3056* వ రోజు....... ....           11-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మట్టి పనికే అంకితమైపోయిన 3056* వ వేకువ శ్రమదానం!

          11/3/24 - సోమవారం వేకువ మరొకమారు శివరామ - వెంకటాపురాల రహదారి మీదనే 21 మంది శ్రమదాతల వీరవిహారం! 4:27 మొదలు గంటా ఏభై నిముషాల చొప్పన కష్టించడంతో మరికొన్ని మామిడి పనస - సపోటా - నేరేడు పండ్ల మొక్కలకు చేకూరిన బలం!

          మట్టి త్రవ్వకానికీ, పండ్ల చెట్లున్న వెంకటాపుర వంతెనకీ ½ కిలోమీటరు దూరం ఉన్నందున రవాణా కోసం టాటా ఏస్ అవసరం! ఉన్న 21 మందే 3, 15, 3 గా విడిపోయి కత్తీ దంతె పనులూ, మట్టి గుట్టలు త్రవ్వి, డిప్పలకెత్తి, ట్రక్కులోకి చేర్చి, గమ్య స్ధానం దగ్గర చివరి ముఠా పండ్ల చెట్ల పాదుల్లో సర్దిన పని విభజనం!

          ఈ పని కాక - ముగ్గురు కార్యకర్తలు 3 కత్తుల్తోనూ, ఒక దంతె, ఒక చీపురుతోనూ శివరామపురం దగ్గరగా రోడ్డు మార్జిన్లోని, డ్రైనులోని గడ్డినీ, పిచ్చి చెట్లనూ తునుమాడడం!

          రోజుటంత చురుకుగా, అనుకొన్న అంచనాగా ఈ వేకువ పని జరగదనుకొన్నాను గాని, ఉన్న కార్యకర్తలే మరికాస్త ఎక్కువగా శ్రమించడం వల్ల పని పరిమాణం బాగానే ఉన్నది.

          ఇద్దరు రైతు మహాశయులు తమ పొలంలోని మినప పీకుడు పని వల్ల ఈ పూట రాలేకున్నా, ఒక్కడు తప్ప Z.P పాఠశాల విద్యార్థులు హాజరుకాకున్నా, రెండు పని స్ధలాలకు దూరం ఎక్కువగా ఉన్నా సరే - పని ఏ మాత్రం కుంటు పడలేదంటే - అందుక్కారణం కార్యకర్తల పని దీక్ష, క్రమశిక్షణ, ప్రణాళిక అన్నమాట! స్వార్ధానికి కాక మీడియా కోసం కాక కీర్తి ప్రలోభాలకు కాక - కేవలం తమ అత్మ సంతృప్తి కోసం జరిగే కృషి ఇలా కాక మరెలా ఉంటుంది?

          మట్టి రవాణా కోసం టాటా ఏస్ నాలుగో ఐదో ట్రిప్పులు తిరిగి, ఈ రోజు మంచు తాకిడి కాస్త తగ్గి, తూర్పున బారెడు ప్రొద్దెక్కి, 6:20 కి పెదకళ్లేపల్లి RTC బస్సు తమను దాటి వెళ్లినప్పుడు కార్యకర్తలు తమ పని ముగించి రోడ్డు మార్జిన్లో నిలిచి,

          సంతోష్ అనే విద్యార్థి తన స్వచ్ఛ - సుందర వెంకటాపుర సాధనా సంబంధిత నినాదాలిచ్చి,

          ప్రాతూరి శంకర శాస్త్రి ద్వారా వారి విశ్రాంతోపాధ్యాయ - బంధువులు - ఖమ్మం వాస్తవ్యులు - గౌ. శారద, సీతారామారావులు 10 వేల విరాళపు బ్యాంకు చెక్కు మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీ గారికి అంది,

          రేపటి వేకువ కూడ ఇంకాస్త మిగిలిన మట్టి పని కోసం మనం కలువవలసిన చోటు శివరామపురం సమీప రహదారి పైనే అని నిర్ణయించుకొని, కార్యకర్తలు ఇళ్లకు బయలుదేరారు.

     అంకితులు మన చల్లపల్లికి 18

ఆసుపత్రి విధుల్లోన అసలు సిసలు ఆల్ రౌండర్

ఒత్తిడిలో రాణించే దుర్గాప్రసాద్ వేల్పూర్

స్వచ్చోద్యమ దైనందిన చరిత్రలను లిఖించే

అతని నేర్పు - అతని ఓర్పు - అండదండ నాకే!

- నల్లూరి రామారావు

   11.03.2024

ప్రాతూరి శంకర శాస్త్రి ద్వారా వారి విశ్రాంతోపాధ్యాయ - బంధువులు - ఖమ్మం వాస్తవ్యులు - గౌ. శారద, సీతారామారావులు 10 వేల విరాళపు బ్యాంకు చెక్కు
గౌ. శారద, సీతారామారావులు