2955 వ రోజు ...... ....           29-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్లు వాడుదాం?

2955* వ వేకువ శ్రమదాన సంగతులు!

కార్తీక బుధవార (29-11-23) మైతే, కొందరు కార్యకర్తల శ్రమ మరీ 4:09 కే మొదలై వాళ్ల సంఖ్య నెమ్మదిగా 27 కు పుంజుకొని - 3 చోట్ల - మూడు రకాలుగా 6.08 నిముషాలగ్గాని ముగియ లేదు! 4.30 నుండి 6.00 దాక పని వేళగా పొడిగించుకున్నా – అది కాస్తా ముందుకు జరుగుతూపోతున్నది! కార్యక్షేత్రం మళ్లీ బెజవాడ బాట నుండి గంగులవారిపాలెం బాటకు మారింది.

ఈ వేకువ ముప్పేటగా జరిగిన శ్రమదాన సమాచారమిది :

1) సుందరీకర్తలనబడే అరేడుగురు పూల మొక్కల స్పెషలిస్టులు బందరు NH ఉపరహదారి వద్ద అదుపు మీరి పెరిగిపోతున్న వాటిని యంత్రపరికరంతోనో, కత్తెర్లతోనో మనిషి తలకు అందంగా క్రాపు వేసినట్లు కత్తిరించుట;

2) ఐదారుగురు బండ్రేవుకోడు కాల్వ మలుపు దగ్గరా, భవఘ్ని నగర్ చివరా బరువైన పనులకు పూనుకొనుట;

అనగా - విరిగిపడే ప్రమాదమున్న రోడ్డు అంచు వద్ద నీళ్ల దారికొక తూము తొడిగి, పడుతున్న

గుంటకు తాడి బొందులడ్డు అమర్చి, మట్టి – రాళ్ళతో పూడిస్తే కొట్టుకు పోకుండ ‘పెగ్స్’ పాతి, అసలా పనిని దగ్గరుండి చూడవలసిందే లెండి! అసలింత మంచి రోడ్డు కొంత ఆక్రమణతో కుదించుకుపోయి-భారీ వాహనాల దెబ్బకు క్రుంగి విరిగిపోతుంటే –

         అక్కడి గృహస్తులో, పంచాయతీ బాధ్యులో, సంబంధిత శాఖ వారో ఏం చేస్తున్నట్లు? కార్యకర్తలిట్లా ఎన్ని వేకువలు శ్రమించి, ఎన్నెన్ని రోడ్ల గుంటల్ని పూడ్చి, విరిగిపోతున్న రోడ్లకిలా భద్రత కల్పించగలరు? చేస్తున్న కార్యకర్తలకు కాదు గాని – చూస్తున్న మా ఒకరిద్దరికి మాత్రం ఒకే మారు ఆశ్చర్యం, కాస్తంత నిస్పృహ కలిగాయి!       

3) మిగిలిన ఎక్కువ మంది శ్రమించింది మాత్రం సన్ ఫ్లవర్ కాలనీ అడ్డబాట దగ్గరే. నెల తిరక్కుండానే - వానలకు సిమెంటు మార్గం ప్రక్కన పెరిగిన గడ్డీ – పిచ్చి చెట్లనే తొలగించారో, అప్పుడు నాటిన చెట్ల సంరక్షణే చేశారో, డ్రైన్ల ఒడ్డున క్రమ్ముకొస్తున్న పిచ్చి తీగల్ని నరికి, దంతెల్తో లాగి, ఆ గుట్టల్ని ట్రాక్టర్ లోకి చేర్చారో -- ఇక అది వేరే కథ!

4) గత ఆదివారమే ఊడ్చిన రోడ్లను ముగ్గుర్నలుగురు చీపుర్ల వీర వనితలు మళ్లీ శుభ్ర పరచి, సంతోషించారు!

ఎప్పట్లాగే లోడింగు కార్యకర్తల, జోడు కత్తుల కార్యకర్తల చాకచక్యాలూ షరామామూలే!

సమీక్షా సమయ విశేషాలు:

- ప్రభుత్వాస్పత్రి - నారాయణరావునగర వీధిలో గత 3 నాళ్ళగా వ్యర్ధాల్ని తొలగించి, యధాపూర్వ స్థితికి తేవడంలో కార్యకర్తల కాయకష్ట ప్రస్తావన,

- తొమ్మిదేళ్లుగా పదేపదే అభ్యర్థిస్తున్నా – నరికి పడేసిన చెట్లను డ్రైన్లలో వదిలేస్తూ బాధ్యత పెంచుకోని వారి పట్ల కాస్త నిర్వేదం – వైరాగ్యం,

- మాలెంపాటి అంజయ్య కసిగా ఘోషించిన శ్రమదానోద్యమ నినాదాలూ,

రేపటి వీధి మెరుగుదల కృషి కూడ ఇదే గంగులవారిపాలెం బాటలోననే సమాచారం!

సవినయ ప్రణామములు!

చల్లపల్లికే మాత్రం సంబంధంలేని వారు,

చల్లపల్లి నుండి వెడిలి చాలకాలమైన వారు,

కవిగాయకు లిందరిచే ఘనముగ కీర్తింపబడిన

స్వచ్ఛ సుందరోద్యమమా! సవినయ ప్రణామములు!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.11.2023.