1958*వ రోజు....           22-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1958* వ నాటి ఉద్యమ ప్రస్తావన.

            స్వచ్ఛ గ్రామోద్యమ వేళల్లో కరోనా కర్ఫ్యూ వలన జరిగిన మార్పు – నేటి శ్రమదాన సమయం 4.01 నుండి - 5.40 దాక. కమ్యూనిస్ట్ వీధి, విజయవాడ మార్గంలలో, ఇంకా ఇతరత్రా 40 మంది కన్న ఎక్కువగా కష్టించి, అనుకొన్నది సాధించారు.    

            ముందుగా – విజయవాడ దారిలోని కాటా ప్రాంగణంలో వాహనాలను నిల్పి, కొందరు కమ్యూనిస్ట్ వీధి సుందరీకరణకు పోయి, మిగిలిన వారు ఇక్కడే మిగిలి, ఈ దారికిరుప్రక్కల – బాలాజీ అపార్ట్మెంట్స్ దాక – డ్రైన్లను, గట్లను అన్ని విధాలుగా శుభ్రపరుస్తూ పోయారు. 

            10 రోజుల నాడు విద్యుత్ శాఖ కార్మికుల ధ్వంసనచణ విహారంతో కళా విహీనమైన మొండి చెట్లకు మళ్ళీ కొన్నాళ్లకైనా క్రొత్త కళ వచ్చే వ్యూహంతో కొందరు మరమత్తు చేపట్టారు. ఐదారుగురు చీపుళ్ళ వారు కటిక చీకట్లోనూ దారినంతా ఊడ్చుతూనే ఉన్నారు. కత్తులు – దంతెల కార్యకర్తలు ఈ దారి పొడుగునా ఏ చిన్న అశుభ్రత – అనాకారతలు కనిపించినా చక్కదిద్దుకుంటూ ముందుకు సాగారు! ఇందులో ఒక్కరు ఎక్కడ ఏ కార్యకర్తకు దాహం వేసినా మంచి నీళ్లందిస్తున్నారు! పనిలో మునిగిన కార్యకర్తలంతా వేగంగా వస్తూపోతున్న ద్విచక్ర – చతుశ్చక్ర వాహనాలకు దూరంగా జరగమని ఒకరు హెచ్చరిస్తూ పర్యవేక్షిస్తున్నారు! ఇక అక్కడేమో సుందరీకరణ దళం వారు తమ 15 రోజుల చిత్రాకళా పరిజ్ఞానాన్ని పరీక్షించుకొంటునే ఉన్నారు!

            ఒక వేళ – ముందు ముందు  కరోనా నిర్బంధ దురాక్రమణలు పెరిగి, 2000 రోజుల ఈ స్వచ్చోద్యమం (అనరాదు గాని – అమంగళం ప్రతిహతమగుగాక!) కొన్నాళ్లు ఆగిపోతే – చల్లపల్లి స్వచ్చ – సుందర – పరిశుభ్ర ప్రస్థానం ఏంకాను? ప్రజలంతా స్వచ్చ కర్తలుగా మారకపోతే ఈ పౌర సమాజం ఆరోగ్యం గతి ఏమిటి?

            RTC – తోట నాగేశ్వరరావు నిర్ద్వందంగా ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ - సుందర సంకల్ప నినాదాలు మారుమ్రోగి, కరోనా వైరస్ నిర్మూలన దిశగా నేటి జనతా కర్ఫ్యూ ను అందరం పాటించాలని నిర్ణయించి, గుడ్డ మాస్కూలందుకొని 6.00 కు గృహోన్ముఖులయ్యారు.

            రేపటి కర్తవ్య దీక్ష కోసం విజయవాడ మార్గంలోని కాటా ఆవరణ సమీపం దగ్గర కలుద్దాం.

          మాసచివుడు – మా నేస్తం...

మా నేస్తం – మా సచివుడు – మా బంధువు స్వచ్చ భటుడు

హితాభిలాష – కష్టజీవి – స్వార్ధరహిత సేవకుడూ

స్వచ్చ కార్యకర్తె మార్గ దర్శకు డాదర్ముడ నీ

గ్రామస్తులంత అతని వెనుక కదలే రోజొస్తుందని...   

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

దివారం – 22/03/2020

చల్లపల్లి.   

4.01 కు విజయవాడ రోడ్డులో