3085* వ రోజు...........           09-Apr-2024

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

మళ్లీ అదే చోట శ్రమించిన రెస్క్యూ దళం! - @3085*

          మంగళవారం - క్రోధి నామసంవత్సర తొలి బ్రహ్మ ముహూర్తం – 4:18! తమ ఊరి చైతన్యమే - సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే 5 గురికి అంతకు ముందే మెలకువ వచ్చింది! అక్కణించి 6:12 దాక - సుమారు 2 గంటల పాటు – ఒక చిన్న (గంగులవారిపాలెం) వీధిలోని పుష్ప - హరిత - సంభరిత రహదారి భాగం సంరక్షణకు పూనుకొన్నారు.

          “నాకుగాదులు లేవు – నాకుషస్సులు లేవు...” అని ఒక భావకవి - కృష్ణశాస్త్రి వ్రాసుకొన్న సందర్భం వేఱు - ఉగాదైనా, సంక్రాంతైనా, రంజాన్ ఐనా మా గ్రామ బాధ్యతల్లో మార్పులేదు - మాకు చాతనైనంత ప్రయత్నం చేస్తూనే ఉంటాం” అనే ప్రతిజ్ఞాపాలకులకు - సామాజిక శ్రమ పండగ కార్యకర్తలకు ఏ ఉదయమైనా ఒక్కటే!

          వీళ్ళు అప్పుడు - సరాసరి శివరామపురం రోడ్డు దగ్గర పడున్న తాడి చెట్టును మోకుల్తో ట్రాక్టరు కనుసంధించి, 3 కిలోమీటర్ల దూరంలోని బండ్రేవుకోడు కాల్వ వంతెన వద్దకు చేర్చి, ఏదో విసిరేసినట్లుకాక - రోడ్డుకు 4 అడుగల దవ్వున అందంగా అమర్చి, దేసు ప్రభాకరుని దాతృత్వంగా దొరికిన రద్దునంతకు ముందే అచ్చటకు చేర్చి, అందులోని నాపరాళ్ళను ఎంత అందంగా పేర్చి, 6:12 కి తామనుకొన్న పని ముగించారో గమనించండి!

         స్వచ్ఛ కార్యకర్తల ఈ ఉగాది పని వేడుకలో ఒక ఉషోదయ పాదచారుడు - గొల్లపూడి కోటేశ్వరుడు తన శ్రమ సంఘీ భావం ప్రకటించాడు. వీళ్లంతా పద్మాభిరామం ఎదుట మళ్లీ మాలెంపాటి అంజయ్య స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలనొకమారు పునరుద్ఘాటించగా..

          ఈ కార్యకర్తలకు, ట్రస్టు ఉద్యోగులకు, కొసరుగా కొందరు వచ్చే పోయే వారికి పల్నాటి అన్నపూర్ణ గారి పులిహోర – ఉగాది పచ్చడి సంతర్పణ జరిగింది.

          పండగ మీద పండగలాగా రేపు రంజాన్ వచ్చింది. గత 3/4 ఏళ్ళలాగే – ప్రార్థనలు చేసుకొనే ముస్లిం సోదరులకు సహకారంగా - రేపటి వేకువ శ్రమదానం శ్రీనగర్ దర్గా వద్దకు మార్చుట సమంజసమని భావించడమైనది.

          కనుక రేపు వేకువ మన కలయిక నడకుదురు – అవనిగడ్డ రోడ్ల మధ్య గల “ఈద్గా” ముఖద్వారం వద్దనే!

           అంకితులు మన చల్లపల్లికి 55

ఊరిమేలుకు ప్రాకులాడే స్వచ్ఛ - సుందర కర్మ వీరుడు

దశాబ్దంగా సంఘసేవల తరిస్తుండే ఘర్మధారుడు

ప్రస్తుతానికి రెస్క్యూ చర్యకు పరిమితంగా నిలుచు యోధుడు

అతడు లక్ష్మణ నామధేయుడు - అందరికి తగుమార్గదర్శుడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త  

 

  09.04.2024