3062* వ రోజు...........           17-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

           17-3-24 (ఆదివారం) ముగిసిన పండ్ల మొక్కల పాదుల పని @ 3062*

ఈవేకువ కూడ సుమారు తలా 2 గంటల శ్రమ వేడుక! అంటే 30X2 చొప్పున 60 పని గంటల రహదారి బాధ్యతల కూడిక ! ఇదంతా చల్లపల్లి స్వచ్ఛ- సుందరోద్యమ ఫలితమనే చెప్పాలిక!

"ఇది జరిగింది శివరామపురం నుండి వెంకటాపురం రోడ్డులో. అక్కడ 3 రకాల పండ్ల చెట్లకు పాదులు త్రవ్వి ఉన్నా, కంప రక్షణ దొరికినా, ఇప్పటి దాక శ్రేష్ఠమైన బలవర్థకమైన మట్టిని పాదుల్లో మేటలు వేయని లోటు ఈ ఉదయంతో తీరినట్టే..

         ఐతే ఇదంతా నేను వ్రాస్తున్నంత – మీరు చదువుతున్నంత సులభంగా జరగలేదు! 2 వారాల పాటు ప్రతి వేకువా పాతిక- ముఫ్పై మంది ఐచ్చికంగా చేసిన సముచిత శరీర శ్రమతోనే సాధ్యపడింది.

         ‘శ్రమయేవ జయతే’ అనీ, ‘కష్టేఫలే’ అనీ; “శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లే” దనీ అనుభవజ్ఞులు ఊరికే చెప్పలేదు. గత 15 రోజుల స్వచ్ఛ కార్యకర్తల కాయకష్టం చూస్తే- ఆ చెమట వాసనలు పిలిస్తే గాని పై సామెతలు బోధపడవు! మరొకటి రెండేళ్లు వేచి చూస్తేగాని ఈ రహదారి పచ్చదనం ఇనుమడించదు!

అందుకేనేమో నేటి పనిముగింపు వేళ నందేటి శ్రీనివాసుడు

“టపటపటప చెమట బొట్లు తాళాలై పడుతుంటే-

కదలి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే” – అనే పాటందుకొన్నాడు.

"నీతీమనదే- జాతీ మనదే...." అంటూ వెంకటాపురం విద్యార్థినులు ప్రబోధ గీతాలాపన చేశారు.

         8 వతరగతి వాడు మేడికొండ సంతోష్ తన గ్రామ సమాజానికి  బాధ్యతను గుర్తుచేస్తూ నినాదాలు ప్రకటించగా మిగిలిన 35 మందీ వంతపాడారు!

         స్వచ్ఛ చల్లపల్లి శ్రమదానం పేరెత్తితే చాలు - ఆర్థిక సహకారానికీ, మాట సాయానికీ కొందరు పోటీ పడతారు. ఇక్కడ శాస్త్రిగారనే ఒకాయనకు చేతికి ఎముకల్లోపించాయని చెప్పుకొంటారు. అలాంటి బాపతే - అంటే - శివరాంపురం నివాసిని- సుఖవాసి స్వరూపరాణి అనే ఒకామె కుడిచేతి ఎముకలో తేడా ఉన్నట్లుంది - గతంలో నాలుగైదు మార్లూ, ఈ రోజూ కార్యకర్తలకు సుష్టుగా అనల్పాహార పసందు చేశారు (విద్యార్థులకు నిన్న లేఖినులు కొనిచ్చింది కాక!)

శివరామపురం దగ్గరి రహదారి మీదనే రేపటి శ్రమదానం అని తెలిసింది!

     అంకితులు మన చల్లపల్లికి – 23

రాజుకాని భలే రాజు- రామానగరం రాజు

శ్రమను సమర్పించుటలో సాటిలేని మేటిరాజు

అతని ఉత్సాహం మిన్నంటును ఊరు మెరుగుపడిన రోజు

వీధి శ్రమలు చేయకున్న నీరసించు నతని ఫోజు!

 

- నల్లూరి రామారావు

   17.03.2024