2986 వ రోజు.... ....           01-Jan-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

సంవత్సరం తొలి వేకువ శ్రమదానం బస్టాండులో – @2986*

            ఇది క్రొత్త ఏడులో తొలి సోమవారం 1.1.2024! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమ నియమానుసారం ఈరోజు రెస్క్యూ టీమ్ కు కేటాయించవలసి ఉండగా, సదరు సంప్రదాయాన్ని ప్రక్కన బెట్టి సంక్రాంతి దాక స్వచ్ఛ కార్యకర్తలందరి విస్తృత సేవలు గ్రామ వీధులకు లభించబోతున్నవి!

            ఆ ప్రతిపాదనకు కారణం నూతన సంవత్సరారంభంలో తమ ఊరు మరింత పరిశుభ్ర స్వచ్ఛ సుందరంగా కనిపించాలనే కొందరి అత్యుత్సాహం! అందుకు మిగిలిన వాళ్ళ వత్తాసు!

            ఈ ఆంగ్ల సంవత్సరం తొలి వేకువ 4.20 వేళ స్వచ్ఛ వాలంటీర్ల కన్ను పడింది. RTC బస్ ప్రాంగణాంతర్గత కాలుష్యాల మీద, ఏడెనిమిది మంది చీపుళ్లతో ఊడ్చింది -1) ముఖ్య ఆవరణలో 2) పడమటి వేపు ప్రవేశద్వారం వద్ద, వాహనాలు నిలుపు చోటా!

            అంతకుముందు చొరబడిందీ, శ్రమను సమర్పించిందీ సైకిల్ స్టాండు పరిసర తోట లోపల. ఒంటి కత్తి వారూ, జోడు కత్తుల వారూ విరుచుకు పడిందీ ఉత్తరం ప్రక్కన పిచ్చి చెట్ల మీద.

            శ్మశానాల్ని, కాల్వగట్ల చిట్టడవుల్నే లొంగ దీసుకొన్న కత్తి వీరులకీ పనులేమీ క్రొత్త కాదు గాని, ఉచ్చ కంపుల్లో చేయడమే విశేషం! ఒకటో రకం అందమైన మూత్రశాలలుండగా - ప్రయాణికులిన్ని చోట్ల విసర్జన ఎందుకు చేస్తున్నట్లు? ఇనుప మెష్ లోతట్టున అరగంటకు పైగా కాలుష్య విముక్తి కల్గించిన అరడజను మంది శ్రమ ఫలించింది!

            కార్యకర్తల ప్రయత్నంలో ఎక్కువ తక్కువ లేముంటవి? ఎవరి శక్తి కొలదీ వాళ్ల ప్రయత్నం - ప్లాస్టిక్, గాజు సీసాలు, కప్పులు, గ్లాసులు, సంచులు ఏరే వారు, గోడల దుమ్మును కూడ దులిపిన వారు, లోదుకాణాల ముందటి దుమ్ము నూడ్చిన వారు, చెత్త బండెక్కి సర్దిన వీరుడు, చకచకా లోడింగు ముగించిన నిపుణులూ.... ఎవరు తక్కువని?

            రోజుటికన్న 10 నిముషాలు ముందే ముగిసిన నేటి శ్రమ వేడుక, సమీక్షాకాలంలో 3 రోజుల భాగ్యనగర యాత్రా  విశేషాల్ని వివరించిన Dr. DRK, 3 మార్లు నినాద రూపంలో స్వచ్ఛ సుందరోద్యమాన్ని కీర్తించిన Dr. పద్మావతి, నూతన సంవత్సరంలో 5* చాక్లెట్లు పంచిన శాస్త్రీజీ, క్రొత్త కేలండర్లు పంచిన వివేకానంద - విజయ కళాశాలల వారు, స్వయంగా కుట్టి చేసంచుల్ని పంచిన యడ్ల రాము నేటి ప్రత్యేకతలు!

            పాలడుగు రత్నకుమార్ - కంఠంనేని జ్యోత్స్నాదేవి (కోమలానగర్, చల్లపల్లి) దంపతుల నుండి ఈ ఉదయం 12 వేల రూపాయలు “మనకోసం మనం” ట్రస్టుకు అకౌంట్ బదిలీ జరిగినందుకు స్వచ్ఛ కుటుంబం ధన్యవాదాలు. మరొక 5 వేలు చెక్కు రూపేణా పంపిన అజ్ఞాత దాతకు కూడా మన కృతజ్ఞతలు. మొన్నటి హైదరాబాద్ యాత్ర సందర్భంగా అనుకోకుండా 1,000/- విరాళం సమర్పించిన స్వచ్ఛ కార్యకర్త – కోట పద్మావతి గారికి అభినందనలు.

            ఇంకా మిగిలిన బస్ ప్రాంగణ శుభ్ర - సుందరీకరణ కోసం మనం రేపటి ఉదయం కూడా ఇక్కడికే చేరుకోవలసి ఉన్నది!

            ఈ ట్రెండే కొనసాగుట

మద్యం - డాన్సులతోనే మరొక క్రొత్త ఏడాదిని

స్వాగతించడం బదులుగ సొంతూరికి శ్రమదానం

స్వచ్ఛ కార్యకర్త స్టైలు - బహుజన హితకారకం

ఈ ట్రెండే కొనసాగుట ఎంతైన ముదావహం!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  01.01.2024