1955* వ రోజు....           19-Mar-2020

 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1955* వ నాటి సంగతులు. 

   ఈ నాటి బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని బయలు దేరిన స్వచ్చ కార్యకర్తలు 3 ½  కిలోమీటర్ల దూరంలోని శివరామపురం దారిలో- సమీపంలో గల పంట కాల్వ వంతెన దగ్గర తమ వాహనాలను, పనిముట్ల బళ్లను ఆపి, మూడు ముఠాలుగా వేరు పడి, మువ్విధాలుగా పూర్తి చేసిన స్వయం విధిత స్వ గ్రామ బాధ్యతలు 4.10-6.25 సమయాల నడమ కొనసాగినవి. నేటి ఈ శ్రమదాతలు 30 మంది మాత్రమే! ( గ్రామ జనాభా మాత్రం 30 వేలకు దరిదాపుల్లో!)

1955 రోజులుగా తమ ఊరి వారి ఆనందం – ఆరోగ్య- సుఖ- శాంతుల కోసం సాగుతున్న ఈ కార్యకర్తలకు ఈ పనుల కోసం ఎవరి బెదిరింపులు- ప్రలోభాలు-మెప్పులు- ఆశలు-ముందుకు తరమడాలు- లేవు. అవార్డులు, రివార్డుల కోసం జరిగే పనులు ఇలా ఉండనే ఉండవు. స్వయం విధిత లక్ష్యాలు ఒక్కొక్కటిగా సాధిస్తూ- గమ్యాలకు చేరువౌతున్న ఈ స్వచ్చ వీరాధి వీరులకు నా వినమ్ర పాదాభివందనం!

- నేటి స్వచ్చ శ్రామికుల కఠోర శ్రమదానాలలో కెల్ల నన్ను ముందుగా ఆకర్షించింది గ్రామ రక్షక దళం విన్యాసాలే. SBI- జూనియర్ కళాశాల సమీపంలో 4.00 కన్న ముందే పెద్ద టిప్పర్ నుండి జారి అరగజం ఎత్తున వ్యాపించిన కాంక్రీటు మిశ్రమం ఈ రోజు రెస్క్యూ టీం కు ఆయాచితంగా దొరికిన పెన్నిధి, వెంటనే దాన్ని తమ ట్రాక్టర్ లోకి ఎక్కిస్తున్న వీరి నిస్వార్ధ శ్రమే శ్రమ ! చెమటలు క్రక్కుతూనే వీళ్లు ప్రదర్శిస్తున్న శ్రమ జీవన సౌందర్యం మళ్లీ శ్రీ శ్రీ వచ్చి కవిత్వం రాయదగినదే! గ్రామంలోని ఎక్కడెక్కడి రోడ్ల గుంటల్ని పూడ్చి, మరామత్తు చేసే సరికి ఏ 10 గంటల ఎండ వేళ ఔతుందో! (అప్పటి కప్పుడే వీళ్లకు” మా వీధిలో-మా ఇంటి దగ్గరి రోడ్డు గతుకులు బాగు చేయడంనే” అభ్యర్ధనలు కూడ!)

- కమ్యూనిస్టు వీధి అందాలకు మెరుగులు దిద్దే పనిలో సుందరీకరణ బృందం వాళ్లకి సమయమే తెలియదు. ఒక్కోమారు 7.00 దాటుతున్నా వీరు పట్టించుకోరు! మరొక్క వారంలో ఈ వీధి చల్లపల్లి కంతటికీ మోడల్ గా రూపొందవచ్చు!

- పెద కళ్లేపల్లి బాటలో 16 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమ ఫలించి, గుడిసెల ప్రాంత మంతా శుభ్రమైపోయింది. వంతెన, దాని గోడలు ఇప్పుడు చూచి, కూర్చొని, ఆహ్లాదంగా గడిపేందుకు అనువుగా మారిపోయినవి! అందుకే స్వచ్చ కార్యకర్తలెప్పుడూ “శ్రమయేవ జయతే!” అని పునః పునరుద్ఘాటిస్తుండేది!

6.25 నిముషాలకు శ్రమదానం నేటికి ముగించి, నారంశెట్టి వేంకటేశ్వర మహోదయులు ముమ్మారు ప్రకటించిన స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను మరింత గట్టిగా సమర్ధించి వేంకటేశ్వర రావు గారి 2+2 వేల గత రెండు నెలల స్వచ్చోద్యమ విరాళాలను మనకోసం మనం ట్రస్టు ముఖ్య బాధ్యులు దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు స్వీకరించడం తో నేటి స్వచ్చంద శ్రమదాన కథ ముగిసింది.

రేపటి శ్రమ జీవన వేడుక కూడ శివరామపురం సమీపాననే!

      నిజంగా అది శోభనిచ్చేనా?

క్రియాశీలక స్వచ్చ సైన్యం సుదీర్ఘ సమయం ఊరికై- పం

దొమ్మిదొందల రోజులుగ కడుదూర దృష్టితొ వీధి వీధిని

పారిశుద్ధ్యం నిర్వహించగ- ప్రజలు కొందరు – పెద్దలిందరు

మేన మేషం లెక్క తీస్తూ ఏళ్ల తరబడి పట్టకుండుట స్వచ్చ సుందర చల్లపల్లికి శోభ నిస్తుందా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 19/03/2020

చల్లపల్లి.    

 

4.10 కు శివరాంపురం వంతెన వద్ద
రోడ్డు మీద రద్దు వేయక ముందు
రద్దు వేసి సరి చేసిన తరువాత