3061* వ రోజు...........           16-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

సమాజానికి సమర్పణంగా 3061* నాటి 34 మంది శ్రమ!

         శనివారం(16.3.24) ఐనందువల్లేమో ఈ వేకువ 4:23 – 6:20 వేళల నడుమ శివరామపురం దగ్గరగా ప్రధానంగా మట్టి పనీ, కొసరుగా శుభ్రతా కృషీ జరిగాయి! జరిగిన సామాజిక బాధ్యత చల్లపల్లికి 4 కిలోమీటర్ల – వెంకటాపురానికి 1 కిలోమీటరు దూరాన! పాల్గొన్నది 4 ఊళ్ళకు చెందిన కార్యకర్తలు!

         వారిలో 11 మందైతే వెంకటాపురం పాఠశాల పిల్లలే! పాపం - 2 వారాలుగా మంచి సమాజ సేవ కలవాటుపడి, ఈ కార్యక్రమం చల్లపల్లికి తరలిపోతే - ఈ కల్మషం తెలియని పిల్లల మనసులకెంత వెలితిగా ఉంటుందో! అందుకే గాబోలు - ఈ స్వచ్ఛ - సుందరోద్యమ సంచాలకుడు నేటి చివరి దశలో ‘కనీసం వారానికొక రోజైనా మీ ఊరికి పనికొచ్చే మంచి పని చేస్తుండాలని’ వాళ్ల దగ్గర మాట తీసుకొన్నది!

         ఆ పిల్లల మంచి పనులకు మెచ్చే కాబోలు శంకరశాస్త్రి గారు వాళ్లకు కాగితం మీద వ్రాసేందుకు ఒత్తుగా నాణ్యమైన వ్రాత అట్టలు కొనిచ్చింది. శివరాంపురం రాణి గారు వాత్సల్యంతో వారికి పెన్నులు బహూకరించింది! అసలీ కుర్రకారు హుషారే పెద్ద కార్యకర్తల్లోకి వ్యాపిస్తుందో, పెద్దల అనుభవమే పిల్లల పనులకు అక్కరకొస్తుందో!

         ఐదారుగురు గునపాలతోనూ, పారల్తోనూ మట్టి దిబ్బల్ని త్రవ్వేస్తుండగా - ఏడెనిమిది మంది ఆ గడ్డల్నీ, పొడినీ డిప్పల్లో నింపుతుండగా – ఆ బరువు డిప్పల్ని కొందరు గట్టి వాళ్లు అవలీలగా మోసి, టాటా ఏస్ లో నింపగా – శివరాంపురం దగ్గరి పండ్ల చెట్ల వద్దకు పోతున్న గురవారెడ్డి వాహనాన్ని 10 మంది పొలోమని అనుసరిస్తుండగా - అంతే ఉత్సాహంతో సదరు మన్నును 3 రకాల పళ్ళ చెట్ల పాదుల్లో సర్దుతుండగా..... “ఇదొక అరుదైన అద్భుత సామూహిక శ్రమవేడుక” అని కాక మరేమనాలి?

         కుర్రకార్యకర్తల్లో కొందరి పని దృశ్యాన్ని ప్రధాన ఛాయా గ్రాహకుడు ఆడియో - వీడియోగా తీసి, చూపించినప్పటి వాళ్ల కేరింతలూ!

         2 గంటల బరువు - మురికి పని కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు! తీరా చూస్తే కిలోమీటరు రహదారి ప్రక్కన వందల కొద్దీ పండ్ల మొక్కల పాదులిప్పుడు మట్టి మేటల్తో ముచ్చట గొలుపుతున్నాయి!

         6:30 సమయంలో వెలుతురు పెరిగాక తీసిన ఫొటోలో పొడవాటి బాట ఎంత అందంగా – పొందికగా కనిపిస్తుందో చూశారా? ఈ సంతృప్తి కోసమే స్వచ్ఛ కార్యకర్తలు 3 వేలకు పైగా రోజుల్నుండీ శ్రమిస్తున్నది!

         చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ భారీ కార్యకర్త శ్రీమాన్ కోడూరి వేంకటేశ్వరరావు నెలవారీ విరాళం 520/- ని మేనేజింగ్ ట్రస్టీ గారు కృతజ్ఞతలతో స్వీకరించారు.   

         ఆదివారం నాటి పని సందడి కోసం సపరివారంగా మనం కలవబోయేది శివరాంపురం ఊరి చివర!

     అంకితులు మన చల్లపల్లికి – 22

పిండి జ్యోతంటే ఉత్సాహం – స్వచ్చోద్యమ విలాసం

అవసరమైతె చెత్త బండి నధిరోహించు సాహసం

పాదరసం వలె జరజర ప్రతి పనికీ హాజరు

బరువు పనికి తన సైజుకు పొంతనసలు ఉండదు!

- నల్లూరి రామారావు

   16.03.2024