2982 వ రోజు.... ....           28-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

2982* వ నాడు శ్రమ సంగతులు!

            అనగా- గురువారం (28.12.23) నాటివన్నమాట! వాటికేంలెండి - కాస్తంత సింపతిటిక్ మైండ్ ఉండాలేగాని - ఆ 22 మంది పనులూ సామూహిక స్వస్థతనూ సరిగా అర్ధం చేసుకున్న వారిని స్వచ్చోద్యమం లోకి ఆకర్షించకా మానవు.

            అందుకు తాజా ఉదాహరణోదంతం ఒకటి! ఎక్కడో శ్రీకాళహస్తి నివాసి - 79 ఏళ్లు నిండుతున్న పరుచూరి సుబ్బారావు (విశ్రాంత నీటి పారుదల ఇంజనీర్) చుట్టపు చూపుగా చల్లపల్లి వచ్చి, ఇంత చలీ మంచులో వేకువనే వచ్చి, చీపురు పట్టిన దృశ్యం! సామాజిక బాధ్యత గుర్తించిన సజాతీయ పక్షులకిది మామూలే!

            అదలా ఉంచి, నేటి ఊరి బాధ్యతలు పంచుకొన్న 22 మందిలో సగం మందికీపూట వెంటనే రామోజీఫిల్మ్ సిటీ ప్రయాణముండగా అనివార్యంగా వచ్చి శ్రమించడమేమిటో! అదివాళ్లబలహీనతైతే - చల్లపల్లి స్వస్తతకుబలం!

            ముందుగా 4.15 కే మూడు వీధుల కూడలికి వచ్చింది 8 మందైతే - క్రమంగా వచ్చి, శ్రమదాతలుగా మారింది 14 మంది! (వీళ్లంతా కూడినా అక్కడి గుడుల వద్దకు వచ్చిన భక్తుల్లో సగం కూడ లేరు!)

            నిన్న సచివాలయం ఖాళీ స్తలం శుభ్రపరిచినా, దాని వెనుక కొంత గడ్డీ, కాలుష్య వ్యర్ధాలూ తప్పించుకొన్నవట, గణేశ్ ప్రెస్ ప్రాంతంలో స్వచ్ఛ - శుభ్ర -  సౌందర్యాలలో ఏవోలోపాలు కన్పించాయట! అందుకని సగం మంది ఠపీమని ఆపనుల్లో దిగిపోయారు!

            ఇద్దరు మహిళామతల్లులూ, ముగ్గుర్నలుగురు కురువృద్ధులూ చీపుళ్లతో మరొకమారు షాపింగ్ కాంప్లెక్స్, వినాయకగుడి, సువిశాల 3 రోడ్ల కూడలీ ఊడవడం మొదలుపెట్టారు! కనుక - చల్లపల్లిలో కన్పించే సామాజిక కర్తవ్యవికాసమా! వర్ధిల్లు! ఇంకా సగం మంది గ్రామస్తుల చైతన్యమా! మేలుకో!

            రోజుటికన్న కాస్తముందుగా పనివిరమించి, అప్పటికక్కడున్న జనం సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశాన్ని 2X3 మార్లు గ్రామ శ్రమదానోద్యమ నినాదాలతో ప్రారంభించిన వారు (తాతినేని మొక్కల) వేంకటరమణ!

            ముగింపునిచ్చిన డాక్టరు గారు DRK ప్రసాదు!

            రేపటి నాగాయలంక రోడ్డు శుభ్రతకు - ఇక్కడనే కలవాలనేది అందరి ఆమోదం!

     ఆఉద్యమ ప్రస్థానమె!

చల్లపల్లి ఉద్యమానికెన్నెన్ని సమర్థనలో

ఎంతమంది వత్తాసులో - ఎందరెందరి ఆశలో

అన్నిటికి సమాధానం స్వచ్ఛంద శ్రమదానమే!

అందరి ఆశల సఫలత ఆఉద్యమ ప్రస్థానమె!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

   28.12.2023