3060* వ రోజు...........           15-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

వెంకటాపురం వద్ద రోడ్డు పనిలోనే - 3060*వ వేకువ కూడ!

            (15.03.2024) శుక్రవారం కూడ ఇంచుమించు అదే పని వేళ, నిన్నటికన్న ముగ్గురు ఎక్కువగా ఆ కార్యకర్తలే, మళ్లీ అదే మట్టి పనీ!

            రహదారి ప్రక్కన ఎండు మురుగు మట్టి దిబ్బలు చూసేందుకెంత మాత్రం బాగలేవనేదొకటీ - ఆ సారవంతమైన మట్టిని కోనేరు ట్రస్టు వారు పెంచుతున్న పండ్ల చెట్ల కుదుళ్లకు బలవర్ధకంగా సర్దితే మంచిదనే ఆలోచన రెండవదీ – అలా దిగారు 2 వారాల క్రితం చల్లపల్లి నుండి పాతిక మంది స్వచ్ఛ కార్యకర్తలీ పనికి!

            పెదకళ్ళేపల్లి తిరునాళ్ళ యాత్రికులు హాయిగా పయనించేందుకు వీళ్ళు ఐదారు రోజులు రోడ్డు మార్జిన్ల గడ్డీ, ప్లాస్టిక్ తుక్కులూ ఏరి శుభ్రపరిచాక వచ్చింది ఈ మట్టి సద్వినియోగం సంగతి!

            మరైతే - ఇదేమన్నా చిన్నా చితకా కష్టమా ఒకపూట ముగించి వెళ్లడానికి? అసలా చట్టుగొన్న మురుగు మట్టి దిబ్బల్ని గునపాలతో క్రుళ్ల బొడిచి, పెళ్ళలుగా - పొడిమట్టిగా విడగొట్టడానికే చేతులూ – గూళ్ళూ బొబ్బలెత్తే - పట్టుకు పోయే కఠిన కార్యమాయే! కార్యకర్తల్లో సగం మందేమో 60 ఏళ్లు దాటిన వాళ్ళూ, స్త్రీలూ!

            ఇక అలాంటప్పుడు అక్కరకొచ్చింది – వెంకటాపుర Z.P. పాఠశాల పిల్లల సైన్యం! ‘అసలు వాళ్ళ లేత వయసేంటో - తమ తల్లిదండ్రుల్ని ఒప్పించి వేకువనే ఊరికి దూరంగా ఈ మురికి పనికి రావడమేమిటో’ అని అలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చంగా స్వచ్ఛ - సుందర కార్యకర్తలకైతే ఈ మొండి బండ పని ఎప్పటికి పూర్తయ్యేదోమరి!

            వెంకటాపురం ప్రజల సామాజిక చైతన్యం ప్రతిష్టను ఈ చిన్నారులు నిలుపుతున్నారు!

            ఈ వేకువ కూడ చేసినోళ్లకి చేసినంత పని! నాలుగు టాటాఏస్ ట్రక్కుల మట్టిని గునపాలతో - పారలతో పెకలించడమూ, ఎత్తడమూ, దూరంగా ఉన్న పండ్ల మొక్కల పాదుల్లో నింపి, సర్దడమూ....ఎంత కష్టమో చేసే వాళ్లకి గదా తెలిసేది! (చూసిన నాబోటి వాళ్లకు గదా ఆశ్చర్యం, ఆనందం కలిగేది!)

            ఒక BSNL విశ్రాంత ఉద్యోగికి (ఆయనకీ మధ్య ఏదో శస్త్ర చికిత్స జరిగింది కూడ) బరువు పనితో నడుం పట్టిందట!

            ఒక వయోధిక మహిళ అండతో ప్రముఖ సుందరీకర్త మట్టి త్రవ్వడం ఆపి, కిలోమీటరు రాతిని నిటారుగా నిలిపి సంతోషించడమూ చూశాను!

            జరూరు కాన్ఫరెన్స్ పని మీద Dr.డి.ఆర్.కె కాస్త ముందే నిష్క్రమించగా 6:25 కు 7 వతరగతి విద్యార్ధి ‘వంపుగాని జస్వంత్’ మూడు మార్లు జాడించి చెప్పిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ,

            ‘రేపటి వేకువ కూడ మన గమ్యం శివరామపురం దగ్గరి రోడ్డు’ అనే నిర్ణయంతోనూ నేటి కార్యక్రమానికి శుభం కార్డు!

     అంకితులు మన చల్లపల్లికి – 21

ఎవరనుకొన్నారొ ఇతడు ఎదురు లేని అర్జునుడు

ఘంటశాలొ కర్ణాటకొ కాదు చల్లపల్లి వాడు

ఎనభయ్యారేళ్లయినా హృదయంతో యౌవనుడు

అతనికి ఋణగ్రస్తుడె చల్లపల్లి ప్రతి పౌరుడు!

- నల్లూరి రామారావు

   15.03.2024