2984 వ రోజు.... ....           30-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

2984* వ నాడు కూడ సడలని పట్టు!

            శనివారం వేకువ 4.20-6.10 నడుమ అష్టాదశ కార్యకర్తలు తమ ఊరి ముఖ్య వ్యాపార కూడలి వీధిలో- అనగా హీరోషోరూమ్ మొదలు - వైశ్యా వీధి పర్యంతం కాలుష్యం మీద పట్టిన మంకు పట్టది!

            చీకటి వేళల్లో - మంచూ, చలి వణికిస్తున్న సమయంలో వాళ్లు చేస్తున్న ఎడతెగని పోరాటంతోనే కనీసం ఐదారు కిలోమీటర్లుండే గ్రామ ముఖ్య వీధులు ఈ మాత్రం శుభ్రంగా ఉండి, ఊరి పరువు నిలుపుతున్నవి!

            సామాజిక ప్రజారోగ్యం పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత వల్లనేమెరుగుపడుతుందనే సంగతి ఏనాడో-1920 లోనే ఇంగ్లాండులో నిరూపితమైతే-103 ఏళ్ళ తర్వాత దాన్ని పాటించడానికింకా మన ఊరి విస్తృత ప్రజానీకం తటపటాయించడం విచారకరం!

            పంచాయితీ కార్మికుల మీదా, స్వచ్ఛ సుందర కార్యకర్తల పట్లా కనికరం చూపి, వీధుల్లో కొచ్చి బాగుపరచక పోయినా పరవాలేదుగాని, తమ వీధిని కాలుష్య వ్యర్థాల్తో నింపకున్నా చాలు - అక్కడికి గ్రామస్తులు తమ ఊరికి మేలు చేసుకొన్నట్లే!

            18 మందీ శక్తివంచన లేకుండా తలా 100 నిముషాల్లో ఈ పూట చేసిన శ్రమదానంతో వచ్చిన వ్యర్థాల్ని తుక్కుగానూ - దుమ్మూ - ఇసుకగానూ విడిగొట్టి సగం ట్రక్కు దుమ్మూ ఇసుకను సచివాలయం వద్ద అనసరాన్ని బట్టి సర్ది చదును చేశారు.

డజను మంది చేతులు నొప్పి కలిగేలా గంటన్నరకుపైగా ఊడ్చిన కష్టానికది ఫలితం!

            కాఫీలు సేవించాక మాలెంపాటి అంజయ్య ముమ్మారు స్వచ్ఛ సుందర నినాదాలు పలికితే గాని నేటి శ్రమదానానికి ముగింపు రాలేదు.

            ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న - "దశాబ్దం తరవాత కూడ ఇంకా పూర్తి స్థాయిలో స్వచ్ఛ - శుభ్ర - హరిత- సౌందర్య స్పృహ రాకుంటే - స్పచ్ఛ కార్యకర్తలు కనుక పొరపాటున తమ త్యాగ గుణం సడలిస్తే - చల్లపల్లి స్వస్త - ఆహ్లాదాల సంగతేమిటి?”

            రేపటి వీధి శుభ్రత కోసం మనం కలువదగినది నాగాయలంక రోడ్డులోని వైశ్యా బజార్ వద్ద.

            ప్రతి ఊరికి వర్టిస్తవి

ఏవైనా చెడగొట్టుట ఎంతగానో సులభమో

మరల బాగు చేయడమే మరీ మరీ కష్టమో

స్వచ్ఛ శుభ్రతలె గాని పర్యావరణమె కానీ

ప్రతి ఊరికి వర్తిస్థవి - శ్రమ విలువలు తెలిసొస్తవి

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  30.12.2023