2976 వ రోజు........           22-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3000 రోజుల దిశగా అడుగులేస్తున్న శ్రమదానం @2976*

            శ్రమదానం 27 మందిది, అదైతే 22/12/23 వేకువ 4:13 కే పరిమిత కార్యకర్తలో మొదలై, 6.20 సమయంలో చివరి కార్యకర్త విరమించే దాక - బందరు వీధిలో చంటి హోటల్ కేంద్రంగా, సంత వీధి దాక నడుస్తూనే ఉన్నది. కార్యకర్తల సంఖ్య 30 కన్నా తగ్గిన సందర్భం ఈ మధ్య కాలంలో ఇదే!

            సంఖ్యతో సంబంధం లేకుండ పారిశుద్ధ్య నాణ్యత గాని, పరిమాణం గాని తగ్గలేదు. నేటి శ్రమను 3 విధాలుగా చెప్పుకోవచ్చు:

1) గత ఆదివారం శుభ్రపరచిన సూరి డాక్టరు సందు మొదలు సంత రోడ్డు దాక - సుమారు 200 గజాల వీధి దుమ్ము దులిపి, దిష్టి చుక్కల్లా ఉన్న గడ్డి - ఇతర మొక్కల్ని నిర్మూలించి, దుకాణాల ఎదుటి రకరకాల వ్యర్థాల్ని ఊడ్వడం,

2) ముత్యాల చంటి ఫలహార విక్రయశాల వీధి శుభ్రత, 2 మురుగు కాల్వల బాగు సేత! ఇక్కడే సగం మంది శ్రమ ఖర్చై పోయింది!

3) షాబుల్ వీధి ఎదురు టీ కొట్టు దగ్గరకు నేను వెళ్లేప్పటికే - అక్కడ నలుగురు కార్యకర్తలు మురుగు కాల్వనెలా కదిలించారో గాని, ముక్కులు అదిరే కంపు కొట్టింది. అక్కడే పది - పదేను గజాల వ్యర్ధాల గుట్టలు 2 రిక్షా బళ్లకు సరిపడా ఉన్నాయి.

            చెత్త లోడింగు వల్లనే ఈ పూట పని విరవిరమణలో జాప్యం!

            పని వ్యసనంలో కొందరు అజాగ్రత్తగా రోడ్డుపైకి వచ్చి, వేగంగా వచ్చే - పోయే వాహనాల్ని పట్టించుకోవటం లేదని కొందరి హెచ్చరిక!

            “కన్నడ దేశంలో క్రొత్తగా పెళ్లైన ఇద్దరు సముద్ర తీరంలో 600 కిలోల వ్యర్ధాల్ని తొలగించేందుకు తమ హనీమూన్ విరమించుకొన్న “వార్తా కథనాన్ని పద్మావతి డాక్టరమ్మ గారు మన వాట్సప్ లో పెట్టడం ఉత్తేజకరంగా ఉన్నది. మరి చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు ఒక్కొక్కరు నెలకెన్ని కిలోల వ్యర్ధాల్ని ఊరి వీధుల్నుండి - తొలగిస్తున్నారో గదా!

            6.40 సమయంలో దాసరి వైద్యులవారు తామిటీవల వెళ్లి వచ్చిన సమావేశాల - విందులలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని ప్రస్తావించగా, బందరు బజారు అదిరిపడేట్లుగా మైకు లేకుండానే కోడూరు వారు స్వచ్ఛ సుందర నినాదాలు పలికారు!

            రేపటి శ్రమదానం కోసం మనం కలువవలసింది సంత వీధి - మొదట అని నిర్ణయించారు.

            అటు స్వార్ధం – ఇటు తీర్ధం

ఎందుకొ ఇది శ్రమ వేడుక అని కొందరి కనిపించదు

ఊరి కొరకు శ్రమ చేయుట ఉత్తమమని భావించరు

బ్రహ్మకాల శ్రమదానం పరమ పవిత్రంగా తలచరు

అటు స్వార్ధం – ఇటు తీర్ధం అమలగునని తెలుసుకొనరు!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  22.12.2023