2981 వ రోజు.... ....           27-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3 రోడ్ల ముఖ్య కూడలిలో @ 2981* వ శ్రమదానం!

            31 మంది శ్రమకారులు, వేకువ 4. 16 నుండి 6.12 దాక మొత్తం 50 కి పైగా పని గంటల ప్రయత్నమూ, సుమారు 250 గజాల - 2 వీధుల సుందరీకరణమూ - ఇదీ స్థూలంగా చల్లపల్లి సెంటర్ లో  స్వచ్ఛ- కార్యకర్తల నిర్వాకం!

            అసలిందులో సగభాగం చోటులో ఆదివారం వీళ్లు శుభ్రపరిచిందే – దాని కదనంగా - 1) పబ్లిక్ టాయిలెట్ల/సచివాలయ/గణేశ్ ముద్రణాలయ విభాగాలూ, 2) నాగాయలంక రోడ్డులో కొంత దూరమూ, 3) బెజవాడ రోడ్డులో కొంత మేరా క్షుణ్ణంగా ఈ వేకువ బాగుపడ్డాయి!

            నేనైతే- 3 వీధుల కూడలి, చిన్నకార్ల స్టాండూ, పెట్రోల్ బంకు ఆవరణా ఎంత శుభ్రంగా, నిష్కళంకంగా ఉన్నవో చూస్తూ కొంతసేపలా ఉండిపోయాను!

            ఇదంతా శ్రమ మహాత్మ్యం! దాని వెనక 30 మంది ఉక్కు సంకల్పం ! లేక పోతే- ఇంత దట్టమైన మంచులో - చలిలో వేకువ బ్రహ్మ ముహూర్తంలో ఈ దుమ్మూ - ధూళీ - మట్టి పనులెవరు చేస్తారు? ఇంత పెద్ద గ్రామం మీద కాలుష్యం మచ్చల్ని ఏ రోజుకారోజు ఎవరు చెరిపేస్తారు?

            ఎంత సార్థక సామాజిక కృషి కాకపోతే ఇందులో 84 ఏళ్ల పెద్దలూ, ప్రమాదంలో కాలునుజ్జైన  మహిళా, లబ్ద ప్రతిష్టులైన వైద్యులూ, పాల్గొంటారు?  

            ఐతే ఇదంతా నాణేనికి ఒక పార్శ్వం! ఇంత సుదీర్ఘ సమయ శ్రమదాన స్ఫూర్తిని ఆశించిన స్థాయిలో ఇంకా కొందరు గ్రామస్తులెందుకు అందుకోరో, అందుకొని కొంతకాలం చాలా గ్రామాల్లో మొదలైన ప్రయత్నాలు కాల - క్రమాన ఎందుకాగిపోయినవో తెలియాలి!

            ఈ పూట కూడ సగం ట్రాక్టర్ కు ఇసుకా, దుమ్మూ,  ఇంకో సగానికి రకరకాల -వ్యర్ధాలూ నిండాయి.

            సాధారణంగా 2 గంటలు పనిచేస్తే అలసిపోవాలి ; ఇంత సుదీర్ఘ కాలం తాము శ్రమిస్తున్నా ఇంకా వీధుల్లో, దుకాణాల వద్దా వ్యర్థాలు కనిపిస్తున్నందుకు కార్యకర్తలు చిరాకుపడాలి; మరి, ఈ కార్యకర్తలెందుకోగాని 6.30 తర్వాత - సమీక్షా సమయానికీ తాజాగానే ఉన్నారు, ఇంకా తమ సామాజిక బాధ్యత లేం మిగిలాయో అని ఆలోచిస్తున్నారు!

            ఈ విషయాలు ఉత్సాహ పూరితంగా సమీక్షించిన DRK గారి మాటల్లోనూ, అంతకు ముందు గట్టిగా వేముల శ్రీనివాస్ ముమ్మారు పలికిన నినాదాల్లోనూ తేట తెల్లం!

            రేపటి మన శ్రమదాన బాధ్యత కూడ ఇదే 3 రోడ్ల కూడలి నుండే కొనసాగిద్దాం

      మరువకూడదు - మానకూడదు!

పండుగలు పబ్బాలు మంచివె వేడుకలు ఆవశ్యకములే

వాటి నుండీ అడ్డగోలుగ వచ్చు వ్యర్థములే అనర్థం

ముక్తికెగబడు భక్తజనులీ యుక్తి మాత్రం మరువకూడదు

స్వచ్ఛ సుందర చల్లపల్లికి సహకరించుట మానకూడదు!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

   27.12.2023