1957*వ రోజు....           21-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!      

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1957* నాటి ఉద్యమ ప్రస్తావన.

            గతంలో కన్నా కొంత ప్రత్యేకంగా చిల్లలవాగు ప్రక్క తరిగోపుల ప్రాంగణం లో తమ వాహనాలు నిలిపి ట్రాక్టర్ నుండి తమ పనిముట్లను తీసుకొని 20 మందికి పైగా స్వచ్చ కార్యకర్తలు చల్లపల్లి దిశగా విజయవాడ మార్గంలో పని ప్రారంభించారు. 4.08 నుండి -6.07 దాక దారికిరుప్రక్కల చుట్టు ప్రక్కల స్వచ్చ శుభ్రతలను సాధించే పనికి దిగారు.

            3.30 కే మేల్కొని, ఇల్లు వదలి మురుగు గుంటలు, రోడ్ల గుంటలు, శ్మశానాలు.... వగైరాలు వెతుక్కుంటూ కశ్మలాలను తొలగించుకుంటూ 1957 రోజులు నిరాటంకంగా గ్రామ స్వచ్చ శుభ్ర సుందర ప్రస్థానం చేసే వారికి ఈ పని, ఆ పని అని భేదమేముంటుంది? కత్తులతో పిచ్చి మొక్కలను నరికే వాళ్ళు, కొడవళ్ళతో డ్రైన్ లోపలి గడ్డిని చెక్కేవాళ్లు, అస్తవ్యస్తంగా ఉన్న చెట్ల కొమ్మలని సవరించే వాళ్ళు, చీపుళ్లతో ఇన్ని రకాల వ్యర్ధాలను ఊడ్చి పోగులు పెట్టి, డిప్పలలోకి ఎత్తి, ట్రాక్టర్ లో నింపి సమీపంలో ఉన్న చెత్త కేంద్రానికి చేర్చే వాళ్ళు ఇలా ఈ స్వచ్చోద్యమ కధ చిన్న భేదాలతో ఇన్ని రోజులుగా జరుగుతున్నదే.

         కాకపోతే ఈరోజు ప్రత్యేకత ఏమంటే – గత వారంలో విద్యుత్ శాఖ వారు నిర్ధాక్షిణ్యంగా నరికి, విచక్షణారహితంగా కళావిహీనం చేసిన విజయవాడ దారిలోని తూర్పు వైపు చెట్ల కొమ్మలను ట్రాక్టర్ లో కెత్తడం, ఆ మొండి చెట్లను కూడా ముందు ముందు అందంగా చిగురించేట్లు ప్రయత్నించడమే తానెంతో కష్టపడి, ఐదేళ్లుగా ప్రేతో పెంచిన చెట్లన్నీ విషాదకరంగా మొండివై పోవడాన్ని చూసి బాధ దిగమ్రింగుతూ వారీపని చేయడం చూస్తే  నా బోటి వాళ్లెందరికో బాధ కలుగుతున్నది. (చల్లపల్లి నివాసితులు ఎవరైనా ప్రకృతి ప్రేమికులు కాకున్నా దయచేసి ప్రకృతి ద్వేషులు కావద్దని మనవి!)

            కమ్యూనిస్ట్ వీధిలో ఆరేడుగురి సుందరీకరణ పరిపూర్ణత బహుశా రేపో, మాపో పూర్తి కావచ్చు. వారు ఈరోజు నిన్న, మొన్నటి కన్నా భిన్నమైన రంగుల్ని, చిత్రాలను ప్రయత్నిస్తున్నారు.

నేటి స్వచ్చ సుందర కృషి సమీక్షా సమావేశంలో:

- అనివార్యంగా ముంచుకొస్తున్న కరోనా ముప్పు ప్రస్తావనకొచ్చింది. కార్యకర్తలకు గుడ్డ మాస్కులు రేపు అందజేయబడతాయని తెలిపారు.

- కాంపౌండర్ వక్కలగడ్డ వేంకటేశ్వరరావు నమస్కారపూర్వకంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్చ శుభ్ర సుందర సంకల్ప నినాదాలతో కార్యకర్తలు ఏకీభవించి, 6.40 నిముషాలకు కొందరు ఇంటి ముఖంగా, కొందరు కమ్యూనిస్ట్ వీధి దిశగా బయలుదేరారు.

            రేపటి మన స్వచ్చంద శ్రమదాన కార్యరంగం విజయవాడ మార్గంలోని కాటా ఆవరణ సమీపమని గమనించాలి.

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 21/03/2020

చల్లపల్లి.   

4.08 కు తరిగోపుల ప్రాంగణం వద్ద