3054* వ రోజు....... ....           09-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

నేటి (శనివారం – 09-03-2024) శ్రమదానం వరుస సంఖ్య 3054*

         శివరాంపురం, వెంకటాపురాల నడుమ రహదారే నేటి పాతిక మంది కర్మక్షేత్రం! అంటే-పాతిక వేలకు పైగా భక్తులు రెండేసిమార్లు శివరాత్రి సందర్భంగా పయనించిన రోడ్డు భాగాన్ని పునః శుభ్ర-సుందరీకరించే బాధ్యత కేవలం పాతిక మంది కార్యకర్తలది!

         ఇందులో ఏడేళ్ల విద్యార్ధి మొదలు నాలుగైదు కిలోమీటర్ల దూరాన ఉండే గృహిణులూ, ఉద్యోగినీ, ఉద్యోగులూ, డాక్టరమ్మలూ-డాక్టరయ్యలూ, చివరికి పంటి బాధతో సరిగా నడవలేక నడుస్తున్న 76 ఏళ్ల విశ్రాంతోద్యోగీ! పోనీ-ఇందులో నికరంగా 20 మంది-రెండేసి గంటల చొప్పున శ్రమించారనుకొన్నా 40 పని గంటల రహదారి పారిశుద్ధ్య/సుందరీకరణం ఈ ఒక్కపూటే!

         ఐతే-కళ్లేపల్లి యాత్రికులూ, ఇతరులూ బొత్తిగా కష్టపడలేదనుకొనేరు-ఒకానొక వెంకటాపుర ధార్మిక సంస్థ వారు ఉచితంగా పంచిన శీతల పానీయాన్ని త్రాగేసి, కిలోమీటరు పొడువునా ఖాళీ ప్లాస్టిక్ సీసాలను విసిరారు కదా! ఆ 2-3 వేల బాటిళ్లను ఐదారుగురు కార్యకర్తలు ముప్పావు గంట సేపు ఏరుకొనే అవకాశం ఇచ్చారు గదా!

ఇక - 20 మంది కార్యకర్తల వేకువ శ్రమదానమెట్లున్నదనగా :

- సుమారు 150 గజాల రహదారి ప్రక్కల కోనేరు ట్రస్టు వారు నారు పోసి – నీరు పోసి పెంచుతున్న మామిడి మొక్కల పాదుల్ని కలుపు తీసి, చక్కదిద్దుట,

- ఏడెనిమిది మంది ఎండు - పచ్చి గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ తెగ నరుకుట,

- ముగ్గురు పిల్లలైతే శివరాంపురం దాకా వెళ్లి, ప్లాస్టిక్ కవర్లూ, కప్పులూ, గ్లాసులూ, సీసాలూ ఏరుకొచ్చారు,

- ఒక అదృష్టవంతుడైన కార్యకర్తకు మద్యం సీసా (ఖాళీది కాదు) దొరికినా సద్వినియోగం చేసుకోలేదెవ్వరూ!

- దుమ్మూ - బూడిదా ఉన్న ఒక భాగాన్ని ముగ్గురు సుందరీకర్తలు ఎలా శుభ్రపరిచారో ఫోటో ఉంటే చూడండి?

- పనులు విరమించాక - అంటే 6.25 దాటాక పంట కాల్వ ప్లాస్టిక్ వ్యర్థ్యాల పనిలో దిగారు కొందరు!

         అప్పుడిక అందరూ గుమి కూడి, వాడి పేరు అఖిలేష్ అట - భూమికి జానెడెత్తున్నాడేమో - నిర్భయంగా ముమ్మారు చెప్పిన స్వచ్ఛ సుందర వెంకటాపుర సాధనా సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించారు. (ఈ అఖిలేష్ సాధారణంగా లేడు - నిన్న చెత్త రిక్షాను సొంతంగా త్రొక్కుతూ, తన ఊరి వీధి వ్యర్ధాలను ఏరుకొస్తున్న అతని వీడియో చూశారా?)

         రేపటి వేకువ మనం తొలిగా కలవదగిన చోటు శివరాంపురం దగ్గర్లోని పొలం బాటలోనని తెలిసింది!

        అంకితులు మన చల్లపల్లికి 16

‘తగుదునమ్మ’ – అనుకొంటూ (ఒక మాలెంపాటి )

ఎనభైనాల్గేళ్ల వైద్యుడెపుడూ ఏవో నొప్పులు!

ఇంటి పనులు-పెరటి పనులు ఇవి చాలక వచ్చుటా?

‘తగుదునమ్మ’ - అనుకొంటూ తన ఊరికి సేవలా?

తనదు ఇంటి బాధ్యతలను తాను మోస్తె చాలదా?

- నల్లూరి రామారావు

   09.03.2024