2978 వ రోజు.... ....           24-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

2978* వ శ్రమదాన సమాచారం!

          ఈ ఆదివారం (24/12/23) వేకువ 4.20 కే తొందరపడినవారు 18 మందికాగా, కాస్త వెనకా ముందుగా కలిసినవారు 21 మంది! చివరి కార్యకర్త పని ముగించినది 6.25 కు! ఏమిటి ఈ 39 మంది తాపత్రయం ?

          ముణగదీసుకొని ఇళ్ళలో - దుప్పట్లలో దాక్కోవలసిన చలిలో, మంచులో ఎందుకీ మంకుపట్టు? ఏం? అన్ని గ్రామాల వీధుల్లో ఊరి పరిసర రహదార్లలో, మురుగుకాల్వల్లో, రుద్రభూముల్లో ప్లాస్టిక్ తుక్కులూ, దుమ్మూ - ధూళీ ఉండడం లేదా? కేవలం వీళ్ల చల్లపల్లి ముఖమ్మీదే ప్రొద్దు పొడిచిందా? ఊరు అస్తవ్యస్తంగా కళాకాంతుల్లేకుంటే, పచ్చదనం లోపిస్తే పాతికవేల మంది ఉండగా ఈ 39 మందికే బెంగా?

          “ఐతే మాత్రం? ఏదో నాలుగైదు మార్లు మీడియా వాళ్ళ సమక్షంలో చీపుళ్ల శ్రమదానంతో సరిపెట్టక 2978* రోజులు - అదీ డిసెంబరుచలి వేకువలో కష్టించాలా? అంటే ఈ కార్యకర్తలేమో తమ ఊరి వీధి పారిశుద్ధ్య - సుందరీకరణం తమ అదృష్టమనుకొంటారు. నా దృష్టిలో అది ఈ చల్లపల్లికి పట్టిన అదృష్టమూ, వదుల్తున్న శనీ!

          ఏ పండగైనా వీళ్ళు శ్మశానమో - కర్మల భవనమో - RTC బస్ ప్రాంగణ - గుడులో - బడులో శుభ్రపరచక ఆగిపోయారా? భోగి, దసరా పండుగల్ని రుద్రభూముల్లో - నడి వీధుల్లో జరుపుకోలేదా ? ఇది వాళ్ల క్రొత్త సంస్కృతి!

          ఈ ఉదయాన వాళ్ళు ఆగింది ATM కేంద్రం వద్ద; చీపురు, కత్తి, గొర్రు, డిప్పా, పారా వంటి ఆయుధాలు ధరించి, కాలుష్యం మీద పోరులో దూకింది - 200 గజాల బందరు రోడ్డు మీద; చివరకు పోరాటం ముగిసింది 3 రోడ్ల ముఖ్య కూడలిలో! ఈ 2:05 గంటల ప్రయత్నంతో:

A)  ATM సెంటరూ, బట్టల, ఎరువుల, ద్విచక్రవాహన, ఇంధన నిలయ, బేకరీల, సైకిళ్ళ, సెల్ ఫోన్ల దుకాణాల దగ్గరి చాల రకాల వ్యర్ధాలు తొలిగిపోయాయి!

B)   వద్దన్నా వినకుండా ఒక విశ్రాంత కేంద్ర ప్రభుత్యోద్యోగి పెట్రోలు బంకు ముందరి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కంచెలో దూరి, గడ్డీ – పిచ్చి మొక్కలూ తొలగించారు!

C)   ఈ పూట కూడ ఇసుకా - దుమ్మూ మిశ్రాల్ని ట్రక్కులోకెక్కించడం వల్లనే పని ముగింపు అలస్యమయింది!

D)    వేంకటేశ్వరస్వామి సహస్ర నామార్చన మైకు వల్ల Dr.డి.ఆర్.కె. గారి సమీక్షా  వచనాలు విన్పించలేదు!

రేపటి క్రిస్మస్ వేడుకలూ, గోపాళం డాక్టరు గారి జన్మదిన దినోత్సవమూ కమ్యూనిస్టు వీధి - బైపాస్ రోడ్డుల జంక్షన్లోనే!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  24.12.2023