3063* వ రోజు....... ....           18-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

వెంకటాపురాభిముఖంగానే మరొక వేకువ శ్రమ - @3063*

         సోమవారం వేకువ (18.3.24) కూడ మళ్లీ 20న్నొకరి రహదారి కృషి! మట్టి దిబ్బలు కొద్దిపాటివి మిగిలిన వని ఈ కొంచెం మందే పలుగూ - పారల్తో దండెత్తి, త్రవ్వే వాళ్లు 4 గురు త్రవ్వి, డిప్పలతో దగ్గరి మొక్కల పాదుల్దగ్గరకు మోసేవాళ్ళు మోసి, పండ్ల చెట్ల కుదుళ్లకు గాదు పూల మొక్కలు పల్లంలో ఉన్నవాటి చుట్టూ పోసి - చదును చేసే పనులు స్వచ్ఛ సుందరోద్యమ శాస్త్రోక్తంగా జరిగిపోయినవి!

         వెంకటాపురం బడిపిల్లలు నలుగురే రావడమూ - అందుక్కారణం ఒంటి పూటబడులీ రోజు నుండే కావడమూ, బోధకులు కూడ ఆగిపోవడమూ, పదో తరగతి పరీక్షల పనుల్లో కొందరుండడమూ, నేటి బక్కచిక్కిన కార్యకర్తల సంఖ్యకు కారణాలు!

         దూరంగా ఉండే పూల మొక్కల కోసం మాత్రం గురవారెడ్డి వాహనం మట్టిని మోసుకెళ్లింది. బడి పిల్లలూ తగ్గిపోయి, వాళ్లతో సమానుడైన చెక్ పోస్టు మాజీ ఉద్యోగి ఆగిపోయి - పనైతే జరిగింది గాని పని సందడి నెమ్మదించింది!

         ఏమైనా ఈ పెదకళ్లేపల్లి రహదారి అదృష్టవంతురాలని చెప్పాలి. 3-4 ఊళ్ల కార్యకర్తలు మూడేసి నాల్గేసి కిలోమీటర్ల దూరాన్నుండి మినపనూర్పిడి రైతులకన్నా ముందే ఇక్కడికి రావడమూ, నెలల తరబడీ దీని స్వచ్ఛ సుందర - హరిత భవితవ్యం కోసం శ్రమించి సాధించడమూ వింతల్లో వింత కాక మరేమిటి?

         నేటి సమీక్షా సభలో స్వచ్ఛ వెంకటాపుర చల్లపల్లి సాధనా నినాదాలను ప్రకటించింది కూడ మేడికొండ సంతోషే!

         రేపటి మన వేకువ కర్తవ్యం కూడ శివరాంపుర సమీప రహదారి మీదనే!

     అంకితులు మన చల్లపల్లికి – 24

అతని వాలకం చూస్తే, వయసు గనుక గమనిస్తే

అసలితడేం చేస్తాడనిఅందరు అనుకొందురు

గంటన్నర అతని శ్రమను కాదన లేరెవ్వరు

అతడు చెక్ పోస్ట్ - అతడు కోడూరతనికే మాజోతలు!

-ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 18.03.2024