3052* వ రోజు....... ....           07-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3052* వ వేకువ శ్రమ కథనాలు!

            అనగా - గురువారం (7-3-24) నాటి పెదకదళీపురం రోడ్డు శుభ్ర - సుందరీకరణ చర్యలన్నమాట! వెంకటాపురం - శివరామపురం మధ్య గత ఆరేడు నాళ్ళుగా పాతిక - ముప్పై మంది సగటున తలా 2 గంటల వీధి 03.కాలుష్య విరుద్ధ సమరం! ఇప్పుడా ఉభయ గ్రామస్తులు వెళ్లి చూస్తే శివాలయం మొదలు పెద్ద వంతెన దాక సుమారు అర కిలోమీటరు దాక బాగుపడి ఎంత ముచ్చటగా ఉన్నదీ, వంతెన తర్వాత కార్యకర్తల కష్టం రుచి చూడని భాగమెంత దరిద్రంగా ఉన్నదీ ఇట్టే తెలిసిపోతుంది!

            అంతే కాదు - సామాజిక బాధ్యతంటే ఏమిటో చప్పున తెలిసొస్తుంది! స్వచ్ఛ చల్లపల్లి సైనిక గాయకుడు అప్పుడప్పుడూ

            ఒక్కసారైనా ఒక్క రోజైన స్వచ్ఛ కార్యకర్తగా బ్రతుకు నేస్తమా!

            ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా!...” ! అని పాడే పాటకర్ధం బోధపడుతుంది! మారుమూల చల్లపల్లి - వేంకటాపురం వంటి రహదారి శుభ్ర -  హరిత - సుందరీకరణ దర్శన భాగ్యానికి SP. బాలసుబ్రహ్మణ్యం, గురవారెడ్డి, గోపాళం శివన్నారాయణ వంటి ప్రముఖులెందుకు వస్తారో తెలిసొస్తుంది! చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాతలు 3052* దినాలుగా చేస్తున్న కృషి అర్ధంపర్ధం లేనిది కాదనీ, ఎప్పటికైనా ప్రతి గ్రామానికీ తప్పని సరనీ బోధపడుతుంది!

 

            ఒక ప్రక్క భారీ మంచు: తూర్పు నుండి చలి గాలీ, చిమ్మ చీకటీ, శివ రాత్రి పండక్కి ముందే వాహనాల రొదల మధ్య ఈ వేకువ 4:226:18 వేళల నడుమ జరిగిన రహదారి శుభ్ర - సుందరీకరణం వేంకటాపురం చరిత్రలో ఒక మంచి పుటగా మిగిలిపోతుంది!

            అందులోనూ ఆ గ్రామ పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల పట్టుదలైతే, వాళ్ల చురుకుదనమైతే మరింత ఆకర్షణీయం! భేషజాలు వదిలేసి, పెద్దలం ఆ పిల్లల్ని అనుకరించవలసిన తరుణం!

            వంతెనకు తూర్పు పడమరలుగానూ, ఉత్తర దక్షిణాలు గానూ కార్యకర్తల కత్తులకు బలైన మొండి మొక్కలూ, పిచ్చి - ముళ్ళకంపలూ, ఎండు గడ్డీ, గుబురు పొదల్లోకి విసరబడిన ప్లాస్టిక్ తుక్కులూ, అడ్డదిడ్డంగా పడున్న ఎండుకొమ్మలూ తాడి మొద్దులూ రెండు గంటల శ్రమతో తెగిపడి, ఏరబడి, సర్దబడి, ఇప్పుడెంత మర్యాదగా, అణకువగా కనిపిస్తున్నాయో వాట్సప్ లో వీక్షించండి!

            అనివార్యంగా దావణగెరెలోనో అమెరికా తదితర దేశాల్లోనో ఉంటున్న స్వచ్ఛ కార్యకర్తలు ఆనందించండి!

            6.30 దాటాక కూడ మంచు పొరమాటు నుండి బయట పడలేని సూర్యుడూ, మిణుకు మిణుకుమనే చంద్రుడూ నేటి స్వచ్ఛ కర్మ సాక్షులు!

            పిట్టకొంచెమూ - కూత ఘనమన్నట్లు సంతోష్ ప్రకటించిన వెంకటాపుర స్వచ్ఛ - సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతోనూ,

            DRK డాక్టరు సమీక్షతోనూ రేపటి శివరాత్రి పర్వదిన మహిళా దోనోత్సవ శుభాకాంక్షలతోనూ, శుక్రవారం ఉదయం మరొక మారు ఈ వెంకటాపురం వంతెన వద్దే కలుద్దాం!

    అంకితులు మన చల్లపల్లికి 14

అసలు సిసలు స్వచ్ఛ కార్యకర్త మెండు శ్రీనుడే

శ్రమదానము నందాతని సంగతి ప్రత్యేకమే

వచ్చామా - తోచిన పని చేశామా వెళ్లామా

అన్నట్లాతని వైఖరి అందరికీ ఇష్టమే!

- నల్లూరి రామారావు

   07.03.2024