3055* వ రోజు....... ....           10-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

ఆదివారం( 10-3-24) నాటి మరొక చిరస్మరణీయ శ్రమ సౌందర్యం - @3055*

         ఈ దృశ్యం కూడ ప్రాత శివరామపుర - వెంకటాపురాల నడుమ రహదారి వద్దనే! ఈ శ్రమ ప్రవాహ కారకులు కూడ ఒకరు కోనేరు ట్రస్టు మారుతీ ప్రసాదైతే, మరొకరు ఎడతెగని శ్రమ త్యాగ ధనులైన 25 మంది స్వచ్ఛ చల్లపల్లి కారకర్తలే! వారికి సహకరించింది 10 మంది ఉభయ గ్రామస్తులే! చలీ - మంచూ కాస్త తగ్గి, ఈ 30 మందికి అనుకూలించిందనే చెప్పాలి!

50 పని గంటల నేటి శ్రమదానం ఎందుకు మరింతగా స్మరణీయమంటే :

1) బరువైన, కష్టతరమైన ఈ శ్రమకాలం వేకువ 4:26 – 6:19 నడుమ;

2) కార్యకర్తల ఇళ్లకు పని చోటు 3-4 కిలోమీటర్ల దూరాన;

3) ఇక పని స్వభావమా – త్రవ్వి గట్టున బిగిసిన డ్రైను మట్టిని గునపాలతో కుళ్ళగించి, డిప్పలకెత్తి 100 గజాల దూరం మోసి, కోనేరు ట్రస్టు వారి సహకారంతో నాటి, పెంచుతున్న పండ్ల మొక్కలకు పాదుల్లో నింపి, సర్దడమే.

4) ఆరేడుగురు గునపాల పనివారెంతగా కష్టించి, చేతులు బొబ్బలెక్కుతున్నా గంటన్నర పైగా మట్టి పెళ్లల్ని కదిలించారో – అంతే మంది చేతుల్తో,  పారల్తో సారవంతమైన ఆ మట్టిని డిప్పల్లో నింపారో - సదరు డిప్పల్ని అంచెలంచెలుగా భుజం మార్చుకొంటూ 10 మంది మోసి, మామిడి - నేరేడు పండ్ల చెట్ల పాదుల్లో దింపారో – దీన్నే నేను ‘నిస్వార్ధ శ్రమైక జీవన సౌందర్య సాక్షాత్కారం’ అని వర్ణించేది!

        ‘సామాజిక బాధ్యత’ అనే ఒక్క కారణం ఇందరు కార్యకర్తల్ని వేకువ శ్రమదానానికి కదల్చడమూ, ఆ పని పదేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగడమూ, దానికి అన్ని రంగాల అన్ని వర్గాల వారూ సహకరించడమూ నేటి వికృత సమాజంలో ఒక మహత్తర సంఘటనం కాదా?

         నేటి వేకువ శ్రమ సన్నివేశాల్లో నన్ను మరీ ఆకర్షించినవి రెండు. మట్టి దిబ్బల్నుండి, చెట్ల మొదళ్ల దాక గతుకుల రోడ్డు మీద మహిళలు పోటీలు పడి డిప్పలు మోయడమొకటీ, పదేళ్ల సగటు వయస్కులైన స్కూలు విద్యార్థినీ విదార్థులు ప్రతి పనికీ పరవళ్ళు త్రొక్కడం రెండవదీ!

అందరం గుర్తింపదగిన - ఒప్పుకోక తప్పని అంశాలు -

1) మన సమకాల సమాజంలో అంతా స్వార్థమే – సంకుచితత్వమే కాదు, కాస్తంత త్యాగమూ, విశాల దృక్పథమూ మిగిలే ఉన్నాయి.

2) నిరుపయోగంగా రోడ్డు ప్రక్క అసహ్యంగా పడి ఉన్న మట్టి గుట్టలు మానవ శ్రమతో, సదుపయోగ్యమై చెట్లకు బలవర్ధకంగా మారుతున్న ఒకానొక ‘గరిష్ట సామాజిక ప్రయోజనాన్నీ’.

         6:30 తర్వాత శివరామపురం - బాల దుర్గా రాంప్రసాద్ గారి ఇంటి వద్ద జరిగిన ముగింపు సమావేశం గూడ అంత ఘనంగా జరిగింది. ధ్యానమండలి గోళ్ల వెంకటరత్నం మూడుమార్లు నినదించిన స్వచ్ఛ – సుందర నినాదాలు,

         రెస్క్యూ టీమ్ వారి, రాణి గారి సహకారంతో BDR ప్రసాద కార్యకర్తలకిచ్చిన అనల్పాహార విందూ, కొసరుగా అతని టొమాటోల పంపకమూ,

         రేపటి వేకువ కూడ మన శ్రమదాన రంగస్థలం శివరామపుర సమీప రహదారి అనే నిర్ణయమూ...

     అంకితులు మన చల్లపల్లికి 17

BDR చమత్కృతులు - వెల్లువగా మాటలు

అనధికారు లధికారులు అందరితో చొరవలు

శ్రమదానం మెలకువలూ స్వచ్చోద్యమ చల్లపల్లి –

శివరాంపుర కలయికలు తన మంత్రాంగమే!        

- నల్లూరి రామారావు

   10.03.2024