3078* వ రోజు...........           02-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

గ్రామ శుభ్రతా/ భద్రతా దళం వారి 3078* వ నాటి ప్రయత్నం!

         అనగా మంగళవారం – 2/4/24 వ వేకువ సమయానిదన్నమాట! - ప్రయత్నకారులు నికరంగా నలుగురు, వాళ్ళను పదండి ముందుకు... అని ప్రోత్సహించింది 76 ఏళ్ల ఒక పెద్దాయన, ఈ 5 గురికీ మధ్యలో వచ్చి ఎంతో కొంత సహకరించింది మత్తి వెంకట రామారావు.

         రెస్క్యూదళం తొలుత గస్తీ గది దగ్గర కలుసుకొన్నది 4:20 కి, అక్కడికి 2 కిలోమీటర్ల దూరాన - NH216  కాసానగర్ వైపున ఆగి, పనిచేసింది 6:05 దాక - తిరిగి గస్తీ గది వద్దకు చేరుకొని, BSNL నరసింహుని నాయకత్వంలో స్వచ్ఛ సుందర గ్రామ నినాదాలు ప్రకటించింది 6:15 కు!

         మరి సుమారు 2 గంటలు తమ విలువైన సమయాన్నీ, శ్రమనూ సమర్పించి వాళ్లేం సాధించారు?

         వీళ్లు కాయకష్టజీవులు – తమ కోసం కాదు, తమ ఊరికోసం!

         అదీ ఒకటో - రెండో నాళ్లు కాదు -3078* దినాలు!

         వాళ్ల కష్టం వృథా పోలేదు - ఊరి రోడ్ల గుంటలకూ, చెట్ల కొమ్మల క్రమబద్ధీకరణకూ పనికొచ్చింది!

         “ఇంత పెద్ద గ్రామాన్ని మనం కొద్దిమందిమి ఏం ఉద్దరిస్తాంలే అని వాళ్లు కాడి క్రింద పడేయలేదు - సుదీర్ఘకాలంగా గ్రామ వీధుల్నీ, పబ్లిక్ చోటుల్నీ సంస్కరించగలిగారు!

         ఈ మంగళవారం వేకువ వాళ్ల ఆలోచనా, అమలూ ఏమంటే:

- నిరుపయోగంగా జాతీయ రహదారి మీది తాడిచెట్టును ఎవరో కొట్టి పడేస్తే, ఉభయతారకంగా - దాన్ని గంగులవారిపాలెం వంతెన దగ్గరకు చేర్చడమూ, బండ్రేవుకోడు మురుగు కాల్వ అంచుకూ – రోడ్డుకూ భద్రత కల్పించడమూ!

         ఆ విధంగా తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించిన సంతృప్తి పొందడమూ!

         రేపటి మన విస్తృత కార్యకర్తలు కలుసుకొని, ఆదివారం నాటి పని కొనసాగించవలసింది విజయవాడ బాటలోని ఆటోనగర్ వద్దనే!

   అంకితులు మన చల్లపల్లికి – 41, 42

కేవలం ఏడేళ్ల బుడతలు గ్రామ సేవకు తరలి వస్తే –

లేత చేతులు చీపురులతో దుమ్ము - ధూళిని ఊడ్చుతుంటే –

ఆర్య - ఆరవ్ గళ వినిర్గళ నినాదమ్ములు మ్రోగుతుంటే –

స్వచ్ఛ - సుందర చల్లపల్లికి అదొక అచ్చట – అదొక ముచ్చట!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  02.04.2024