1956*వ రోజు....           20-Mar-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1956* వ నాటి శ్రమదాన కథనం. 

30 మంది స్వచ్చంద కార్యకర్తల భాగస్వామ్యం ఉన్న ఈ నాటి స్వచ్చ సుందర ప్రస్థానం వేకువ 4.08-6.10-7.10 నడుమ చల్లపల్లి లోను, 3 ½ కిలో మీటర్ల దూరపు పెదకళ్లేపల్లి దారిలోని ఒక పంట కాలువ వంతెన కేంద్రం గాను నిరాటంకంగా సాగింది.

కమ్యూనిస్టు వీధిలో రెండు ఇళ్ల ప్రహరీలకు కళ తగ్గి కనిపిస్తే ఈ కార్యకర్తలకెందుకు? చల్లపల్లికి 3 ½ కిలో మీటర్ల దూరంలో పంట కాల్వ వంతెన దగ్గర పడిపోయిన గుడిసె ప్రజలకు, వాహనాలకు ఇబ్బందిగా ఉంటే స్వచ్చ కార్యకర్తలు ఇన్ని రోజులుగా వందల కొద్దీ పని గంటలు శ్రమించి, తొలగించి, శుభ్ర పరచి రావాలా? ఎక్కడెక్కడి కాలుష్యాలు, రోడ్ల గుంటలు, మురుగు కాల్వలు, అందవిహీనతలు వీళ్లకే పట్టడమెందుకంటే- మరి, అదే సామాజిక బాధ్యతంటే! సమాజం నుండి తీసుకున్నందుకు కొంతైనా తిరిగి చెల్లిస్తున్న ఈ ధన్యులకు మరొకసారి వందనం!

- 18 మంది కార్యకర్తల- 30 పని గంటల శ్రమతో పంట కాల్వ వంతెన, దాని ఉభయ దరులు, ఉత్తర గట్టు మలుపులో 3 వంతులు పడిపోయి, అసహ్యంగా ఉన్న పూరి గుడిసె అన్నీ తొలగి, పూడి, శుభ్రమైపోయినవి.

- సుందరీకరణ బృందం సామ్యవాద వీధిలోని మరొక ఇంటి ప్రహరీ గోడ మీద- సరి క్రొత్త ఊహలను సాకారం చేస్తూ – ఒక గిరిజన మహిళను కాబోలు- చిత్రీకరిస్తూ 7.10 సమయం దాక గడిపారు.

ఏ రోజూకారోజు- స్వచ్చ కార్యకర్తలు ఇష్టంగా, స్వీయ బాధ్యతగా నిష్టగా నిర్వహిస్తున్న ఈ స్వచ్చోద్యమాన్ని సామాజిక చరిత్ర కారులు గమనించాలని మనవి!

6.35 కు పంట కాల్వ వంతెన మీద జరిగిన నేటి స్వచ్చ శ్రమదాన సమీక్షా సమావేశంలో పసుపులేటి శ్రీనివాస్ ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలతో నేటి మన ఉద్దేశ్యం నెరవేరింది!

రేపటి మన కృషి విజయవాడ దారిలోని తరిగోపుల ప్రాంగణం దగ్గర ప్రారంభించాలి!

       ఇదే నేటి మార్గదర్శి

బడుగు జీవి మొదలు రాష్ట్రపతి కెవ్వరి కిక తప్పదు

పర్యావరణ భద్రతయే ప్రప్రథమోత్తమ బాధ్యత

అదే దారి పయనించే స్వచ్చోద్యమ చల్లపల్లి

ఈ విశాల ప్రపంచానికి కిదే గొప్ప మార్గదర్శి!  

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 20/03/2020

చల్లపల్లి.    

4.07 కు శివరాంపురం వంతెన వద్ద
ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రక్క ఉన్న గుంటను పూడ్చుతున్న కార్యకర్త