3072* వ రోజు...........           27-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

ఇది 3072*వ వేకువ శ్రమ సమాచారం! 

            వారం బుధవారం!  చల్లపల్లి అందచందాల బాధ్యత మాది' అని దమ్ముగా చెప్పగలిగే 22 మంది స్వచ్ఛంద పౌరులు!  స్థలం విజయ వాటిక రహదారి తూర్పు, ఆటో నగర్ ప్రాంతం ! సమయం ఎప్పట్లాగే 4.18 -6.15 ల మధ్య ! జరిగిన పని వెలకట్టలేనిది!

            ముందుగా పరిశుభ్ర- సుందర శ్మశాన వాటిక ముఖ ద్వారమైన తరిగోపుల ప్రాంగణం ప్రక్కన ఆటోనగర్ వీధి వద్ద10 మంది వాలంటీర్ల శ్రమ వీరాన్ని పరిశీలిస్తే –అంతకు ముందువారం శుభ్ర పరచిన మురుగు కాల్వనే 5 గురు  తనివి తీరా శుభ్ర సుందరీకరించడాన్నే చెప్పుకోవాలి!

            దానికి 60-70 గజాల దక్షిణంగా- నిర్మాణంలో ఉన్న కాలనీ తొలి వీధి వద్ద మరో 10 మంది కత్తులతో, దంతెలతో, చీపుళ్ళతో కాలుష్యం మీద చెలరేగి నది మరొక మరపురాని శ్రమ సన్ని వేశం!  నీళ్లింకి పోయిన లోతైన మురుగు కాల్వలో అన్ని ప్లాస్టిక్ వస్తువులు ఎలా వస్తాయో తెలియదు.

            వాటన్నిటిని తొలగించకపోతే తమ ఊరి వీధుల అందం తెలియదనుకొనే కార్యకర్తలు – కాల్వ గట్టున పెరిగే పనికిరాని మొక్కల్ని నరికేశారు, బాటనూ దాని మార్జిన్లనూ ఊడ్చారు, నీటి- మద్యం సీసాల్ని ఏరారు, కాల్వలోని గడ్డినీ అంతం చేశారు! గంటన్నరకు పైగా ఇలా శ్రమిస్తున్న కార్యకర్తలతో బాటు పని చేయలేదు గాని – ఏవో సూచనలిస్తున్న ఒక వ్యక్తిని గమనించారు!

       6. 15 దాక ఇలా కష్టించి, తమ సామూహిక సామాజిక శ్రమ వితరణకు సంతృప్తి చెంది,

            చల్లపల్లిలో తప్ప - ఇందరు స్నేహ శీలురు ఇంత బాధ్యతగా, ఇంత కష్టమైన మురికి పనులు ఎవరు చేస్తారు?’ అని ఆశ్చర్యపడే Dr.డి.ఆర్.కే సమీక్షా వచనాలు విని,

             వేముల శ్రీనివాస మహోదయుని గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలకు బదులుచ్చి,

            రేపటి వేకువ ఆటోనగర్ వీధి వద్ద కలుసుకోవాలనే నిర్ణయంతో – ఇళ్ల బాట పట్టారు!

 

          అంకితులు మన చల్లపల్లి కి – 32 to35

వారి కీర్తే శేష మాయెను- జ్ఞాపకాలే మిగిలిపోయెను

ఒకడు కైలా నాంచారయ్య- ఒకడు వాసన కృష్ణారావు

 నజీముల్లా ఖాన్ జనాబ్ మన  ఆత్మ పరబ్రహ్మ రూపులు

వారి బ్రతుకులు కాస్త చిన్నవి -వారి సేవలు మహాదొడ్డవి!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  27.03.2024