3059* వ రోజు....... ....           14-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

గురువారం(14/3/24) నాటిది 3059* వ శ్రమ సందడి!

            సందడి శివరాంపురం సమీప రహదారి మీద; చేసినవారు 28 మంది; అందులో వెంకటాపుర పాఠశాల సంబంధీకులు H.M. తో సహా 10 మంది వీళ్లలో రెండైతే మరీ పసి మొహాలు! ఈ వేకువ క్రొత్తగా వచ్చినవాడు నందు నాలుగో క్లాసువాడు - నాకు మాత్రం రెండో తరగతి వాడనిపించింది. 

            పెద్ద, గట్టి కార్యకర్తలు ఇవాళ రాలేని లోటును కొంతవరకు రాముడుపాలెం కార్యకర్త తీర్చాడు, క్రమం తప్పక ప్రతి వేకువ శ్రమదానాన్నీ శ్రద్ధగా పరిశీలిస్తే ఎవరికైనా అది ఎప్పటికప్పుడు క్రొత్తగా - ఆశ్చర్యకరంగా - ముదావహంగా కనిపిస్తూనే ఉంటుంది.

            Dr. డి.ఆర్. కె గారు తరచూ అనేట్లు తమ కోసం కాక - ప్రజల కోసం - ఇంత వేకువనే ఈ మట్టి - గొట్టు పనులు ఎవరు చేస్తారండీ?” ప్రస్తుత కాలాన్నిబట్టి కూలీ రేట్లు భారీగా పెరిగినా - వాళ్లైనా ఇంత శ్రద్ధగా - ఉత్సాహంగా అంకితంగా చేస్తారా?

            నేటి వేకువ 4:186:18 నడుమ జరిగిన పనుల్నే చూడండి - వంగి, మట్టి పెళ్ల లెత్త లేని స్త్రీలు పీటలపైన కూర్చొనే బరువు పనులు చేస్తుంటే

            బాగా బిగిసిన మట్టిని ఐదారుగురు గునపాలతో పెళ్లగిస్తుంటే - అలస్యం కాకుండా ఆ త్రవ్విన గడ్డల్నీ, పొడి మట్టినీ కొందరు టాటా ఏస్ లోకి మోసి నింపుతుంటే

            10-12 నిముషాల్లోనే ఆ ట్రక్కు నిండి, పని చోటుకు ముప్పావు కిలోమీటరు దూరాన వెంకటాపురం సమీపానికి తరలించి, అక్కడి మామిడి, సపోట, నేరేడు పళ్ల మొక్కల పాదుల్లోకి వంచి, సర్దుతుంటే

            చలి తగ్గటం వల్ల కొందరి బట్టలు చెమటతో తడిసిపోతే

            ఇంకొక కార్యకర్త కాస్త దూరంగా డ్రైనులో దిగి, పిచ్చి ముళ్ల మొక్కల్ని నరికేస్తుంటే

            ఇందులో కొన్ని ముఖ్య సన్నివేశాలని ఒకాయన ఫొటోలు తీస్తుంటే...

            ఇదంతా అడుగడుగునా అత్యద్భుత శ్రమజీవన సౌందర్యం కాదా?

            నాకైతే నందు, సంతోష్, అఖిలేష్ వంటి బాల కారకర్తల శ్రమదానంలో భవిష్యదుజ్జ్వల స్వచ్ఛోద్యమ నాయకత్వం కనిపిస్తున్నది!

            నేటి స్వచ్ఛ సుందర వెంకటాపుర సాధనా నినాదాలను అఖిలేష్ సహకారంతో నందు ప్రకటించాడు.

            స్వచ్ఛ కార్యకర్తల కాయకష్టాన్ని సమీక్షించిన బాధ్యత Dr. డి.ఆర్.కే ది!

            కార్యకర్తలకు పిండి వంటలు పంచిన సార్థక నామధేయ పల్నాటి అన్నపూర్ణ!

            విద్యార్థులకు పెన్నులు కొనిచ్చింది శంకర శాస్త్రి గారు కాక ఇంకెవరు?

            రేపటి వేకువ కూడ శివరామపురం దగ్గర్లోని రహదారి మీదనే మన పని పాటులు!

     అంకితులు మన చల్లపల్లికి 21

వసుధైక కుటుంబీకుడు బ్రహ్మకుమారీయుడు

అమెరికా ప్రవాసుడైన నాదెళ్ల సురేశుడు

మనోజవం అతని కృషి మనదు చల్లపల్లికి

ఎన్ని జన్మలెత్తిన ఆ ఋణం తీరదెన్నటికి!

- నల్లూరి రామారావు

   14.03.2024