తం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

6.35 కు మన స్వచ్చోద్యమ గాయని మహాలక్ష్మి శ్రావ్యంగా ముమ్మారు గ్రామ సుఖ సౌకర్య సంకల్ప నినాదాలను ప్రకటించి, ఒక పాట పల్లవిని చప్పట్ల మధ్య పాడి నేటి మన గ్రామ బాధ్యతను ముగించింది.

రేపటి మన శ్రమదానం శివరామపురం దారిలో మేకల డొంక – పంట కాల్వల వంతెనల నడుమ నిర్వహిద్దాం.        

   ఎంత ఘనమో! ఎంత చోద్యమొ!

సకల భూమి భరింపగాదగు త్యాగమును మోస్తున్న గ్రామం

సమయదానం, శ్రమ విరాళం సజావుగనే స్వీకరిస్తూ

స్వచ్చ సౌందర్యాల రాకడ స్వాగతిస్తూ- అనుభవిస్తూ

నిమ్మకును నీరెత్తి నట్లే నిలిచిపోయె నిదేమి చోద్యం!   

 

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 09/03/2020

చల్లపల్లి.    

 

 

4.02 కు సెంటర్లో
పోలీస్ పోస్ట్ లో