2980 వ రోజు.... ....           26-Dec-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

రెస్క్యూ టీమ్ వీధి సుందరీకరణం - @2980*

            మంగళవారం (26.12.23) నాటి ఆ 5+5 మంది కృషీ మరొకమారు గంగులవారిపాలెం వీధికి చెందిన శాయినగర్ అడ్డ రోడ్డుకే సమర్పితం. గతవారం మిగిలిపోయిన కలుపుతీత, పూల మొక్కల ట్రిమ్మింగ్, ఈ వేకువ 2 గంటలు - 4:20 నుండి 6:20 నడుమ పూర్తయింది.

            ముళ్ల, పిచ్చి మొక్కల వలన గానీ లేకుంటే పని త్వరగానే ముగిసేది. ఇక్కడి ఈ పూట వ్యర్థాలు తక్కువే. వాటిని ట్రాక్టర్లో వేసుకొని, అదే వీధిలోని “సెల్ఫీపాయింట్” వద్ద కొద్దిపాటి పని - అంటే నాలుగైదు చెట్ల కొమ్మల కత్తిరింపులు పూర్తి చేసే సరికే సమయం మించిపోయింది.

            స్వచ్ఛ - సుందర కార్యకర్తల్నీ, వారి దైనందిన బ్రహ్మకాల కృషినీ, సందడినీ, సంతృప్తినీ చూస్తే చాల మార్లు కలిగే సందేహమేమంటే – “3 వేల రోజులుగా ఊరి మెరుగుదల కృషి కలవాటు పడిన – లేదా వ్యసనపరులై పోయిన ఈ జీవులు ఏ కారణం వల్లనైనా ఈ ఉద్యమమాగిపోతే తట్టుకోగలరా” అని!

            నేటి 10 మంది కార్యకర్తలూ “సెల్ఫీ పాయింట్” వద్దకు చేరి, మాలెంపాటి అంజయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ - సుందర నినాదాలు వల్లించారు.

            రేపటి వీధి బాగుదల కోసం గ్రామ ప్రధాన కూడలి వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

   26.12.2023