3057* వ రోజు....... ....           12-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3057* వ నాటి రహదారి మెరుగుదల సందడి!

         మంగళవారం(12-3-24) శుభ బ్రహ్మముహూర్తంలో కూడ మళ్ళీ అదే వెంకటాపురం రహదారిలోనే! చల్లపల్లి నుండి 16 మందీ, వెంకటాపురం, శివరామపురాల నుండి 11 మందీ - వెరసి 27 మంది – 4:22, 6.20 వేళ చేసిన ప్రయత్నం ఫలించి, 20 కి పైగా మామిడి, సపోట, నేరేడు వంటి పండ్ల చెట్ల మొదళ్ళు బలపడినవి!

         వేళ కాని వేళ ఇందరు అనువు కాని చీకటి చోట్ల ఎందుకు శ్రమించారో, ఏం సాధించారో అని ఒక్కమారు వివరాల్లోకి వెళితే:

     వీళ్ళు స్వచ్ఛ - సుందర కార్యకర్తలు. వాళ్ల వీధి - ఊరూ ఊరి శ్మశానాలూ - బస్టాండులూ - డ్రెన్లూ - రహదార్లూ పరిశుభ్రంగా ఉండాలనీ, పచ్చదనాన్నీ - పూల సుగంధాన్నీ పంచుతుండాలనీ, తద్ద్వారా గ్రామ ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం వర్ధిల్లాలనీ మంకు పట్టు పట్టి పదేళ్ల నుండీ మంచి ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తున్న వాళ్ళు!

         అదృష్టవశాత్తూ గ్రామ ప్రముఖులూ, అధికారులూ, అనధికారులూ వివిధ ప్రభుత్వ శాఖలూ ఈ 100 కు పైగా గల కార్యకర్తలకు సహకరిస్తుంటారు. దేశవిదేశాల్లోని ప్రవాసులూ అర్థం చేసుకొని ఆశీర్వదిస్తుంటారు!

         ఒక దశాబ్దకాల చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమాన్ని నిష్పక్షపాతంగా బేరీజు వేసే ఎవరైనా ఇలాగే అంచనా వేస్తారు!

ఈ ఉదయం శ్రమ సన్నివేశాలనే గమనించండి -

         ఉత్సాహం ఉంది గానీ వయసూ - ఆరోగ్యమూ సహకరించని ఒక విశ్రాంత హిందీ పంతులు గారూ

         శివరామపురం నుండి వేకువ చీకట్లో ఒంటరిగా నడిచి వచ్చి కార్యకర్తల్లో కలిసిపోయే ఒక గృహిణీ -

         ఉద్యోగ విధులున్నా సరే 3-4 కిలోమీటర్లు పయనించి, శ్రమంచి వెళ్లే కొందరూ

         అన్నిటి కన్నా ముఖ్యంగా 9-14 ఏళ్ల స్కూలు పిల్లలూ ఏం జరుగుబాటు లేదని - ఎవరు బలవంతం చేశారని ఇంత కఠిన శ్రమ చేయాలి?

         పైగా - ఇదేమన్నా బట్టలు నలక్కుండా - మీడియా సమక్షంలో ఏ పావుగంటో చేసే శ్రమా? చెమటలు కారి, ఒంటికీ బట్టలకీ దుమ్ము కొట్టుకొనే 1) మొక్కలు నరికే  2) పారలు పలుగుల్తో ఊరికి దూరంగా చేస్తున్న కష్టం!

         ఐదు ట్రక్కుల మట్టి కాబోలు త్రవ్వి, టాటా ఏస్ లో నింపేవాళ్ళు నింపుతుంటే, అక్కడికి దూరంగా వెంకటాపురం చెరువు దగ్గరి కోనేరు ట్రస్టు వారిచే సంరక్షించబడుతున్న పండ్ల మొక్కల దగ్గరకు చేర్చి, పాదుల్లో సర్దేవారు, ఒక డాక్టర్ గారు పర్యవేక్షించి జరిగిన 2 గంటల బాధ్యత!

         6:35 కు సాహితి నాయకత్వంలో అందరూ స్వచ్ఛ - సుందర వెంకటాపుర సాధక నినాదాలు పలికి, శంకర శాస్త్రి ప్రాయోజిత చాక్లెట్లు స్వీకరించి రేపటి కార్యక్రమం కూడా శివరామపురం సమీపంలోనే అని నిర్ధారించుకుని ఇంటి ముఖం పట్టారు.

నేటి స్వచ్చోద్యమ విరాళాలు :

1. స్థోమతుకు మించిన దానశీలుడు కంఠంనేని రామబ్రహ్మం తన 73 వ జన్మదిన పురస్కారంగా  మనకోసం మనం ట్రస్టుకు 55,000/-

2. చందమామ అపార్ట్మెంట్స్ కు చెందిన Y.V.కృష్ణారావు గారి తనయుడు యడ్ల వెంకట శ్రీకాంత్ (కోసూరు పాఠశాలోపాధ్యాయుడు) గారి 10,000/-

     అంకితులు మన చల్లపల్లికి – 19

అతడెవరో లౌవ్లీఅట! అతని వయస్సరువది+

ఐనా రహదారుల్లో అందగింపు లెందుకో!

చెత్త బళ్ల లోడింగుల చెత్త పనులు ఎందుకో!

తన ఇంట్లో - పొలంలోన తనకు పనులు లేకనా?

- నల్లూరి రామారావు

   12.03.2024

యడ్ల వెంకట శ్రీకాంత్ గారు
కంఠంనేని రామబ్రహ్మం గారు