3050* వ రోజు....... ....           05-Mar-2024

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

పని దినాల గుర్తింపు సంఖ్య 3050*

         సంఖ్య 5.3.24 - మంగళవారానిది; పనిమంతులు 24 మంది; స్థలమూ - కాలమూ నిన్నిటి వలెనే - వెంకటాపురం రోడ్డులో పెద్ద వంతెన సమీపం; 4:22 – 6:26 మధ్య కాలం! బాగుపడిన రహదారి 100 గజాలు.

         - అదీ సూక్ష్మంగా నేటి వేకువ శ్రమదాన సమాచారం! సామాజిక పరివర్తనను పసిగట్టే సూక్ష్మ గ్రాహులు చప్పున దీని వెనకున్న సంకల్పమేమిటో - నాలుగూళ్ల కార్యకర్తలింత అననుకూల వాతావరణంలో నాలుగైదేసి కిలోమీటర్లు గమించి, రహదారి శుభ్ర – సుందరీకరణకెందుకు పూనుకొన్నారో అర్థం చేసుకోగలరు!

         సాధారణులైతే - దీన్నొక చాదస్తంగానో, వేలం వెఱ్రి గానో, కీర్తి ప్రలోభంగానో, గ్రుడ్డెద్దు చందంగానో అనుకొంటే అనుకోవచ్చు!

3050* నాళ్ల శ్రమదాన సంఖ్య ఎందుకొక మైలురాయంటే :

- వీధుల్ని ఊడ్చి, మురుగు కాల్వల్ని బాగుచేస్తున్న తొలి 50 రోజులు పూర్తైనపుడు ఈ స్వచ్ఛ కార్యకర్తలు అదేదో ఒక విజయమూ అద్భుతమూ అన్నట్లు అభినందనలందుకొన్నారు. మరి అలాంటి అర్థ శతదినాల సంఖ్య ఇప్పుడు 61!

         (బహుశా - దీని గుర్తింపుగానే కాబోలు - చల్లపల్లి స్వచ్చోద్యమ భీష్ములైన శంకర శాస్త్రి గారు చాక్లెట్ బార్ల పంపకం చేశారు!)

         మరొక కోణం నుండి చూస్తే అసలీ పదేళ్ల శ్రమదాన ప్రస్థానం చాప క్రింద నీరులాగా ఈ వృద్ధ సమాజానికి శ్రమజీవన సంస్కృతిని అలవాటు చేస్తున్నది కదూ!

         ఏ కొంచెమో తగ్గినా ఈ వేకువ సైతం చలీ - మంచూ అనుక్షణం కార్యకర్తల్ని అనుసరిస్తూనే ఉన్నాయి! ఈ ఉదయం కూడ వేంకటాపురీయులైన ఒకరూ, విద్యార్థులూ ఊరికి దూరంగా ఉన్నా శ్రమదానానికి విచ్చేశారు!

- జోడు కత్తుల వీరుడొక్కడే ఐదారు తాడి చెట్లను సుందరీకరించగా,

- ఒక సూపర్ వైజర్ గారి చేతి వ్రేలు బొబ్బ లెక్కగా,

- ముగ్గురు మహిళలు తక్కిన వారికి దూరంగా తామెంచుకొన్న చోటును శుభ్రపరచగా,

- కత్తులకు పని చెప్పి, తాడి, ఈత మొక్కల్ని పెకలించిన వారు కొందరూ,

- చీపుళ్ళ శక్తిని చూపిన ముగ్గుర్నలుగురూ,

- ముగ్గుర్నైతే రెండేసిమార్లు బ్రతిమాలి పని విరమింపజేయవలసి వచ్చింది!

         అందరి కాఫీల సేవనం తర్వాత, చాక్లెట్ బార్ల పంపకం పిదప, కరంమూరి అనే విద్యార్ధికి స్వచ్ఛ వేంకటాపుర సాధనా నినాదాల అవకాశం వచ్చి, అడపా గురవయ్య బోలెడన్ని సూక్తులు విన్పించి,

         రేపటి మనం కలిసే చోటు వేంకటాపురం దగ్గరి వంతెన అని తేల్చుకొని, ఈ నాటి పని ముగించారు!

         అంకితులు మన చల్లపల్లికి  12 

వీధులూడ్చే - తుక్కులాగే పారిశుద్ధ్య పనులను

సునాయాసముగచేసే జ్యోతి విజయరాణి  

అటు రోగుల ఉపశమనం - ఇటు వీధుల సౌందర్యం

ఉభయ బాధ్యతల పట్లను ఉన్నదభినివేశం!

- నల్లూరి రామారావు

   05.03.2024