2956 వ రోజు ...... ....           30-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్లు వాడుదాం?

శ్రమదాన వికాసం - @2956*

గురువారం (30.11.23) వేకువ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోదే గాని, ప్రొద్దు తిరుగుడు వారి అడ్డబాటంతటా - ఆర్చి దాక పరచుకొన్నది. ప్రాత కార్యకర్తల్తప్ప - ఇంకొక్క ఆస్పత్రి ఉద్యోగిని తప్ప - ఆ కాలనీ వారెవ్వరూ తొంగిచూడనే లేదు! నేటి శ్రమదాతల సంఖ్య 34, కడియాల భారతి గారి అభ్యర్ధనతో - 200 గజాల సిమెంటు దారికి కాలుష్యం నుండి విముక్తి!

ఉన్నంతలో ఈ వీధి కొంత సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, ఈ తూర్పు - పడమరల బాటకు ఉత్తర దక్షిణాల్లో మాత్రం గడ్డీ, పిచ్చి మొక్కలూ, కొన్ని చెట్ల కొమ్మలూ ఏమంత సౌందర్య స్ఫోరకంగా లేవు! ఈ ఉదయం 6.30 తర్వాత వాహన చోదకులూ, పాదచారులూ, వీధి నివాసులూ ఎంత ఆహ్లాద భరితులౌతారో చూడండి!

ఐతే - వారి ఆహ్లాద నిమిత్తం, అందమైన వీధి కోసం స్వచ్ఛ కార్యకర్తలెంతగా శ్రమించారో ఎందరు ఆలోచిస్తారు ? ఇలా ఒక బజారు కోసం శ్రమించడం, ఊరంతటినీ శుభ్రంగా ఉంచుకోవడం పరువు తక్కువ కాదనీ, సామాజిక ప్రయోజనమనీ అందర్నీ పిలిచి, బొట్టుపెట్టి చెప్పాలా?

భవన నిర్మాణంలో, మరమ్మత్తులు జరిగే వేళల ఆ బజారు వ్యర్ధాలతో నిండనట్లు చూసుకోవలసిన బాధ్యత గృహస్తులదే! విందూ - వేడుకల నుండి పుట్టుకొచ్చే వ్యర్ధాల కర్తవ్యమూ స్వచ్ఛ కార్యకర్తలది కాకూడదు!

30 కి పైగా మందేమిటి? 200 గజాల బాగుచేతలేమిటి? అని సందేహించవద్దు - బాటకుభయదరులా చెప్పుల వంటి వ్యర్ధాలెన్ని పడి ఉన్నవో సీసాలూ, ప్లాస్టిక్ సంచులూ, గ్లాసులెలా వచ్చాయో గాని వాటన్నిటికీ బాధ్యత వహించడం కార్యకర్తల గొప్పదనం!

ఈ కార్యకర్తల్లో త్వరగా ఉద్యోగాల కెళ్లవలసిన వారు, ఆస్పత్రి సిబ్బందీ, ప్రయాణాలు చేయవలసిన కొందరూ ఉన్నారు. అందువల్ల

- త్వరగా కాఫీలు ముగించి, నేటి కృషి సమీక్షకు దిగారు.

- 34 మంది సొంతానిక్కాక ఊరి కోసం పాటుబడిన మంచితనానికి DRK గారి ఆశ్చర్యానందాలూ,

- మొక్కల - తాతినేని రమణ గారి స్వచ్ఛ - సుందర నినాదాలూ,

- ఇద్దరు కార్యకర్తల జామకాయల పంపకాలు,

రేపటి శ్రమ కోసం కూడ ఈ గంగులవారిపాలెం వద్దనే కలవాలనే నిర్ణయమూ...

మరువకూడదు మానకూడదు

పండుగలు పబ్బాలు మంచివె వేడుకలు ఆవశ్యకములే

వాటి నుండీ అడ్డగోలుగ వచ్చు వ్యర్ధములే అనర్థం

ముక్తికెగబడు భక్తజనులీ యుక్తి మాత్రం మరువకూడదు

స్వచ్ఛ సుందర చల్లపల్లికి సహకరించుడు మానకూడదు!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.11.2023.