2983 వ రోజు.... ....           29-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమం - @2983*

            అది విసుగు లేనిదీ, లొసుగు రానిదీ! శుక్రవారం (29-12.బి) నాడు దాన్నిముం దుకు నెట్టుకు పోయింది 19 మంది! అందులో ఒకామె ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కస్తూరి అనోజ్ఞ! పనివేళ ఇంచుమించు ఎప్పట్లాగే - 4.18 - 6.10!

            పని జరిగిన చోట్లు 2 - సచివాలయం దగ్గర (MTM రోడ్డు) నిన్న ప్రోగుబడిన ఇసుకా దుమ్మూ మిశ్రం 18 డిప్పల్తో ఎత్తేసినదొకటీ, 3 రోడ్ల సెంటర్ నుండి పోస్టాఫీసు వీధి దాక నాగాయలంక రోడ్డు దుమ్ము దులపడం రెండో పనీ!

ఈ పూట మంచుకో, చలికో భయపడి కార్యకర్తల సంఖ్య తగ్గలేదు, సొంత పనుల్లో ఉండి కొందరు మానేయ లేదు - భాగ్యనగర రామోజీ ఫిల్మ్ సిటీ యాత్రకు 30 మంది వెళ్లడం వల్లనే అట్లు జరిగెను!

            ఉన్న తక్కువ మంది ప్రయత్నంతోనే 100 గజాల వీధి ఎలా బాగుపడి, ఎంత చూడ ముచ్చటగా ఉండెనో గమనించాలి. పాతిక ముప్పై దుకాణాల ముందరి, పెట్రోలు బంకు దగ్గరి చిత్తు కాగితాలూ, ప్లాస్టిక్ అవ శేషాలూ సెలవు తీసుకొని, మిఠాయి పానీయ దుకాణాల వ్యర్ధాలకు మంగళం పాడి, 19 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్య కృషి సామాన్యమయిందేమీ కాదు!

            ఇప్పటికీ కొందరమాయకులు ఈ స్వచ్ఛ కార్యకర్తలకెక్కడినుండో డబ్బు వచ్చి పడడం వల్లే ఈ పనులు చేస్తున్నారనుకొంటున్నారట!

            చెత్త గుట్టల లోడింగు ముగిసి, కాఫీలు సేవిస్తూ 6:20 కి హీరో వాహన విక్రేత దాసరి శ్రీనివాసుని నేతృత్వంలో మూడేసి మార్లు 2 రకాల స్వచ్ఛ సుందరోద్యమ నినాదాల్ని చాటించి, నేటికి తమ బాధ్యత ముగించారు?

            రేపటి వేకువ కూడ ఇదే నాగాయలంక మార్గంలోనే కలిసి, సాగాలని కూడ నిర్ణయించుకొన్నారు!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

   29.12.2023