3049* వ రోజు....... ....           04-Mar-2024

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

వేకువ 4.22 కే వెంకటాపురం రహదారి బాగుసేత - @3049*

         సోమవారం (4.3.24) నాటి ఆ ప్రయత్నం 27 మందిది! వారిలో 6 గురు స్ధానిక పాఠశాల విద్యార్థులు, మరొకరు వెంకటాపురం వాస్తవ్యుడు. ఎంత ముందుగా బయల్దేరి

నా - ఇంతటి భారీ మంచులో ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి, వేంకటాపురం వంతెన చేరుకొనేందుకింత సమయం పట్టింది!

         సుమారు 2 గంటల పారిశుద్ధ్య క్రీడలో 7-8-9 తరగతుల విద్యార్దులదే ముఖ్య పాత్ర. తమ ఊరి రోడ్డు మెరుగుదలలో చల్లపల్లి కార్యకర్తలకు సహకరించింది కాక, 6.30 తరువాత ఆ విద్యార్ధినులు స్వయంగా వ్రాసుకొచ్చి పాడిన పాటే అందర్నీ ఆకర్షించింది!

         చల్లపల్లిలో ఏ 4:00 కో బయల్దేరి, మంచుకోటని ఛేదించుకొంటూ, రోడ్డు గుంటల్ని దాటుకొంటూ వచ్చిన కార్యకర్తలు 20 నిముషాల ప్రయాణంలో నడుములెలా ఇబ్బంది పడిందీ చెప్పుకొంటుంటే విన్నాను! వాళ్ళ శ్రమదానమా – వచ్చి వెళ్లిన 10 కిలోమీటర్ల కిలోమీటర్ల ప్రయాణ సాహసమా – ఏదీ గొప్పోమరి! 6.20 వేళకు 2 ఈలలు మ్రోగి పనిముగించినా, అతి దట్టమైన మంచు వల్ల పడమరగా అర్థచంద్రయ్యా, తూర్పున వెలా – తెలా పోతూ పూర్ణచంద్రుడిలాగా సూరయ్యా!

         “ఇంత ప్రతి కూలత మధ్య 100-150 గజాల రోడ్డును నలుగురు చీపుళ్లతో ఊడ్వడమూ, కత్తుల వారు పనికిమాలిన పిచ్చి మొక్కల్నీ, రోడ్డు వారగా పెరుగుతున్న తాడి మొక్కల్నీ నరకడమూ, కొందరు చకచకా ప్లాస్టిక్ వ్యర్ధాల్నీ, గుర్తు తెలియని వ్యర్ధాల సంచుల్నీ ఏరడమూ, సగం కాలి అసహ్యంగా కనిపించిన తాడి మొద్దుల్నీ కనపడకుండా వెనక్కి నెట్టడమూ, ముగ్గుర్నలుగురు ఎండూ - పచ్చీ గడ్డిని చెక్కడమూ.. అసలీ పనుల్ని దగ్గరగా చూస్తున్న నా బోటి వాళ్లకు కావలసినంత పరమానందమూ!

         ఇంతటి మంచునూ, రానూపోనూ 10 కిలోమీటర్ల కఠిన ప్రయాణాన్ని 2 గంటల శ్రమనీ స్వచ్ఛకార్యకర్తలెలా తట్టుకొంటారని ఆలోచిస్తే – సమాజం పట్ల వాళ్ళకున్న నిబద్ధతో, చేస్తున్న శారీరక శ్రమో కారణాలనిపిస్తున్నది!

         6.35 సమయంలో కార్యకర్తలు ఊరునానుకొని ఉన్న పంట కాల్వ ఒడ్డున నిలిచి, 8 వ తరగతి విద్యార్ధి అఖిల్ ప్రకటించిన తన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాల్నందుకొని, ముగ్గురు విద్యార్థినుల స్వయం విరచిత ఆరోగ్యదాయక గీతాన్ని విని,

         రేపటి శ్రమదానం నిమిత్తం పంట కాల్వ పెద్ద వంతెన దగ్గర కలవాలని నిశ్చయించుకొని, ఇంటి ముఖం పట్టారు!

         ఈ నెల పెన్షన్ ఇంకా వచ్చినట్టు లేదు గాని, తన నెలవారీ 5,000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి శంకర శాస్త్రి గారు  చెక్కు రూపేణా ఇవ్వనే ఇచ్చారు.  

         అలాగే బత్తిన ఉమాదేవి గారు (పోలీస్ ఉన్నతోద్యోగి అయిన శ్రీనివాస్ గారి సతీమణి) కూడా తమ నెలవారీ 5000/- చందాను ట్రస్టు ఖాతాకు ఆన్లైన్ లో పంపినందుకు ఉభయ దాతలకు మన కృతఙ్ఞతలు.

     అంకితులు మన చల్లపల్లికి  11

శివరామ పురీయుడైన ప్రేమానందుని కెందుకొ

చల్లపల్లి వీధుల్లో స్వచ్ఛ - శుభ్ర భోగట్టా!

వ్యవసాయం చూసుకోక పొరుగూళ్ళకు సేవలా?

ప్రతి వేకువ వెళ్లి శుభ్రపరచే పోతుండాలా?

- నల్లూరి రామారావు

   04.03.2024