2985 వ రోజు.... ....           31-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఆదివారం – 2023 సంవత్సరాంతపు శ్రమ దృశ్యం - @2985*

            కాలగమనంలో చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం ఇంకొక సంవత్యరానికి వీడ్కోలు పలికింది! నేటి స్వచ్ఛ -  సుందరోద్యమ ధీరులు 20 మంది! వారి కార్యక్షేత్రం 3 చోట్లు గానూ, పనివేళ 4:20 నుండి 6:10 గానూ ఉండెను!

            మహాత్మా గాంధీ వీధి మొదలు దేవాలయ సముదాయం దాక తొలిదీ, పెదకళ్ళేపల్లి బాట నుండి RTC వాహన నిష్క్రమణ, ప్రవేశ మార్గాల దాకా ఈ కొద్దిమందే వీధి కాలుష్యాలకు సమాధానం చెప్పారు!

            “Cleanliness is next to Godlyness” అనే సామెత తిరగబడి Godliness is next to (Challapalli) Cleanliness” అనేట్లుగా ఉన్న వీధి కూడలి గుడులుంటే - తెల్లారాక చూడండి - ఎంత శుభ్రంగా - భక్తులకు ఆహ్లాదదాయకంగా మారాయో! అందుకిద్దరు మహిళల్తో సహా ఐదారుగురి పనితనం కారణం!

            బస్ స్టేషన్ కనుక బాగా వేకువనే తెరుచుకొన్న టీ - కాఫీ దుకాణాలు కూడ కాలుష్యం విషయంలో వెనకబడిలేవు! ముఖ్యంగా టీ - కాఫీ పేపర్ కప్పుల వ్యవహారం! చాల కాలం క్రిందటే స్వచ్ఛ కార్యకర్తలు కొనిచ్చిన గాజుగ్లాసులుండగా – ఈ పేపర్ కప్పుల గుట్టల గొడవెందుకో తెలియదు!

            ఆటో స్టాండు వద్ద కూడ రకరకాల వ్యర్ధాలున్నా, గతంలో కన్న తక్కువే! అందుక్కారకులైతే మాత్రం ఆటో డ్రైవర్ సోదరులభినందనీయులే మరి!

            బస్సుల నిష్క్రమణ ద్వారం దగ్గరా, ప్రవేశ ద్వారం ప్రక్కనా ఉన్న కాఫీ, టిఫిన్ అంగళ్ళ వారే మరింతగా జాగ్రత్త వహించవలసింది!

            తమవి కాని 2 వీధుల్లో ఈ ఆరేడుగురు చీపుళ్ళ వారింత కష్టించి శుభ్రపరచడం స్వచ్ఛ - సుందర చల్లపల్లికే చెల్లింది!

            నేటి మరొక విశేషమేమంటే – 3 రోజుల రామోజీ ఫిల్మ్ సిటీ – గోల్కొండ ఖిల్లాల పర్యటన ముగించుకొని వేకువ -1:30 కు ఊరు చేరి, 2:00 కు ఇళ్ళు చేరిన ముగ్గరు కార్యకర్తలు ఆలస్యంగానైనా సరే... ఆవురావురుమని బస్టాండు దగ్గర శ్రమదాతలుగా మారడం!

            ఇలా చెప్పుతూపోతే - నేటి కార్యకర్తల సంఖ్య చిన్నది - విశేషాలు పెద్దవి! 6:25 కు ల్యాబ్ రవీంద్ర ముమ్మారు చెప్పిన స్వచ్చోద్యమ నినాదాలు పునరుద్ఘాటించి ఇళ్లు చేరారు!

            2024 సంవత్సరాన్ని శ్రమదానంతో స్వాగతించేందుగ్గానూ మనం రేపటి వేకువనే సమధికోత్సాహంతో కలువదగిన చోటు బస్ స్టాండు ప్రవేశద్వారం ఎదుటే!

            సహకారము పెంచి పొమ్ము!

వత్సరమా! మారి పొమ్ము! జనచేతన కల్గించుము!

స్వచ్ఛతలో ఆహ్లాదము, శుభ్రతలో సౌకర్యము,

అందములో ఆనందము అందరికీ బోధపరచి

శ్రమదానోద్యమమునకిక సహకారము పెంచి పొమ్ము!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  31.12.2023