3068* వ రోజు...........           23-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!


పరిమిత సంఖ్యాకుల 3068* వ నాటి వీధి శుభ్రత!

శనివారం వేకువ (23.3.24) 4.17-6.13 మధ్య - బెజవాడ రోడ్డులోని చిల్లల వాగు వంతెన వద్ద మొదలైన కార్యకర్తల శుభ్ర- సౌందర్య ప్రయత్నం కాటాల దాక- అనగా సుమారటూ - ఇటూ ప్రక్కల 150 గజాల మేర జరిగింది. చెత్త కేంద్రం దగ్గరుండే ఇద్దరు ట్రస్టు కార్మికుల సహకారం వాళ్లకందింది!

ఎప్పుడు మేల్కోన్నారోగాని 4.00 కే బయలుదేరి - 3 కిలోమీటర్ల దూరాన శ్మశాన ప్రాంతానికి చేరి సుమారు రెండు గంటల పాటు ఈ కార్యకర్తలు శ్రమించక పోయినా - ఈ రోడ్డు మీది దుమ్ము పోయి, మార్జిన్ల గడ్డీ గాదమూ తొలగి డ్రైన్లలోని తుక్కూ, పిచ్చి కంపా మాయమై, రెండు ప్రక్కలా బారులు తీరిన చెట్లూ - పూల మొక్కల్లేకపోయినా- ఈ రహదారి ప్రయాణికులు అసౌకర్యం ఫీలవ్వరు!

స్వచ్ఛ కార్యకర్తల శ్రమతో - చెమటతో శుభ్రపడినప్పుడు మాత్రం వారు ఏదో మంచి మార్పును పసిగట్టి ఆహ్లాదం చెందుతారు!  వాళ్ళలో ఏ కొద్ది మందో ఈ రహదారి స్వచ్ఛ- శుభ్ర- సౌందర్యాల, హరిత ఆహ్లాదాల కారణం వేలాది రోజుల కార్యకర్తల దైహిక శ్రమగా గుర్తు చేసుకొంటారు! వారిలో ఏ ఒక్కరైనా తమ తీరిక సందర్భంలో వచ్చి స్వచ్ఛంద శ్రమదానం చేస్తారనే నమ్మకం లేదు!

ఐతే కార్యకర్తలిలాంటి ఆలోచనలు చెయ్యరు; ఎప్పుడైనా ఏ కొత్త కార్యకర్తైన తమతో చేరితే సంతోషిస్తారు - చేరని వాళ్లకు నమస్కరించి, తమ పని తాము చేసుకు పోతారు! అంటే నేటి సామాజిక రౌడీ ఇజాల మధ్య గాంధీఇజ మన్న మాట!

ఒకే ఒక పోస్టల్ ఉద్యోగి వంతెన ప్రాంతాన్ని ఊడ్చి శుభ్రం చేయడాన్ని, ఐదుగురు రహదారి పడమరి డ్రైనును అద్దంలా మార్చడాన్ని,  దంతెలతో కత్తుల్తో తూర్పు డ్రైను కాలుష్యాలను మరో ఐదారుగురు శ్రద్ధగా  బాగుచేయడాన్ని అరగంటకు పైగా సంతోషంగా చూశాను. 

ఆటోనగర్ వీధి మొదట్లో ఇద్దరు సుందరీకర్తలు ఎందుకంత పట్టుదలగా అంగుళమంగుళమూ స్వచ్ఛ పరుస్తున్నారో గమనించాను.

కాఫీ – కబుర్లానంతరం  ఈ ఊరి రక్తదాన ఉద్యమకారుడు కస్తూరి విజయ్ మరీ ఆవేశపడకుండా స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు ప్రకటిస్తుంటే అనుసరించాను.

  “గోపాళం ఫౌండేషన్ వారి వైద్య శిబిర కారణంగా రేపటి వేకువ శ్రమదాన రంగస్థలం కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి దగ్గర” అని ప్రకటించాను!

     అంకితులు మన చల్లపల్లికి – 29

శ్రమనె కాదు - రక్తాన్నీ సమర్పించువిజయుడు 
జనహితచింతనతోడుగ సాగుచున్న ధన్యుడు 
అటు బాధిత రోగులకూ- ఇటు సేవక మిత్రులకూ 
అందుబాటులో నుండేటంత సన్నిహితుడు!

-ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
  23.03.2024