2979 వ రోజు.... ....           25-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

క్రిస్మస్ శుభాకాంక్షలతో 2979* వ శ్రమదానం!

            విశాఖ - బెజవాడల్నుండి వచ్చిన నలుగురితో సహా 45 మందీ, ఆలస్యంగా 6.30 కు పండుగ వేడుకలో చేరిన వారితో మొత్తం 51 మందితో కమ్యూనిస్టు వీధి చివర సందడే సందడి!

            అక్కడ 92 ఏళ్ల స్వచ్చోద్యమ కరువృద్ధుడు దాసరి రామమోహనరావు గారి ఇంటి వద్ద గత కొన్నేళ్లుగా స్వచ్ఛ - సుందర కారకర్తల జీసస్ జన్మదిన వేడుకలొక ఆనవాయితీగా నడుస్తున్నది!

            నేటి పని వేడుకల వేళ 4.18 - 6.05, పని విస్తృతి బైపాస్ వీధిలో ఉప్పల వారి వీధి నుండి అశోక్ నగర్ సజ్జా వారి వీధి దాక, కొసరుగా కమ్యూనిస్టు వీధిలో ఒక ఖాళీ స్థలం కూడ!

            రికార్డు స్థాయిలో పట్టిన మంచులో ఎవరెవరేయే పారిశుద్ధ్య, సుందరీకరణ కృషి చేసిందీ సరిగా కనిపెట్టలేకపోయాను. వీధి దీపాలే మంచులో మునిగి, మినుకుమంటున్నప్పుడు రోడ్డు దుమ్మూ, మార్జిన్ల కలుపూ, పిచ్చి మొక్కలూ, ఇతర గలీజులూ ఏం కనిపిస్తాయి - ఊడ్వడానికీ, పీకడానికీ, నరకడానికీ? అంటే - కార్యకర్తల తల దీపాల వెలుగులో వాళ్లకి కనిపిస్తాయి మరి!

            ఒక ప్రధాన, 2 గల్లీల గడ్డీ, తెగిపడిన కొన్ని చెట్ల కొమ్మలూ, దుమ్మూ, ఇతర వ్యర్ధాలూ ట్రాక్టర్ కు సరిపడా దొరికాయి. మినీ ఉద్యానంలోని కలుపూ తొలిగింది!

            తెల్లారి, 6.30 తరువాత చూస్తే - శుభ్రమైన అందమైన కమ్యూనిస్టు వీధీ, పచ్చదనం పరచుకొన్న పువ్వులు నవ్వులు రువ్వుతున్న విశాలమైన బైపాస్ మార్గమూ స్వచ్ఛ కార్యకర్తల కర్తవ్వ దీక్షకు కృతజ్ఞతాభావంతో కనిపించాయి!

నేటి తుది ఘట్టంలో 3 ముఖ్య విశేషాలు:

I. గోపాళం శివన్నారాయణుని జన్మదినోత్సవం చల్లపల్లి కార్యకర్తల మధ్య జరగటం, అందుకు గాను వారు 90 కిలోమీటర్లు ప్రయాణించి, తెలవారకముందే రావడం

II. సర్పంచి కృష్ణకుమారి కుటుంబీకులు క్రిస్మస్ కేకులు కోసి, పండుగ నిర్వహించడం

III. ఇద్దరు స్వచ్ఛ బాల కార్మికులు ఆర్య, ఆరవ్ ప్రకటించిన స్వచ్చోద్యమ నినాదాలూ, ఆ తరువాత గోపాళం దంపతులందించిన భారీ అల్పాహార విందూ ఇవన్నీ ముగిసి, కార్యకర్తలు ఇళ్లకు చేరుకొన్నది ఏ 7.30 కో!

ఇక, నేటి స్వచ్చోద్యమ విరాళాలు :

అ. గోపాళం వైద్యుల వారి 5 వేల రూకల చెక్కూ,

ఆ. గోపాళం కోమలి గారి సోదరుడు - రాయన చిన్న శ్రీనివాసరావు గారు ఇచ్చిన 5 వేలూ,

ఇ. పల్నాటి భాస్కర్ - అన్నపూర్ణ దంపతుల ద్వితీయ కుమారుడు ప్రేమ్ తరుణ్ జన్మదిన పురస్కారంగా ఇచ్చిన 1,000/- రొక్కమూ!

క్రిస్మస్ ఉత్సాహం సాక్షిగా

1) స్వచ్ఛ సుందర శ్రమదానోద్యమాలు ఊరూరా వ్యాపించాలనీ,

2) గోపాళం వారు కనీసం 38 జన్మదినాలిలా జరుపుకోవాలనీ,

3) అతని 49 వైద్య శిబిరాలూ నిర్విఘ్నంగా కొనసాగాలనీ, కోరుకొందాం!

            బుధవారం మన వీధి పారిశుద్ధ్య కృషి గ్రామ 3 రోడ్ల ముఖ్య కూడలిలో అని గుర్తుంచుకొందాం!

            ఆ మహాత్ముల కంజలిస్తాం

ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ

పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ

క్రమం తప్పక హరిత సంపద పెంచి పోషిస్తున్నదెవ్వరొ

ఆ మహాత్ముల కంజలిస్తాం గ్రామ భవితను స్వాగతిస్తాం!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  25.12.2023