3067* వ రోజు....... ....           22-Mar-2024

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

3067* వ నాటి 24 మంది శ్రమ శివరామపురం రోడ్డుకే సమర్పితం!

        శుక్రవారం (22.3.2014) వేకువ సామాజిక బాధ్యతకు పూనుకొన్నది మరీ 4:15 కే! స్ధానికులిద్దరూ, వెంకటాపురం విద్యార్దులైదుగురూ లేకపోతే 20 రోజుల - కిలోమీటరు బారు రహదారి పని రేపటికి మిగిలిపోయేదే! చూస్తుండగానే 40 కి పైగా పని గంటల సామూహిక శ్రమదానం ముగిసింది!

        అసలీ వేకువ పని సందడిలో సింహభాగం షెడ్డర్ అనబడే యంత్రానేదే! ఊళ్లో పాతిక ముప్పై ఇళ్ళ వారికి అది నిద్ర దూరం చేసి ఉంటుంది. నేటి పని వేగాన్ని నియంత్రించింది రకరకాల తుక్కును పొడి చేసిన ఆ యంత్రమే! అందులోకి చెత్తనూ, కొమ్మల్నీ, ఆకుల్నీ, పుల్లల్నీ సరఫరా చేసేందుకు 15 మంది ఉరుకులూ పరుగుల్తో పని చేయక తప్పలేదు.

        ఆ యంత్ర భూతం ఆకలి తీర్చేందుకు తాడిబొందు ముక్కలూ - తాటాకులూ, ఎండూ - పచ్చి గడ్డీ, డ్రైన్ లో పిచ్చి మొక్కలూ అందించినా చాల్లేదు. పని ముగిసిన 6:15 కు దాని గర్జన ఆగేప్పుడు చూస్తే బండెడు పొడి మిగిలింది - అది చల్లపల్లి డంపింగ్ కేంద్రంలో ఎరువు తయారీకి తరలిపోనుంది!

        ఒక ప్రక్కన మన స్వచ్ఛ వైద్యుడేమో అర్జంటు సర్జరీలుండి, కాస్త ముందుగానే నిష్క్రమిస్తే – పని ముగిసిందనుకొంటే - ఇద్దరు ఆకుల – సజ్జా ప్రసాదులు మాత్రం ఒకరి ఇంటి ఎదుట వంకరగా పడి ఉన్న తాడి మొద్దుల్ని గునపాలతో సర్ది రావడం వల్లనే నేటి ముగింపు సమావేశం ఆలస్యమయింది.

        మొత్తానికి 20 రోజుల స్వచ్ఛ కార్యకర్తల ప్రయాత్నం విజయవంతంగా ముగిసింది. శివరామ - వెంకటాపురాల రహదారి శివరాత్రికి ముందెలా ఉన్నదో ఈ శుక్రవారం ఉదయం ఎలా కనిపిస్తున్నదో చూడండి. పండ్ల - పూలమొక్కల రక్షణకు అభయం, కొన్ని రోడ్ల గుంటల పూడిక, డ్రైన్ లోని అడ్డాలకు మోక్షం, దుమ్మూ – ధూళీ తొలగి, బైట పడిన రహదారి సహజత్వం - ఇవన్నీ మన కంటికి కనిపించే వాస్తవాలు.

        మనసుతో దర్శిస్తే కనిపించేది ఇన్ని రోజుల - సుమారు వెయ్యి పని గంటల శ్రమ! ఊహకందేది మరొక ఏడాదిలో ఈ పూల - పండ్ల చెట్లు పూర్తిగా పుష్పించి, ఫలించినప్పటి ప్రాకృతిక సౌందర్యం!

        6:30 న సమీక్షా వేడుకలో స్వచ్చోద్యమ నినాదాలు పలికింది వెంకటాపురం స్కూలు విద్యార్థి మేడికొండ సంతోష్!

        రేపటి వేకువ మన శ్రమ స్థలం విజయవాడ రోడ్డులోని తరిగోపుల ప్రాంగణం సమీపాన అని నిర్ణయమైంది!  

        చిట్టూర్పుకు చెందిన పరుచూరి బాబూరావు గారు మన స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం కోసం నిన్న 1,000/- విరాళం అందజేశారు. వారికి ధన్యవాదములు. 

       అంకితులు మన చల్లపల్లికి – 28

తన నడుముకు బెల్టుతోనే ఆమె నిత్య శ్రమదానం

సుఖవాసి స్వరూపరాణి స్వతహాగ దయార్ద్రగుణం

శివరామపురంబులోన చిన్న సేద్య కుటుంబం

ఆపన్నుల సమస్యలకు ఆమె సదా సంసిద్ధం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  22.03.2024