3084* వ రోజు...........           08-Apr-2024

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

సోమవారం (8/4/2024) నాటి కష్టతర కృషి - @3084*

          రెస్క్యూ టీమ్ ఉన్నదే కఠినమైన గ్రామ సమస్యాత్మకమైన - బరువు పనుల పరిష్కారం కోసం. చెట్లెక్కేందుకూ, రోడ్ల గుంటల పూడికకూ, రోడ్ల పరిరక్షణకూ వాళ్లు ఎప్పుడు వెనకాడారు గనుక!

          ఈ వేకువ కూడ అంతే! 4:16 నుండే సిద్ధపడిన నలుగురు కరుడు గట్టిన స్వచ్ఛ కార్యకర్తలూ, వాళ్లకుతోడు ముగ్గురమూ, చిట్టచివరగా 8 వ కార్యకర్తా గంగులవారిపాలెం బాటలో బండ్రేవుకోడు మురుగుకాల్వ దగ్గర గంటా ఏభై నిముషాలు రోడ్డు బాగుదలకూ, సుందరీకరణకూ ప్రయత్నించారు!

          నేటి పనికి నాందిగా 3 కిలోమీటర్ల దూరంలోని పెదకళ్లేపల్లి రోడ్డులో పొలం గట్టున పడి ఉన్న తాడి చెట్టు మొద్దును ట్రాక్టరుకు బంధించి తీసుకొచ్చారు. గతవారం చేర్చిన మరొక చెట్టునూ, ఇప్పటి చెట్టునూ రోడ్డుకు రక్షణగానూ, అందం చెడకుండానూ అమర్చడమే ఈ వేకువ కార్యక్రమం!

          ఈ మూడు నాలుగొందల గజాల రోడ్డు భద్రత కోసమూ, మార్జిన్ మట్టి కోసుకుపోకుండానూ, పబ్లిక్ రహదారి మనుగడకూ వారాలు - నెలల తరబడీ ఇందరు శ్రమిస్తున్నారనేదే పెద్ద విశేషం!

          అసలు శారీరకంగా కష్టించే తత్త్వమే అడుగంటిపోతున్న ఈ కాలంలో తమ కోసం కాక ఊరంతటి సౌకర్యం కోసం ప్రతిఫలాపేక్ష రహితంగా దశాబ్దకాలంగా నానా కష్టాలూ పడుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలకు అభివందన చందనాలు!

          చివరకు ఈ కార్యకర్తలు తమ శ్రమదాన సంకల్పానికి గుర్తుగా మాలెంపాటి అంజయ్య నాయకత్వంలో ముమ్మారు గ్రామంపట్ల నిబద్ధతను నినాద రూపంలో ప్రకటించారు!

          బత్తిన ఉమాదేవి గారు (విశ్రాంత పోలీస్ ఉన్నతోద్యోగి అయిన శ్రీనివాస్ గారి సతీమణి) తమ నెలవారీ 5000/- చందాను ట్రస్టు ఖాతాకు ఆన్లైన్ లో పంపినందుకు ఉభయ దాతలకు మన కృతఙ్ఞతలు.

 అంకితులు మన చల్లపల్లికి 54

సాధనాల సతీష్ అనే స్వచ్చోద్యమకారుడు

చెక్క పనుల మెలకువలో చాల సిద్ధహస్తుడు

కఠినమైన సేవలలో యువక దళం సభ్యుడు

మైకులు నిర్మించి ఇచ్చు సాంకేతిక నిపుణుడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త  

 

  08.04.2024