3053* వ రోజు....... ....           08-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మహాశివ రాత్రి వేకువ సామాజిక శ్రమ పండుగ! - @3053*

            ఈ శుక్రవారం (8.3.24) అనేముందిలే - దేశ కాల స్వభావాల్ని అర్థం చేసుకొని, సమాజం నుండి తీసుకొన్న అప్పు చెల్లిస్తున్న చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకు ఈ పదేళ్లుగా ప్రతిరోజూ పండగే! వాళ్ల స్థాయిని బట్టి చూసే వాళ్లకెలా కన్పించినా, 3 లక్షలకు పైగా గంటలు శ్రమిస్తున్న బాధ్యులకు ఏరోజుకారోజు అందుతున్నది ఎనలేని సంతృప్తే!

            నేటి సంధ్యాపూర్వక పుణ్యకాలంలో - నాలుగైదారు కిలోమీటర్ల దూరాన్నీరోడ్డు గుంటల్నీ, మంచునీ, కళ్లేపల్లి దైవ దర్శన కుతూహల ప్రయాణికుల్నీ దాటుకొని, తప్పుకొని, వెంకటాపురం దగ్గరి వంతెనను చేరుకోనేసరికి కాస్త ఆలస్యమై 4:29 సమయం!

            ఇక అక్కడి నుండి సుమారు 2 గంటల పాటు_డజను మంది స్త్రీ కార్యకర్తల్తో  సహా - ఒక దశలో 36 మంది సముచిత శ్రమదానం! ఫాన్ల క్రింద - ఎయిర్ కండిషనర్ల సమక్షంలో ఉద్యోగం కాదు - బూడిద, దుమ్ము, ఇసుకల్లో దంతెలతో కత్తులతో చీపుళ్లతో - చీకటి వేళ చేస్తున్న బరువు, మురికి పని!

            తల దీపాల వెలుగులో అమావాస్య నాటి సన్నని చంద్ర వంక సాక్షిగా - గంటన్నర పాటు సున్నితమైన మహిళల చేతులు గునపాలు, పారల్ని వాడుతూ చేసిన రహదారి పారిశుద్ధ్య కృషి! పెద్ద చెట్ల మొదళ్లు అడ్డదిడ్డంగా అసహ్యంగా పడి ఉండడం నచ్చక బలంగా కదల్చి, తమకు నచ్చినట్లమర్చిన మొండి పనులివి!

            ఈ పనులకు కలిసి వచ్చిన పాఠశాల విద్యార్థులు కృతకృత్యులు - వారు చిన్న వయస్సులోనే పెద్దలకు ఆదర్శ పాత్రులు!

            గృహిణులూ, ఉద్యోగులూ, వయోధికులూ ధన్యులు - సామాజిక కర్తవ్యం చక్కగా నెరవేర్చిన నిండు సంతోషం వారిది!

            పెను పండుగకుపోతున్న వస్తున్న, పారిశుద్ధ్య పనులను పట్టించుకోని వాహన చోదకులు అభినందనీయులు - మరి వారి భక్తీ - ముక్తీ వారిది!

            మనుషుల ప్రమత్తత వల్లే జరుగుతున్న కాలుష్య ప్రమాద నివారణకు ప్రకృతే ఈ 35 మంది కార్యకర్తల్ని నియమించుకోవడమూ, వాళ్లది విధ్యుక్తధర్మంగా - అసిధారావ్రతంగా నిర్వహిస్తుండడమూ విశేషం!

6.30 తర్వాత - 20 నిముషాల పాటు జరిగిన సమావేశంలో:

- వెంకటాపురం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయిని లంకే సుభాషిణి 1) వెంకటాపుర 2) చల్లపల్లి స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సాధనా సంకల్ప నినాదాలూ,

- పల్నాటి అన్నపూర్ణ రవ్వ కేసరి విందూ,

- కడియాల భారతి బిస్కట్ల పంపకమూ,

- వాసవీ క్లబ్బు వారు గోళ్ల ద్రోణ ఆధ్వర్యంలో జరిపిన మహిళా సమ్మానము వంటి విశేషాలూ,

   [అసలిందుకే మేము చల్లపల్లిలో జరిగేది శ్రమదానం కాదు శ్రమ వేడుకఅనేది!]

- రేపటి వేకువ కూడ మనం ఇదే వెంకటాపురం దగ్గరి వంతెన వద్దనే కలుసుకోవాలనే నిర్ణయమూ!

    అంకితులు మన చల్లపల్లికి 15

J.V.V. విధులందున తన సుదీర్ఘ చరిత్ర

సమతాసమావేశాల్లో గణనీయం ఆమె పాత్ర

దశాబ్ద కాలంగా తన స్వచ్ఛ సుందరోద్యమం

హెడ్ మిస్ట్రెస్ సుభాషిణిది ఎంతటి వైవిధ్యం!

- నల్లూరి రామారావు

   08.03.2024