2977 వ రోజు.... ....           23-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

ముక్కోటి ఏకాదశి వేకువనే 30 మంది గ్రామసేవ- 2977*

          శనివారం 4.18-6.11 నడిమి 2 గంటల బాధ్యతలవి! బందరు వీధిలో - యడ్ల వారి రోడ్డు మొదలు ATM కేంద్రం దాక- గ్రామస్తుల సౌకర్యాలనెలా పెంచాలీ, ఆహ్లాద - ఆరోగ్యాలకు ఇంకా ఏం చేయాలీ అనే తపన గల స్వచ్ఛ సుందర వాలంటీర్ల 2977 వ ప్రయత్నం తక్షణ ఫలితాన్నిచ్చి, 4-5 వందల ఆధ్యాత్మిక పరుల సాక్షిగా జరిగిన శ్రమ వేడుక!

          ఒక ప్రక్క ముక్కోటి ఏకాదశి పూజలకు తండోప తండాలుగా వేం చేస్తున్న భక్తులూ, మరోవంక తమ ఊరి పారిశుద్ధ్యాన్ని పెంచే క్రమంలో కేవలం 30 మంది స్వచ్ఛ శ్రామికులూ!  ఒకే కాలంలో ఒకే చోట అటు గోవింద సహస్ర నామాలూ ఇటు చీపుళ్ల ఊడ్పు గరగరలూ, ఏ చెత్త ముక్కాలేనంతగా, ప్లాస్టిక్ రహితంగా వీధి పారిశుద్ధ్య సందడులూ!

          3 పదుల మంది కార్యకర్తలు ఏ టిఫిన్ బండ్ల- పిండి మిల్లుల - కూరల దుకాణాల వ్యర్దాల్నీ వదల్లేదు. స్త్రీ మూర్తులు రోడ్డు రద్దీని కాచుకొంటూనే బరువైన దుమ్ము డిప్పల్ని మోస్తూ ట్రాక్టర్లో నింపుతున్న శ్రమ సందేశం ఎంత గొప్పదో విశ్రాంత ఉన్నతోద్యోగులు రోడ్డు మార్జిన్లను చీపుళ్లతో, గోకుడు పారల్తో శ్రద్ధగా శుభ్రపరుస్తున్న దృశ్యమెంత సందేశాత్మకమైనదో!

          గుడి వద్ద ముక్కోటి ఏకాదశి పూజలు ఒక్క రోజువే! స్వచ్ఛంద శ్రమదాతల దుమ్ము- మురికి పనులు ఏ ఉదయమైనా- ఊళ్లో ఏదో ఒక చోట కనిపించే నిత్య సత్యాలు!

          చెత్త కుప్పల్ని లోడు చేయక- పంచాయతీ కార్మికులకు వదిలేసి, చివరి అరగంటా వాలంటీర్లు కేవలం ఇసుకా - దుమ్మూ రాతి ముక్కల్నే ట్రక్కులో కెక్కించారు.

          ఏదో ఒకనాటి శ్రమదానమైతే ఫలానా వారు ఫలానా గ్రామ బాధ్యత తీర్చారని వివరంగా వ్రాయవచ్చు! కార్యకర్తలు 30-40-50 మంది ఐనప్పుడు - వాళ్ళది 365 రోజుల పనులైతే వ్యక్తుల పరంగా వివరించి చెప్పలేం గదా!

          6.30 వేళ- మైకు నుండి భక్తి వేడుకల శబ్దానికి దూరంగా – సంత వీధిలో సమావేశమైన 30 మందీ మాలెంపాటి అంజయ్య గర్జించిన శ్రమ సార్థక నినాదాలకు దీటుగా బదులిచ్చారు. గురవయ్య అర్థవంతమైన సూక్తులు విన్నారు.

          రేపటి వేకువ శ్రమ ప్రారంభం ATM కేంద్రం వద్దనని గ్రహించారు.

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  23.12.2023